వ్యక్తులకన్నా వ్యవస్థలే ముఖ్యం

 *చంద్రబాబునాయుడును కలిసిన సర్పంచ్ ల సంఘం ప్రతినిధులు*

*పంచాయితీల నిర్వీర్యంపై తెలుగుదేశం పార్టీ అలు పెరగని పోరు*

*వ్యక్తులకన్నా వ్యవస్థలే ముఖ్యం*


*నిధులు, అధికారాల కోసం సర్పంచ్ ల సంఘం పోరాటానికి టిడిపి సంఘీభావం*

*తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు*

అమరావతి (ప్రజా అమరావతి) : రాష్ట్రంలో ఎక్కువమంది వైసిపి మద్దతుదారులే సర్పంచ్ లుగా ఉన్నప్పటికీ పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ జగన్ రెడ్డి చేపడుతున్న చర్యలపై తెలుగుదేశం పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోందని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నాడు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర సర్పంచ్ ల సంఘం ప్రతినిధులు చంద్రబాబును కలిసి తమ సమస్యలను విన్నవించారు.  ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ టిడిపి సర్పంచ్ లు మెజారిటీ స్థానాల్లో లేనప్పటికీ వ్యక్తులకన్నా వ్యవస్థలు కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి  గతంలో జిఓ నెం.2, ఆర్థిక సంఘ నిధులు, వివిధ అంశాలపై పోరాటం చేశామని అన్నారు. 73వ రాజ్యాంగ సవరణలో పంచాయితీలకు ప్రత్యేక అధికారాలిచ్చారని, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ఆ అధికారాలను కాలరాస్తోందని అన్నారు. పంచాయితీ ఎన్నికల్లో వైసిపి అనేక అక్రమాలకు పాల్పడిందన్నారు. పార్టీలకు అతీతంగా సర్పంచ్ ల సంఘం అనేక పోరాటాలు చేసింది, నిధులు, అధికారాల కోసం వారు చేసే న్యాయపోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున నిధులు ఇచ్చి, పంచాయితీలను అభివృద్ధి చేశామని తెలిపారు. దేశానికి ప్రధాని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో పంచాయితీకి సర్పంచ్ కి అలాంటి అధికారాలే ఉంటాయి, గతంలో సర్పంచ్ లకు చెక్ పవర్ తోపాటు ప్రత్యేక అధికారాలు ఇచ్చాం, గ్రామాల్లో రాజకీయాలకంటే అభివృద్ధి ముఖ్యమని భావించి పలు చర్యలు చేపట్టామని అన్నారు.  రాష్ట్ర సర్పంచ్ ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వైవిబి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆర్థిక సంఘం నిధులు రూ.6వేల కోట్లు పంచాయితీలకు ఇవ్వకుండా మళ్లించారని, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్పంచ్ ల అధికారాలను కాలరాస్తున్నారని అన్నారు. నరేగా నిధులు గతంలో గ్రామసభ, గ్రామసర్పంచ్ పరిధిలో ఖర్చుచేయడం జరిగేది. నేడు ఆ అధికారం కూడా సర్పంచ్ కి లేకుండా చేశారు. కేవలం సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చే కార్యక్రమం చేస్తున్నారని వైవిబి మండిపడ్డారు.

రాష్ట్ర శాసనసభ మాజీ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ 2014 నుంచి 19వరకు గ్రామ పంచాయితీలకు స్వర్ణ యుగమని, గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి తెలుగుదేశం హయాంలో జరిగిందన్నారు. నరేగా, ఆర్థిక సంఘం, కన్వర్జెన్సీ ద్వారా పెద్దఎత్తున పనులు చేపట్టామని అన్నారు. కానీ, నేడు అభివృద్ధి పూర్తిగా నిలచిపోయిందని, కనీసం పనులు చేసిన వారికి బిల్లులు కూడా చెల్లించడం లేదని అన్నారు.

తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్ డి విభాగం చైర్మన్ బి.రామాంజనేయులు మాట్లాడుతూ గతంలో నరేగా నిధులు వినియోగించకపోవడం వల్ల మురిగిపోయేవని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నిధులపై ప్రత్యేక శ్రద్ధవహించి దేశంలోనే మొట్టమొదటి సారిగా కన్వర్జెన్సీ విధానాన్ని తీసుకువచ్చి పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఈ విధానం దేశానికే ఆదర్శంగా నిలచిందని అన్నారు.  

రాష్ట్ర సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు పమిడి వెంకట్రావు మాట్లాడుతూ పంచాయితీల్లో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం, నిధులు విడుదల చేయకపోవడంతో సర్పంచ్ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ లు అందరం కలిసి పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల సంఘం నాయకులు ముల్లంగి రామకృష్ణ, ప్రతాపరెడ్డి, గేదెల రాజారావు, ఇస్మాయిల్, పఠాన్ ఖాదర్ ఖాన్, సుమిత్ర, సుబ్బరామయ్య, కర్రోతు సత్య పాల్గొన్నారు.