రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి రిజిస్ట్రేషన్ చేసి ఎందుకివ్వలేదు


- రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి రిజిస్ట్రేషన్ చేసి ఎందుకివ్వలేదు


- చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదు

- ఆయన అధికారంలోకి రావాలంటే ఎన్టీఆర్, వాజ్ పేయ్ లు కావాలి

- మోడీ, అమిత్ షా దగ్గరకు రానిస్తారని అనుకోవడం లేదు

- 52 లక్షల మంది పేదలు ఓటిఎస్ ను వినియోగించుకోవాలి

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని


 తాడేపల్లి, డిసెంబర్ 29 (ప్రజా అమరావతి): రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పేదవాడికి కూడా ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి ఎందుకు ఇవ్వలేదని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. తాడేపల్లిలోని మీడియా పాయింట్ దగ్గర మంత్రి కొడాలి నాని ఓటిఎస్ స్కీంపై మాట్లాడారు. ఓటిఎస్ కు వ్యతిరేకంగా ధర్నాలు చేయాలని చంద్రబాబు పిలుపునిస్తే టిడిపి శ్రేణులు మమ అనిపించడానికి ఆందోళన కార్యక్రమాలను చేపట్టారన్నారు. ఓటిఎస్ స్కీం బలవంతపు స్కీం కాదని చెప్పారు. 1978 నుండి రాష్ట్రంలో ఉన్న నిరుపేదలు ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లను నిర్మించుకొని ఉంటున్నారన్నారు. వీరి దగ్గర నుండి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజులు తీసుకోకుండా కేవలం పది రూపాయల ఖర్చుతో ఇంటిని, ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లను ఇచ్చే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. రాష్ట్రంలో 52 లక్షల మంది నిరుపేదలు ఉన్నారని, వీరిలో ఇప్పటికే 10 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని తెలిపారు. కొంతమంది లబ్ధిదారులు బ్యాంకులకు రూ.2 వరకు రుణం చెల్లించాల్సి ఉందన్నారు. బ్యాంకు రుణం చెల్లించే వరకు లబ్ధిదారులకు ఇంటి పట్టా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఓటిఎస్ స్కీం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు రూ. 10 వేలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారు రూ.15 వేలు చెల్లిస్తే మిగతా అప్పును ప్రభుత్వమే భరించి బ్యాంకులకు జమ చేస్తుందన్నారు. అంతేకాక లబ్ధిదారుల ఇంటి పట్టాలను విడిపించి రిజిస్ట్రేషన్ చేసి అప్పగించడం జరుగుతుందన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటిఎస్ స్కీమ్ ను ఉచితంగా అందజేస్తానని చెబుతున్నాడన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి రావాలంటే ఎన్టీఆర్, వాజ్ పేయ్ కావాలని, వారు ఇప్పుడు బతికి లేరన్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు బీజేపీని దారుణంగా తిట్టిన మాటలను నరేంద్ర మోడీ, అమిత్ షాలు విన్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో వారు కూడా చంద్రబాబును దగ్గరకు రానిస్తారని అనుకోవడం లేదన్నారు. దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతు తెలిపినప్పటికీ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం వల్ల ఆ పార్టీ భ్రష్టు పట్టి పోయి అధ్వాన్న స్థితికి చేరిందన్నారు. పవన్ కళ్యాణ్,  చంద్రబాబులు రాసుకున్నా,  పూసుకున్నా ఏమీ అయ్యే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు చెప్పే దొంగ మాటలను నమ్మవద్దని సూచించారు. 52 లక్షల మంది పేదలు ఓటిఎస్ స్కీం ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని కోరారు. ఇళ్లను  రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో వ్యాపారాలు, ఇతర అవసరాల కోసం బ్యాంకుల నుండి తక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవచ్చని చెప్పారు. పేద ప్రజల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఓటిఎస్ స్కీమ్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. చంద్రబాబు వంటి దొంగలను రాష్ట్ర ప్రజలు ఇక అధికారంలోకి రానివ్వరని మంత్రి కొడాలి నాని అన్నారు.