తక్షణ పంట నష్టం అంచనాలు


అమరావతి (ప్రజా అమరావతి);


తక్షణ పంట నష్టం అంచనాలు


అన్నదాతకు అండగా నిలవాలని సీఎం ఆదేశం


నష్టపోయిన కడప జిల్లా సెనగ రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు


రైతులకు 24 గంటలు అందుబాటులో సిబ్బంది 


వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష


సీఎం జగన్ ఆదేశాల మేరకు పంట నష్టం అంచనాలు తక్షణమే సిద్ధం చెయ్యాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు  అధికారులను ఆదేశించారు. కుండపోత వర్షాల ప్రభావానికి గురైన అన్నదాతలకు అండగా నిలబడాలన్నారు. రాష్ట్రంలో  వర్షాల కారణంగా వాటిల్లిన పంట నష్టాల నేపథ్యంలో 13 జిల్లాల వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి శనివారం సమీక్ష జరిపారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు, అధికారులు పర్యటించి రైతులకు సహాయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దెబ్బతిన్న పంట పొలాలు, తోటలను పరిశీలించి నష్ట తీవ్రత తగ్గించేలా రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు.  తుఫాన్ ప్రభావం 

అధికంగా ఉన్న జిల్లాల్లో సీనియర్ వ్యవసాయ శాఖా అధికారులు పర్యటించాలని, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో వారు సమన్వయం చేసుకోవాలన్నారు. వ్యవసాయ సలహా మండళ్ల సభ్యులు కూడా గ్రామాల్లో పర్యటించి రైతులకు అండగా నిలవాలని, తమ పరిధిలో దెబ్బతిన్న పంటలు పరిశీలించి రైతులకు అండగా ఉండాలని మంత్రి సూచించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటని అంచనా వెయ్యడంతో పాటు మిగిలిన పంటను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కడప జిల్లాలో నష్టపోయిన సెనగ రైతుల్ని గుర్తించి వారికి 80 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కన్నబాబు ఆదేశించారు. 

అత్యధికంగా తూర్పు, పశ్చిమ గోదావరి, కడప జిలాల్లో వరి పంట నష్టం ఎక్కువ జరిగిందని, కడప జిల్లాలో రబి శనగ పంట, నెల్లూరు జిల్లాలో వరి నారుమడులు దెబ్బతిన్నాయని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. దెబ్బతిన్న రైతులను గుర్తించి ఈ- క్రాప్ ద్వారా వారికి సాయం అందేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎఫ్ ఏ క్యూ నిబంధనలు సడలించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల ఇరిగేషన్ అధికారులతో కలిసి కాలువలు, డ్రైన్ లు క్లియర్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్బీకేలను ప్రామాణికంగా తీసుకుని ఆదివారం నుండి పంట నష్టం అంచనా వేయాలని, ఆర్‌బీకే స్థాయి వరకు వ్యవసాయ, ఉద్యాన సిబ్బంది క్షేత్ర స్థాయిలో రైతులకు 24 గంటలూ అందుబాటులో ఉండాలన్నారు. ముంపునకు గురైన వర్షపునీరు సాధ్యమైనంత త్వరగా కాలువల ద్వారా పోయేందుకు చర్యలు తీసుకోవాలని, 

జలవనరుల శాఖ ఎస్‌ఈలతో చర్చించి కాలువల్లో వర్షపు నీరుపోయేటట్టు చూడాలని  జేడిలను ఆదేశించారు. 

ముంపు నీరు తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్‌ బృందాలను రంగంలోకి దింపి ఏ ఒక్క రైతు నష్టపోకుండా పారదర్శకంగా తుదిఅంచనాలు రూపొందించాలన్నారు. 


జిల్లాలకు అధికారుల నియామకం


ఎక్కువగా దెబ్బతిన్న జిల్లాల్లో పంట నష్ట అంచనాలు , రైతులకు సహాయంగా ఉండేలా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులను నియమించారు.  

తూర్పు గోదావరి ( హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్ ) పశ్చిమ గోదావరి ( జెడి శ్రీధర్) , కడప జిల్లాకు సీడ్స్ ఎండి శేఖర్ బాబులకు బాధ్యతలు అప్పగించారు. 


ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య

వ్యవసాయ కమిషనర్ హెచ్‌.అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments