అధిక జనాభా వ్యవసాయం మీదే..


అమరావతి (ప్రజా అమరావతి);


*2021 గులాబ్‌ తుఫాను కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ.22 కోట్ల పంట నష్ట పరిహారాన్ని క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.* 


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....:*


ఈ రోజు రైతుల కోసం మరో అడుగు ముందుకు వేస్తూ... దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 


*అధిక జనాభా వ్యవసాయం మీదే..*


రాష్ట్రంలో 62 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న పరిస్ధితులు ఉన్నాయి. దేశంలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి రైతు ఇబ్బందిపడితే మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రోడ్డుమీదకు వచ్చే పరిస్థితి ఉంటుందని తెలిసి ఉన్నా, చాలా సందర్భాల్లో గతంలో కూడా ఎప్పడూ, ఎవరూ రైతును ఎలా చేయిపట్టుకుని నడిపించాలి, రైతులకు  ఎక్కడ నుంచి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, వాటికి పరిష్కారం ఏమిటని గతంలో ఏ ప్రభుత్వమూ ఇంతలా ఆలోచన చేయలేదు. 


*ప్రతి అడుగు చరిత్రలో నిల్చిపోతుంది*

మనం వేసిన ప్రతి అడుగు ఒక విప్లవాత్మకమైన చర్యగా చరిత్రలో నిలిచిపోతుంది. రైతు ఎట్టి పరిస్థితులలోనూ నష్టపోకూడదు, రైతుకు అన్ని వేళలా తోడుగా ఉండాలని కోరుకునే ప్రభుత్వం మనది. ఆ విధంగా ప్రతి అడుగు ముందుకు వేస్తూ వచ్చాం. తుపానులు, వరదలు, కరువు ఏవి వచ్చినా సరే ఆరైతు నష్టపోయే పరిస్థితి రాకూడదని, ఒక వేళ వచ్చినా అదే సీజన్‌ముగిసే లోగా అంటే ఖరీప్‌లో నష్టం వస్తే ఖరీప్‌ ముగిసేలోగా, రబీ పంటలో రైతుకు మరలా పెట్టుబడి అందేలా అడుగులు వేస్తూ, ఆలోచన  చేసిన పరిస్థితి మన ప్రభుత్వం చేసింది.  


*ఏ సీజన్‌ నష్టపరిహారం అదే సీజన్‌లో*

ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో పరిహారాన్ని చెల్లించే ఒక కొత్త సాంప్రదాయాన్ని రాష్ట్రంలో తీసుకువచ్చాం. ప్రకృతి విపత్తులు వల్ల ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌ ముగిసేలోగా పారదర్శకంగా  సోషల్‌ఆడిట్‌ కోసం గ్రామంలోనే జాబితా ప్రదర్శిస్తున్నాం. పూర్తి పారదర్శకతతో వారికి పరిహారం చెల్లిస్తున్నాం. నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందిస్తున్నాం. ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. 


*గులాబ్ తుపాను బాధిత రైతులకు*

అందులో భాగంగానే ఈ సెప్టెంబరులో అంటే  2 నెలల క్రితం గులాబ్‌ తుపాను కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు ఖరీఫ్‌ సీజన్‌ముగిసేలోగా రూ.22 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారాన్ని వారి ఖాతాల్లో నేరుగా జమచేస్తున్నాం.

రూ.22 కోట్లే కదా.. అని కొందరు గిట్టనివాళ్లు మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఒక కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ రైతు అయినా నష్టపోతే ప్రభుత్వం తోడుగా ఉంటుంది. పారదర్శకంగా గ్రామ సచివాలయంలో సోషల్‌ ఆడిట్‌ చేసి జాబితా డిస్‌ప్లే చేస్తున్నాం. 

ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే.. ఆ సీజన్‌ ముగిసేలోగా కచ్చితంగా ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న సాంప్రదాయనికి,  ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాం.  

ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం.


*రెండున్నరేళ్లలో దాదాపు రూ.1070 కోట్లు*

దాదాపు రూ.1070 కోట్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాల కాలంలో పంట నష్టపరిహారం కింద ఇచ్చాం.  

2020 నవంబర్‌లో నివర్‌ తుపాను వచ్చింది. నవంబరులో తుఫాను వస్తే... డిసెంబర్‌ చివరినాటికి 8.34 లక్షల మంది రైతులకు 12 లక్షల ఎకరాలలో రూ.645.99 కోట్ల రూపాయలు నష్టపరిహారంకింద ఇచ్చాం.

ఎక్కువ, తక్కువ మొత్తం అనేది కాకుండా.. రైతుకు నష్టం జరిగినా, తుపాను వచ్చినా... ఇతరత్రా కష్టం వచ్చి రైతు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే... ఆ సీజన్‌ ముగియక ముందే  పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది.

ఈ సాంప్రదాయం కొనసాగుతుంది, దాన్ని కొనసాగించాలనే గట్టి సందేశం ఇవ్వాలనే ఈ కార్యక్రమం చేపడుతున్నాం.

ఇప్పటివరకు దాదాపుగా 18 లక్షల ఎకరాల్లో 13.96 లక్షల మంది రైతులకు కేవలం ఇన్‌పుట్‌సబ్సిడీ కింద అందించిన మొత్తం రూ.1,071 కోట్ల రూపాయలు ఇచ్చాం.


*రెండున్నరేళ్ల కాలంలో- రైతు సంక్షేమం*

రెండున్నరేళ్ల కాలంలో రైతులకోసం అనేక చర్యలు తీసుకున్నాం.

