బీసీ కులగణన చేపట్టాలంటూ తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి చెల్లుబోయిన


అమరావతి, శాసనసభ (ప్రజా అమరావతి);


*బీసీ కులగణన చేపట్టాలంటూ తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి చెల్లుబోయిన*


*కులాల వారీగా బీసీ గణన చేపట్టాలని తీర్మానం*


*బీసీ కులగణన వల్ల పేదలకు ఎంతో ఉపయోగకరం*


*వెనకబడిన కులాల జనగణన అత్యవసరం*


*సంక్షేమ పథకాల అమలుకు ఇది ఎంతో అత్యవసరం*


*బీసీ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ*


- వెనుకబడిన తరగతుల జనాభా గణన కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ భారత ప్రభుత్వాన్ని కోరుట గురించి.. శాసనసభ నిర్వహణ, నియమాల సంఖ్య 77 ప్రకారం సభలో తీర్మాన్ని బీసీ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అనేక మంది బీసీల చిరకాల వాంఛ, కోరిక తీరదనే భయం ఉంది. వీటన్నింటినీ అధిగమించి ఈ తీర్మానం ద్వారా బీసీల మనోభావాల్ని, ఆత్మగౌరవాన్ని, భద్రత కల్పించే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, శాసనసభాపతి తమ్మినేని సీతారాంకు మంత్రి చెల్లుబోయిన కృతజ్ఞతలు తెలిపారు. 


1) వెనుకబడిన తరగతుల వారు సమాజమునకు వెన్నెముకగా ఉన్నప్పటికీ వారు తగినంతగా ప్రయోజనాలు పొందుట లేదని మరియు వారు కోరుకున్న కనీస అభివృద్ధి స్థాయిలను కూడా సాధించలేదని ప్రభుత్వము గమనించి ఈ అంశమును సభ ముందు ఉంచుతున్నా.


2) వెనుకబడిన తరగతుల యొక్క ప్రయోజనాల పరిరక్షణ కోసం, నిర్థిష్ట సంక్షేమ అభివృద్ధి విధానాలు రూపొందించడానికి మరియు వాటిని సమర్ధవంతంగా అమలు చేయడానికి వారి జనాభాకు సంబంధించిన ఖచ్చితమైన గణాంకాలు మరియు వారి సామాజిక విద్యా మరియు అభివృద్ధికి సంబంధించిన గణాంక వివరాలు చాలా ముఖ్యమైనవి.


3) కానీ, వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఖచ్చితమైన జనాభా గణాంకాలు లేకపోవుట వల్ల వారిని అభివృద్ధి చేయుటకు తగిన సంక్షేమ చర్యలు తీసుకొనుటకు ఇది ఒక ప్రతిబంధకముగా ఉంది. 


4) దేశములో చివరిసారిగా కులగణన 1931 సంవత్సరంలో (స్వాతంత్య్రం రాకమునుపు, బ్రిటిష్ పాలనలో) జరిగినది. అప్పటికి దేశ జనాభా కేవలం 30 కోట్లు మాత్రమే. అంతేకాక, ప్రస్తుత పాకిస్తాన్, బంగ్లాదేశ్ జనాభా కూడా ఇందులో కలిసి ఉన్నవి. అయితే, ప్రస్తుత దేశ జనాభా సుమారు 130 కోట్లు. 1931 నుండి 90 సంవత్సరాలులకు పైగా కులగణన నిర్వహించని ఫలితంగా నాటి జనాభా ఆధారంగా వేసిన అంచనా జనాభా గణాంకాలపై ఆధారపడాల్సి వస్తుంది. 


5) వెనుకబడిన తరగతుల ఖచ్చితమైన జనాభా గణాంకాలు ఉంటే సరైన విధానాలు రూపొందించడం, వాటిని సమర్థవంతంగా అమలు చేయడం సాధ్యమవుతుంది. రిజర్వేషన్లు, వివిధ సంక్షేమ చర్యలు వంటి కొన్ని నిర్ణయాత్మక విధానాల రూపకల్పనకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. నిజమైన నిరుపేద లను గుర్తించుటకు, అర్హత లేని లబ్దిదారులను తొలగించి విలువైన ప్రభుత్వ వనరులను సద్వినియోగమునకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 


6) ప్రస్తుత తరుణంలో వెనుకబడిన తరగతుల ప్రయోజనాల పరిరక్షణకు తగు విధానాల రూపకల్పనకు, వాటిని సమర్థవంతముగా అమలు చేయుటకు వెనుకబడిన తరగతుల కులగణన అత్యవసరం.


