భాధితులకు వీలైనంత ఎక్కువ సేవ చేయాలని తపన


నెల్లూరు నవంబర్ 29 (ప్రజా అమరావతి):


భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు త్వరితగతిన సహాయం అందించి భాధితులకు  వీలైనంత ఎక్కువ సేవ చేయాలని  తపన


పడే ప్రభుత్వం తమదని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.


     సోమవారం ఉదయం సచివాలయం నుండి  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  వరదల వల్ల దెబ్బతిన్న నాలుగు జిల్లాల కలెక్టర్స్ తో ముఖ్యమంత్రి  సమావేశమై ఇప్పటివరకు తీసుకున్న సహాయ చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బీభత్సం సృష్టించి వారం రోజులు దాటకముందే ,  గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్యూమరేషన్ పూర్తి చేసి, బాధితులకు నష్ట పరిహారం అందించిన తొలి ప్రభుత్వం తమదని  తెలిపారు. గతంలో వరద బాధితులకు బియ్యం కందిపప్పు ఇస్తే సరిపోతుందని భావించే వారని, ఇప్పుడు నిత్యావసర సరుకులతోపాటు గా ప్రతి ఒక్క కుటుంబానికి రెండు వేల రూపాయల నగదు  అదనంగా అందజేశామని తెలిపారు. అదేవిధంగా అధిక వర్షపాతం నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క నీటి బొట్టు ని ఒడిసి పట్టుకొని రాబోవు వేసవికాలంలో మంచి నీటి కొరత రాకుండా ఇప్పటి నుండే జల సంరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. క్యాస్ కేడింగ్ స్టోరేజ్ సిస్టం ,కెనాల్ స్టోరేజ్ సిస్టం ద్వారా  నీటి నిల్వలు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నష్ట పరిహారం అందించిన గ్రామాల్లో సోషల్ ఆడిట్ తప్పకుండా చేయాలన్నారు.


    ఈ వీడియో కాన్ఫరెన్స్లో  కలెక్టరేట్లోని  శంకరన్ హాల్ నుండి  జిల్లా కలెక్టర్  శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు పాల్గొని  శాఖల వారీగా ఇప్పటి వరకు తీసుకున్న సహాయక చర్యలను  ముఖ్యమంత్రి కి వివరించారు. వరద ప్రభావిత  48960 కుటుంబాలకు రెండు వేల రూపాయల చొప్పున నగదు అందజేశామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు నాలుగు మరణాలు సంభవించాయని, వారి కుటుంబాలకు ఐదు లక్షల వంతున నష్ట పరిహారం అందజేశామని తెలిపారు. తీవ్రంగా దెబ్బతిన్న పంచాయతీ రాజ్ రోడ్ల కు సంబంధించి మొత్తం 27 కు గాను 15  రోడ్లు పునరుద్ధరించామని  మిగతావి రాబోయే వారం రోజుల్లో చేపడతామని , అలాగే ఆర్ అండ్ బి రోడ్లు కు సంబంధించి మొత్తం 24 కు గాను 22 రోడ్లు  పునరుద్ధరించడం జరిగిందని తెలియజేశారు. జిల్లాలో ఇప్పటికీ భారీ వర్షాలతో వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నందున  మరమ్మత్తు పనులకు ఆటంకం కనుగుతోందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ హరిందర్ ప్రసాద్ పాల్గొన్నారు.


Comments