ఓటర్ల క్లెయిములు అన్నిటినీ పరిష్కరించి

 


నెల్లూరు, డిసెంబర్ 10 (ప్రజా అమరావతి):-- ఈనెల 20వ తేదీలోగా ఓటర్ల క్లెయిములు అన్నిటినీ పరిష్కరించి


స్వచ్ఛమైన ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఓటర్ల జాబితా జిల్లా పరిశీలకులు శ్రీ కె ఆర్ బి హెచ్ ఎన్ చక్రవర్తి  ఎన్నికల అధికారులను ఆదేశించారు.  శుక్రవారం సాయంత్రం  నగరంలోని కలెక్టరేట్ శంకరన్ వి సి హాల్ లో పరిశీలకులు జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబుతో కలిసి ఎన్నికల ఈఆర్ఓ లు, ఏ ఈ ఆర్ ఓ లతో ఓటర్ల జాబితా తయారీ పై సమావేశం నిర్వహించి సమీక్షించారు.  ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ  ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 22 వేల  క్లెయిములు రాగా 1100  ఆమోదించారని,  500  తిరస్కరించారని,  మిగిలిన 20 వేల క్లేయిములు ఈనెల 20వ తేదీలోగా తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు.  ఇందుకోసం బి ఎల్ వో స్థాయి నుండి ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.  క్లేయిములు పరిష్కరించడంలో నాణ్యత విధిగా పాటించాలన్నారు.  క్లేయిములకు సంబంధించి ఎవరైనా అవసరమైన డాక్యుమెంట్లు,  ఆధారాలు ఇవ్వకపోతే వారి కుటుంబ సభ్యుల నుండి తీసుకోవాలన్నారు.   క్లెయిములు తిరస్కరించే టప్పుడు చనిపోయారా లేదా  డబల్ ఎంట్రీనా నిర్ధారించుకోవాలని,  స్పష్టమైన కారణాలు ఉండేలా జాగ్రత్తలు పాటించాలన్నారు.  స్త్రీ పురుష నిష్పత్తి పోలింగ్ కేంద్రం వారీగా సజావుగా ఉండేలా సరి పోల్చాలన్నారు.  ఎక్కడైనా తేడా కనిపిస్తే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లు- జనాభా నిష్పత్తి 70 శాతం దగ్గరగా ఉండాలని ఒకసారి తనిఖీ చేసి డేటా వివరాలు విశ్లేషించాలన్నారు.  చివరి ఓటర్ల జాబితాను వచ్చే సంవత్సరం జనవరి 5వ తేదీన     ప్రచురించాలన్నారు.                 తొలుత జిల్లా కలెక్టర్ ఓటర్ల జాబితా ఏ విధంగా తయారవుతుందో  పరిశీలకులకు వివరించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్లు 24,61,984  ఉండగా అందులో  పురుష ఓటర్లు  1205815 కాగా మహిళా ఓటర్లు 1255826, మూడో జెండర్ ఓటర్లు 343 మంది ఉన్నారన్నారు. మహిళా ఓటర్లు 50 వేల మంది అధికంగా ఉన్నారన్నారు. ఆదర్శమైన లింగ నిష్పత్తి 950 కాగా జిల్లాలో 1042 గా ఉందన్నారు.  18 సంవత్సరాలు నిండిన విద్యార్థిని విద్యార్థులు అందరిని ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు పెద్దఎత్తున విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు.  గత నెల 20, 21 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను నిర్వహించి  క్లెయిములు  స్వీకరించామన్నారు.   జిల్లాలో 2923 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అన్నింటికి బి ఎల్ వో ల నియామకం జరిగిందన్నారు.  భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్ణీత షెడ్యూలు ప్రకారం 20వ తేదీలోగా క్లేయిములు అన్ని పరిష్కరిస్తామని,   జనవరి ఐదో తేదీన చివరి ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు.  జిల్లాలో  గతంలోని ఓటర్ల జాబితా కంటే ప్రస్తుతం తయారుచేసిన ముసాయిదా ఓటర్ల జాబితా ఓటరు- జనాభా నిష్పత్తి, లింగ నిష్పత్తి పోల్చిచూస్తే చాలా బాగుందన్నారు.  జిల్లాలోని 940 పంచాయతీలోనూ, 1,201 గ్రామాల్లోనూ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రదర్శనకు ఉంచామన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ వాక్సినేషన్ ఓటర్ల జాబితా అనుసరించి చేపట్టామన్నారు. నెల్లూరు జిల్లాను ఉదాహరణగా తీసుకుని ఇతర జిల్లాల్లో కూడా ఇదే విధంగా  చేపట్టాలని సూచించారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 97 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. జిల్లాలో గరుడ యాప్ ను చాలా చక్కగా వినియోగించుకుంటున్నామన్నారు. 

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బి ఓబులేసు, నెల్లూరు, గూడూరు, కావలి, నాయుడుపేట ఆర్ డి వో లు శ్రీ హుస్సేన్ సాహెబ్, శ్రీ మురళీకృష్ణ, శ్రీ  సీనా నాయక్,శ్రీమతి సరోజినీ, డిఆర్డిఎ పిడి శ్రీ సాంబశివ రెడ్డి, డ్వామా పి డి శ్రీ తిరుపతయ్య,  జడ్పీ సీఈఓ శ్రీనివాస రావు, డి.ఎస్.ఒ శ్రీ వెంకటేశ్వర్లు,  నియోజకవర్గాల తాసిల్దార్లు  పాల్గొన్నారు. 

Comments