గ్రామంలో కాలినడకన తిరిగి బాధితులను స్వయంగా కలుసుకున్న ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు.


పులపత్తూరు. వైయస్సార్‌ జిల్లా (ప్రజా అమరావతి);


వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా వైయస్సార్‌ జిల్లా రాజంపేట మండలం పులపత్తూరు వెళ్లిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:

గ్రామంలో కాలినడకన తిరిగి బాధితులను స్వయంగా కలుసుకున్న ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు. 


ఆ తర్వాత వరద బాధిత ప్రతి కుటుంబానికి 5 సెంట్ల భూమి, ఇల్లు మంజూరు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..:


కష్టం వచ్చినా..:

ఈ వరద సమయంలో జరిగిన నష్టం మీద, వచ్చిన కష్టాలపై విషయాలన్నీ చెప్పడమే కాకుండా, మీ అందరూ కూడా ఇంత కష్టం వచ్చినా కూడా చెరగని చిరునవ్వుతో ఆప్యాయత చూపించినందుకు ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి ముందుగా శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నష్టం చాలా జరిగింది. ఆ సమయంలో అధికారులు స్పందించిన తీరు, సహాయం అందించిన విధానాన్ని మీ అందరి నోటిలో నుంచే విన్నాను.


అధికారులకు అభినందన:

మీ అందరూ చెప్పిన విషయాల మీద అధికారులందరూ బాగా స్పందించినందుకు, అధికారులందరికీ నా తరపు నుంచి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అధికారులు బాగా స్పందించారు. ఇవ్వాల్సిన సహాయం, చేయాల్సిన పనులను దాదాపు 98 శాతం వరకు బాగా చేశారు. ఇంకా ఎక్కడైనా ఒకరో ఇద్దరో మిగిలిపోయిన పరిస్థితి ఉంటే మీ గ్రామ సచివాలయాల్లో సోషల్‌ ఆడిటింగ్‌ కోసం జాబితాలు ప్రదర్శించడం జరిగింది. ఆ జాబితాలు చూసుకుని, తమకు జరిగిన మంచిని తెలుసుకోండి. ఎవరికైనా కూడా తమకు జరగాల్సింది జరగలేదని అనిపిస్తే, వెంటనే గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేస్తే వెంటనే వెరిఫికేషన్‌ చేసి, ఒకవేళ పొరపాటున ఎక్కడైనా మిస్‌ అయి ఉంటే అది కూడా చేర్చి ఇవ్వడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తున్నాను. 


సురక్షిత ప్రదేశంలో ఇళ్లు:

సామాజిక తనిఖీల కోసం గ్రామ సచివాలయాల్లో జాబితాలు ప్రదర్శించాలని ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ గ్రామంలో దాదాపు 293 ఇళ్లు కొట్టుకుపోయిన పరిస్థితి. అవన్నీ చూడడం జరిగింది. అందరికీ కూడా ఇక్కడే కాకుండా ఎల్తైన ప్రాంతంలో గుట్టమీద అందరికీ 5 సెంట్ల చొప్పున స్థలం ఇచ్చి ఇల్లు కూడా కట్టివ్వమని ఆదేశించాం. ఇది కచ్చితంగా జరుగుతుంది. ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుని అందరికీ ఇళ్లు కట్టించి ఇస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 


హెక్టార్‌కు రూ.12,500:

ఇక్కడ ఇంకొక విషయం. ఇక్కడ రిజర్వాయర్లు రెండూ కొట్టుకుపోయాయి. ఆ రిజర్వాయర్ల మీద ఆధారపడిన వ్యవసాయం కూడా పూర్తిగా నీటిపాలైంది. పొలాల్లో ఇసుక మేటలు వేసింది. వరద తాకిడికి కొన్ని పొలాలు తీవ్ర కోతకు గురయ్యాయి. జరిగిన నష్టంపై అంచనాలు రూపొందుతున్నాయి. అవి పూర్తి కాగానే వాటిని కూడా సామాజిక తనిఖీ కోసం గ్రామ సచివాలయంలో  ప్రదర్శించడం జరుగుతుంది. 

పొలాల్లో పేరుకుపోయిన ఇసుకను తొలగించడానికి ప్రతి హెక్టార్‌కు రూ.12,500 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఆ జాబితా కూడా సచివాలయంలో ప్రదర్శిస్తారు. ఎవరైనా మిస్‌ అయితే ఫిర్యాదు చేయవచ్చు.


ఈ–క్రాప్‌ ద్వారా ప్రతి రైతుకూ..:

ఇదొక్కటే కాకుండా ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్నారు. వారి పేరు మీద భూములు ఉన్నాయా? లేక మరెవరి పేరుతో ఉన్నాయా? అని కూడా చూడకుండా ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న అందరికీ పరిహారం ఇస్తాం. ఎందుకంటే తాము చాలా కాలం నుంచి సాగు చేస్తున్నా, తమకు టైటిల్‌ డీడ్‌ లేదని చాలా మంది ఫిర్యాదు చేశారు. అందుకే ఈ–క్రాప్‌ డేటా ఆధారంగా అందరికీ పరిహారం ఇవ్వమని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం. 


అక్కచెల్లెమ్మలకూ అండ:

అదే విధంగా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు కూడా సహాయం చేయాలని కోరారు. ప్రభుత్వం ఆసరా ద్వారా ఇప్పటికే సహాయం చేసిందన్న వారు, ఈ పరిస్థితుల్లో తాము పని చేసుకోలేకపోతున్నామని, అన్ని విధాలుగా నష్టపోయి ఉన్నందున సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అందువల్ల ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు కూడా ఏదో ఒక విధంగా మంచి చేస్తానని హామీ ఇస్తున్నాను.


పనుల కల్పన:

ఇవే కాకుండా ఈ ప్రాంతంలో చాలా గ్రామాల్లో వ్యవసాయ పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. కాల్వలు, చెరువులకు గండ్లు పడ్డాయి కాబట్టి ఇప్పట్లో వ్యవసాయ పనులు కొనసాగే పరిస్థితి లేదు కాబట్టి, ఉపాధి హామీ పనులను వేరే రూపంలో వెంటనే ఇవ్వాలని ఆదేశించాం. 


యువతకూ తోడు:

అంతే కాకుండా ఇక్కడ చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు కూడా నష్టం జరిగింది. కొందరి వాహనాలు, మరి కొందరి ఆటోలు నీళ్లలో కొట్టుకుపోయాయి. వారు తమ వాహనాల నెంబర్లు ఇస్తే, వారిని కూడా ఏదో ఒక విధంగా ఆదుకుంటాము. ఎక్కడో ఒక చోట ఉపాధి కల్పించే చర్యలతో పాటు, బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పించడం జరుగుతుంది. ఇదంతా 10 రోజుల్లో జరుగుతుంది.


గ్రామాల్లోనే డిప్యూటీ కలెక్టర్లు:

ఇంకా అధికారులు అందరూ ఇక్కడే ఉంటారు. ప్రత్యేకంగా ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించాం. వారంతా ఆదివారం వరకు ఇక్కడే ఉంటారు. అన్ని పనులు పర్యవేక్షిస్తారు. అంతే కాకుండా రాబోయే రెండు నెలలు కూడా ప్రతి మంగళవారం, శుక్రవారం డిప్యూటీ కలెక్టర్లు వచ్చి తమకు కేటాయించిన గ్రామాల్లోనే బస చేస్తారు. అక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తారు. ఇంటి స్థలం కేటాయించడం మొదలు, ఇల్లు కట్టించే వరకు, ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా సహాయం చేసి ఆదుకుంటారు.


