తిరుమల, 29 నవంబరు (ప్రజా అమరావతి);
శేషాద్రి స్వామి మరణం టీటీడీకి తీరని లోటు : ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ గా సుమారు నాలుగున్నర దశాబ్దాలు స్వామివారి సేవకు అంకితమై, పునీతులైన శ్రీ పాల శేషాద్రి మరణం పట్ల టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
1978 నుంచి శ్రీవారి సేవలో తరిస్తున్న శ్రీ శేషాద్రి స్వామి మరణం టీటీడీ కి తీరని లోటని ఆయన చెప్పారు.
వైజాగ్ లో సోమవారం టీటీడీ నిర్వహించనున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన శేషాద్రి స్వామి స్వామివారి సేవలోనే తనువు చాలించారని ఈవో చెప్పారు. శ్రీవారికి వైఖానసా ఆగమోక్తంగా నిర్వహించే దిన, వార, పక్ష, మాస, సాలకట్ల సేవలు, ఉత్సవాల నిర్వహణలో జియ్యంగార్లు, ఆలయ అధికారులు, అర్చకులకు ఆయన సంధాన కర్తగా వ్యవహరించారన్నారు.
శ్రీవారి ఆలయంలో సేవలు, కైంకర్యాలు, ఉత్సవాల నిర్వహణ, విధుల కేటాయింపు అంశాలను క్రోఢీకరించిన శేషాద్రి స్వామి పుస్తకాలు భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. టీటీడీ లోని వివిధ ఆలయాల్లో సంప్రోక్షణ, బాలాలయ, వైదిక కార్యక్రమాలు, బయటి ప్రాంతాల్లో నిర్వహించిన కళ్యాణోత్సవాలు, శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తుల ముంగిటికి తీసుకుని వెళ్ళడానికి సంస్థకు ఆయన అందించిన సహకారం మరువలేనిది ఈవో చెప్పారు.
శ్రీ పాల శేషాద్రి స్వామి 1948 జూలై 15 వ తేదీ తిరుపతిలో జన్మించి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మీద ఉన్న అపారమైన భక్తి వల్ల 1978లో టిటిడిలో ఉత్తర పార్ పత్తేదార్ గా ఉద్యోగం లో చేరి,
2007లో బొక్కసం ఇన్ఛార్జి గా ఉద్యోగ విరమణ చేశారని చెప్పారు. ఉద్యోగ విరమణ నుంచి నేటి వరకు ఆయన 43 సంవత్సరాలుగా స్వామివారి సేవలో తరించారని ఈవో తెలిపారు.
శ్రీ శేషాద్రి స్వామి కుటుంబ సభ్యులకు టీటీడీ తరపున, తాను వ్యక్తి గతంగా సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.
addComments
Post a Comment