వైయస్సార్‌ రైతు భరోసా అనే ఒకే ఒక్క పథకం కింద అక్షరాల రూ.18,777 కోట్లు నేరుగా రైతుల చేతిలో పెట్టాం. వైయస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.1674 కోట్లు ఇచ్చాం.

వైయస్సార్‌ ఉచిత పంటల బీమాగా అందించిన సొమ్ము రూ.3,788 కోట్లు.


ఈ రెండున్నరేళ్ల కాలంలోనే పగటి పూట నాణ్యమైన విద్యుత్తుకోసం రూ.18వేల కోట్లు పెట్టాం. ఆక్వారైతులకు రూ.1520 కోట్ల రూపాయలు కరెంటు సబ్సిడీ ఇచ్చాం.

నాణ్యమైన ఫీడర్లు ఉంటేనే పొలాలకు 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత కరెంటు ఇవ్వగలుగుతామంటే దాని కోసం రూ.1700 కోట్లకుపైగా ఖర్చు చేశాం.


*రైతుకు దగ్గరగా ప్రతి ఊళ్లో ఆర్బీకే*

రైతు దగ్గరే, అదే ఊళ్లోనే ఆర్బీకే కనిపిస్తోంది. దాదాపుగా 10,778 ఆర్బీకేలు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తున్నాయి. ప్రతి రైతన్నను చేయి పట్టుకుని విత్తనం నుంచి అమ్మకం వరకూ తోడుగా ఉన్నాం.

పంట కొనుగోలు చేయాల్సి వస్తే పారదర్శకంగా ఇ–క్రాప్‌ నమోదు చేసి.. రైతును ఆదుకుంటున్నాం. ఇ– క్రాప్‌ డేటా ఆధారంగా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నా వడ్డీ, ఇన్సూరెన్స్‌తో పాటు చివరకు పంట కొనుగోలులోనూ ఆర్బీకే కేంద్ర బిందువుగా పనిచేస్తోంది.


*ధాన్యం సేకరణ- రూ.35వేల కోట్లు.*

గతంలో ఎన్నడూ జరగని విధంగా ధాన్యం సేకరణ కోసం మాత్రమే 2 సంవత్సరాల కాలంలో అక్షరాల రూ.35వేల కోట్లకుపైగా ఖర్చుచేశాం.

పత్తి కొనుగోలు కోసం రూ.1800 కోట్లు వెచ్చించాం.

ఇతర పంటల కొనుగోలు కోసం.. రైతు నష్టపోకుండా... రూ.6430 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం.

రైతు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రూ.2వేల కోట్లతో ప్రకృతివైపరీత్యాల నిధి పెట్టాం. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టాం. 


*గత ప్రభుత్వ బకాయిలూ...* 

గత ప్రభుత్వం దాన్యం సేకరణ కోసం పెట్టిన రూ.960 కోట్ల బకాయిలను చెల్లించాం.

ఉచిత విద్యుత్‌ కింద రైతుల కరెంటు బిల్లులు రూ.9వేల కోట్లు బకాయిలను గత ప్రభుత్వం పెడితే.. దాన్ని కట్టాం. రూ. 384 కోట్ల విత్తన బకాయిలు సైతం కట్టాం.


*రైతులకు తోడుగా ఉండాలని...*

ఈ రకంగా రైతన్నలకు తోడుగా ఉండాలని వ్యవస్థలోకి మార్పులను తీసుకు వస్తున్నాం.

వ్యవసాయ సలహా మండలిని ఆర్బీకే స్ధాయి నుంచి మొదలుపెట్టాం. ప్రతి నెలా మొదటి శుక్రవారం ఆర్బీకేల దగ్గర,  రెండో శుక్రవారం మండలస్ధాయిలోనూ, మూడో శుక్రవారం జిల్లా స్ధాయిలో కలెక్టర్లు దగ్గర వ్యవసాయ సలహా మండలి సమావేశం జరగాలి. కలెక్టర్లు ప్రతి రైతు సమస్య పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి. వాళ్ల  స్ధాయిలో చేయతగినవి  పరిష్కరించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయాల్సిన అవసరం ఉంటే వెంటనే విభాగాధిపతులకు, వ్యవసాయశాఖ కార్యదర్శికి ఈ సమాచారం అందించాలి. రాష్ట్రంలో ప్రతి నెలా ఈ కార్యక్రమం సవ్యంగా జరుగుతుంది. 


*ప్రతి ఎకరాకు, ప్రతి రైతుకూ న్యాయం...*

ఈ మధ్యకాలంలో రాయలసీమ, నెల్లూరు జిల్లాలలో వర్షాలు బాగా పడ్డాయి. రైతన్నలందరికీ మరోసారి భరోసా ఇస్తున్నాను. ఎవ్వరూ కూడా భయపడాల్సిన పనిలేదు. నష్టపోయిన ప్రతి ఎకరాకూ, నష్టపోయిన ప్రతి రైతుకూ కూడా ప్రభుత్వం తోడుగా ఉంటుంది.

ఎన్యుమరేషన్‌చేసి.. రబీ సీజన్‌ ముగియకముందే.. వారికి  పూర్తిగా పంట నష్ట పరిహారాన్ని చెల్లిస్తాం. ఎంత నష్టపోయారో  ఆ నష్టపరిహారాన్న ఇస్తామని రైతులకు మరోక్కసారి భరోసా ఇస్తున్నామని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు. *చివరిగా...* 

ఖరీప్‌ – 2021 గులాబ్‌ తుఫాను కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ.22 కోట్ల పంట నష్ట పరిహారాన్ని కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి సీఎం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. 


ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం వి యస్‌ నాగిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (అగ్రికల్చర్‌) అంబటి కృష్ణారెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.