నెల్లూరు డిసెంబర్ 17 (ప్రజా అమరావతి) :-- ఈ నెల 21వ తేదీన లాంఛనంగా ప్రారంభం కానున్న" జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం" కార్యక్రమాన్ని అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని
రెవెన్యూ సంయుక్త కలెక్టర్ శ్రీ హరెందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం వారు నగరంలోని కలెక్టరేట్ లో గల వారి ఛాంబర్లో అభివృద్ధి సంయుక్త కలెక్టర్ శ్రీ గణేష్ కుమార్, గృహ నిర్మాణ సంయుక్త కలెక్టర్ శ్రీ విదేహ ఖరేతో కలిసి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభ కార్యక్రమం ఏర్పాట్లపై అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవిన్యూ సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ పథకం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు. ఈనెల 21 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రస్థాయిలో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. అదే సమయంలో జిల్లా స్థాయిలో నగరంలోని శ్రీ వేంకటేశ్వర కస్తూర్భా కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్ పి టి సి,ఎం పి పిలు, నగర మేయర్, కౌన్సిలర్లకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వాన పత్రికలు పంపించాలన్నారు. వేదికను సుందరంగా తీర్చి దిద్దటం తో పాటు బ్యాక్ డ్రాప్ ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాటు చేయాలని కళా క్షేత్రం పరిసరప్రాంతాలు పారిశుద్ధ్యం ఏర్పాట్లు పక్కాగా చేయాలని, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రులు ప్రజాప్రతినిధులచేత లబ్ధిదారులకు ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం లబ్ధిదారులను కూడా తీసుకుని రావాలన్నారు. కళాక్షేత్రంలో అందరికీ మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. 108 అత్యవసర వాహనము అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అలాగే అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ప్రారంభించే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా ఎల్ఈడి ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. లబ్ధిదారులకు ఇచ్చేందుకు అవసరమైన రిజిస్ట్రేషన్ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఈ పథకం రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుందో వివరించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 21వ తేదీ తర్వాత నియోజకవర్గాల వారీగా సంబంధిత ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని ఇదే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బి. చిన్న ఓబులేసు, జడ్పీ సీఈవో శ్రీ శ్రీనివాస రావు, నెల్లూరు ఆర్డీవో శ్రీ హుస్సేన్ సాహెబ్, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీ దాసు, డి ఆర్ డి ఎ, హౌసింగ్ పి డి లు శ్రీ సాంబశివ రెడ్డి, శ్రీ వేణుగోపాల్, డి పి ఓ శ్రీమతి ధనలక్ష్మి, ఉద్యాన శాఖ ఏడి శ్రీ ప్రదీప్ కుమార్, మునిసిపల్ ఇంచార్జీ అదనపు కమిషనర్ శ్రీ నందన్, సమాచార శాఖ డి డి వెంకటేశ్వర ప్రసాద్, డి ఈ కిషోర్, ఎన్ ఐ సి డి ఐ ఓ శ్రీ సురేష్, డిఎస్పీ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డుల ఏడి శ్రీహనుమాన్ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment