కోవిడ్‌తో కాకినాడ-శ్రీకాకుళం గ్యాస్‌ పైప్‌ లైన్‌ పనుల్లో జాప్యం

 

*కోవిడ్‌తో కాకినాడ-శ్రీకాకుళం గ్యాస్‌ పైప్‌ లైన్‌ పనుల్లో జాప్యం*

రాజ్యసభలో శ్రీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 20 (ప్రజా అమరావతి): కోవిడ్‌ మహమ్మారితోపాటు వర్షాల కారణంగా కాకినాడ-విశాఖపట్నం-శ్రీకాకుళం గ్యాస్ పైప్ లైన్ (కేఎస్‌పీఎల్‌) నిర్మాణ పనుల్లో జాప్యం జరిగినట్లు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలి తెలిపారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. కాకినాడ-వైజాగ్-శ్రీకాకుళం మధ్య సహజవాయువు పైప్ లైన్ నిర్మాణానికి పెట్రోలియం, నాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్జీఆర్‌బీ) 2014 జూలై 16న ఆంధ్రప్రదేశ్‌ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ను అనుమతించినట్లు మంత్రి చెప్పారు. కేఎస్‌పీఎల్‌  పైప్‌ లైన్‌ ప్రాజెక్ట్‌లోని కాకినాడ-వైజాగ్‌ సెక్షన్‌ను 2021 జూన్‌ 30 నాటికి, వైజాగ్‌-శ్రీకాకుళం సెక్షన్‌ను 2022 జూన్‌ 30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

అయితే కోవిడ్‌ మహమ్మారి విజృంభణ, ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పైప్‌ లైన్‌ నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది. దీంతో కాకినాడు-వైజాగ్‌ సెక్షన్‌ నిర్మాణ గడువును 2022 సెప్టెంబర్‌ 30, వైజాగ్‌-కాకినాడ సెక్షన్‌ గడువును 2023 సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించవలసిందిగా ఆంధ్రప్రదేశ్‌ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్ష పీఎన్‌జీఆర్‌బీని కోరినట్లు మంత్రి వెల్లడించారు.

-----------------------------------------

*జల శక్తి అభియాన్‌ కింద ఏపీలో 9 జిల్లాల ఎంపిక*

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 20: దేశంలో నీటి కొరతను ఎదుర్కొంటున్న 256 జిల్లాల్లో జల సంరక్షణ, జల వనరుల నిర్వహణను ప్రోత్సహించేందుకు 2019లో ప్రారంభించిన జల శక్తి అభియాన్‌ (జేఎస్‌ఏ) కింద ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, వైఎస్సార్‌ కడప జిల్లాలను ఎంపిక చేసినట్లు జల శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్‌ తుడు సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ జేఎస్‌ఏ కింద చేపట్టే కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులు, భూగర్భజల నిపుణులు, శాస్త్రవేత్త్లలు ఆయా రాష్ట్ర, జిల్లాల అధికారులతో కలిసి పనిచేస్తారని వివరించారు.

వర్షాన్ని వడిసి పట్టాలి అనే నినాదంతో ప్రారంభించిన జల శక్తి అభియాన్‌లో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీటిని వడిసి పట్టేందుకు అవసరమైన నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. ప్రజల భాగస్వామ్యంతో కొనసాగే ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా 2021 మార్చి నుంచి నవంబర్‌ వరకు వర్షాలకు ముందు, వర్షాకాలంలోను అనేక కార్యకలాపాలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు.


Comments