ఆ డ్యామ్‌ల రీడిజైన్‌–నిర్మాణం:

ఇక్కడ పింఛ డ్యామ్, అన్నమయ్య డ్యామ్‌ కనీవినీ ఎరగని వర్షాలకు దెబ్బతిన్నాయి. ఊహించని విధంగా వరదలు వచ్చాయి. 2.15 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జ్‌ ఆ డ్యామ్‌ కెపాసిటీ అయితే ఏకంగా 3.20 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో దెబ్బతింది. అయినా కలెక్టర్‌ అప్రమత్తంగా వ్యవహరించి, లోతట్టు ప్రాంతాల వారిని ముందు రోజు సాయంత్రమే సురక్షితంగా తరలించారు. అదే జరగకపోతే నష్టం దారుణంగా ఉండేది. అందుకే కలెక్టర్‌ను అభినందిస్తున్నాను. పింఛ డ్యామ్, అన్నమయ్య డ్యామ్‌లను వెంటనే రీడిజైన్‌ చేయాలని ఆదేశించాం. ఇప్పటి కంటే ఎక్కువ వరద వచ్చినా తట్టుకునే విధంగా డిజైన్‌ చేసి, కడతాం. అంతే కాకుండా నందలూరు బ్రిడ్జి వరకు అన్ని చోట్లా నివాసిత ప్రాంతాల్లోకి వరద నీరు రాకుండా రక్షణ గోడ కట్టాలని ఆదేశించాం.

ఈ గ్రామాలకు ఏ కష్టం వచ్చినా తలడిల్లి వేగంగా ఆదుకుంటున్న ఇక్కడి నేతలు.. మిధున్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి.. ఇంకా ప్రజా ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. 


హంగూ, ఆర్భాటం లేకుండా..:

ఇంత వేగంగా సహాయ కార్యక్రమాలు గతంలో ఏనాడూ జరగలేదు. రాష్ట్రంలో ఎప్పుడూ ఇంత వేగంగా మంచి జరగలేదు. గతానికి, ఇప్పటికీ తేడా ఏమిటంటే.. ఆర్భాటం, హంగామా లేకుండా పనులు చేసి చూపించగలిగాం. ఎక్కడా హడావిడి లేకుండా, ఎక్కడా ఇబ్బందికర పరిస్థితులు రాకుండా అధికార యంత్రాంగమంతా మమేకమై ప్రతి ఒక్కరికి మంచి చేశారు. అది కూడా ఘటన జరిగిన 10, 13 రోజుల్లోనే ఇవన్నీ చేయడం చాలా సంతోషం కలిగించే విషయం. 


మోస్ట్‌ ఎఫీషియెంట్‌గా..:

ఈరోజుకు ఘటన జరిగి 13 రోజులైంది. మన అధికారులు, సిబ్బంది ఎలా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారనేది చూడడానికి స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో నేనే ఇవాళ స్వయంగా వచ్చాను. ఇంత పకడ్బందీగా, ఇంత కచ్చితంగా, మోస్ట్‌ ఎఫీషియెంట్‌గా జరిగే విధంగా అధికారులందరినీ మొహరించడం, వారికి 13 రోజుల సమయం ఇవ్వడం, 13 రోజుల తర్వాత సూపర్‌విజన్‌ కోసం ఏకంగా ముఖ్యమంత్రి ఆ గ్రామాలకు రావడం అన్నది ఒక పర్‌ఫెక్ట్‌గా సిస్టమెటిక్‌గా జరుగుతోంది కాబట్టే, ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా, దాదాపు అందరికీ కూడా మంచి జరిగే పరిస్థితి ఈ గ్రామాల్లో కనిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని మరోసారి తెలియజేçస్తున్నాను.


ఎవరైనా మిగిలిపోతే..:

అక్కడ, ఇక్కడ ఎక్కడైనా పొరపాటున ఎవరికైనా మిగిలిపోయి ఉంటే గ్రామ సచివాలయాలు అందుబాటులోనే ఉన్నాయి. సామాజిక తనిఖీ కోసం జాబితాలు కూడా ప్రదర్శించడం జరిగింది. ఏ ఒక్కరికైనా కూడా ఏ చిన్న సమస్య అయినా పరిష్కారం కావాల్సి ఉంటే దయచేసి గ్రామ సచివాలయానికి వెళ్లండి. అక్కడ ఫిర్యాదు చేయండి. వెంటనే వెరిఫికేషన్‌ చేసి వారికి కూడా మంచి జరిగేలా చేస్తామని మీ అందరికీ మరొక్కసారి భరోసా ఇస్తున్నాను. 

ఇంతటి కష్టంలో కూడా చెరగని చిరునవ్వుతో ఆప్యాయత చూపించినందుకు మరోసారి ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.. అని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.