7) మన దేశంలో జనాభా గణన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుట జరుగుతోంది. ఇందులో షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, మైనారీటీల జనాభాను లెక్కించుట జరుగుతోంది. కానీ, సమాజంలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల జనగణన అమలు చేయటం లేదు. ఇది ఎంతో అవసరం. అయితే, దేశంలోని వెనుకబడిన తరగతుల జనగణన, వెనుకబడిన తరగతుల వర్గాల సామాజిక విద్యా మరియు ఆర్థిక వెనుకబాటుతనాన్ని అంచనా వేయడానికి శక్తివంతమైన సాధనంగా ఉపకరిస్తుంది. తద్వారా, ప్రభుత్వం వారి అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 (4), 16 (4) మరియు మరికొన్ని రాజ్యాంగ నిబంధనల అమలుకు ఇది ఎంతో దోహదపడుతుంది.


8) వెనుకబడిన తరగతులకు చెందిన మేధావులు, వెనుకబడిన తరగతుల ప్రయోజనాలు, బీసీల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే సంస్థల విజ్ఞప్తులను దృష్టి ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల జనాభా గణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో తీర్మానాన్ని ఆమోదించుటకు ప్రతిపాదించడమైంది.


9) పైన పేర్కొన్న వాటితో పాటు, ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు రూపొందించిన విధానాలను, వివిధ రంగాలల్లో వారు సాధించిన పురోగతిని, విద్య, ఉపాధి మరియు ఇతర రంగాలలో వెనుకబడిన తరగతులు మరియు ఇతర కులాలతో పోల్చి వారి, వారి నిష్పత్తిని విశ్లేషణాత్మకముగా పరిశీలించుటకు వెనుకబడిన కులాల జనగణన అత్యంత అవసరము.


10) వెనుకబడిన తరగతుల జనాభా గణన సమాజంలోని అభివృద్ధి చెందిన కులాలతో సమానంగా వెనుకబడిన తరగతుల వారిని కూడా సామాజికంగా, విద్యా పరంగా, ఆర్థికపరంగా వారి అభివృద్ధిని సులభతరం చేస్తుంది. అంతేకాకుండా, వెనుకబడిన తరగతుల జనాభా గణన కొరకు వివిధ సంస్థలు, మేధావులు వారి ఆలోచనాపరుల దీర్ఘకాల డిమాండును ఆమోదించినట్లు అవుతుంది. 


11) దీనికి సంబంధించి 28-10-2021న సమావేశము అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి కేంద్ర ప్రభుత్వాన్ని 2021 సాధారణ జనాభా గణన చేపట్టినప్పుడు వెనుకబడిన తరగతుల జనాభా గణన చేపట్టవలసినదిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసన సభ ద్వారా ఒక తీర్మానాన్ని ఆమోదించి పంపుటకు వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిని కోరుతూ మంత్రి మండలి ఏకగ్రీవముగా తీర్మానించిటమైనది. 


12) భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరచబడిన సమ సమాజ స్థాపనకు నాంది పలికేందుకు, సమాజంలోని అన్ని వర్గాల వారిని సమానముగా ఉద్ధరించుటకు గానూ, ఖచ్చితమైన జనాభా గణన నిర్వహించడం ఎంతో అవసరం. అన్ని వెనుకబడిన తరగతుల వర్గాల గణాంకాలు, వారి సంక్షేమం మరియు అభివృద్ధి కొరకు ..కొన్ని నిర్ణయాత్మక చర్యలు తీసుకొవటానికి, ఇతర వివిధ సంక్షేమ చర్యలను చేపట్టుటకూ మరియు వారిలో అత్యంత పేద మరియు వెనుకబడిన వారిని గుర్తించుటకూ వెనుకబడిన తరగతుల జనాభా గణన ఎంతో అవసరం. 


- రాజ్యాంగంలోని ఆర్టికల్ 15లోని క్లాజ్ (4) మరియు క్లాజ్ (5), ఆర్టికల్ 16 లోని క్లాజ్ (4), ఆర్టికల్ 243 (డి)లో క్లాజ్ (6) మరియు ఆర్టికల్ 243 (టి) లోని క్లాజ్ (6) నిబంధనలను సమర్థవంతంగా అమలుచేసే ఉద్దేశ్యంతో వెనుకబడిన తరగతులలోని పౌరులకు సామాజికంగా మరియు విద్యా పరంగా ప్రయోజనాలందించేందుకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు మైనారిటీలతో పాటు 2021 సాధారణ జనాభా గణనను నిర్వహించేటప్పుడు సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారిని కులాల వారీగా జనాభా గణన చేపట్టవలసిందిగా 15వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ భారత ప్రభుత్వాన్ని కోరుతోందని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తీర్మాన్ని ప్రవేశపెట్టారు.

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image