దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు


పులివెందుల, వైయస్సార్‌ జిల్లా (ప్రజా అమరావతి);


*వైయస్సార్ జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.* 


*అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి.* 


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్ ఏమన్నారంటే... :*


చిక్కటి చిరునవ్వులతోనే గుండెల్లో పెట్టుకుని ఆప్యాయతలు చూపిస్తున్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మా, ప్రతి సోదరుడు, ప్రతి అవ్వా, తాతలకు, ప్రతి స్నేహితుడుకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 


*దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు


*

హెలికాప్టర్‌లో వస్తున్నప్పుడు ఈకాలనీ మొత్తం తిరిగాను.  323 ఎకరాలలో ఈ కాలనీ వస్తుంది. దీన్ని చూస్తున్నప్పుడు దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలో సంతోషం వేసింది. ఎందుకంటే ఈ రోజు కనీసం ఒక్కోక్క ఇంటి పట్టా విలువ తక్కువలో తక్కువ రూ.2 లక్షలు వేసుకున్నా... దాని తర్వాత ఇళ్లు కట్టడానికి మరో రూ.2 లక్షల రూపాయలు, ఆ తర్వాత అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఏడు వార్డు సచివాలయాలు, రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఏడు ప్రాధమిక పాఠశాలలు, 15 ఎకరాలలో మంచి పార్కు, ఒక పోలీస్‌ స్టేషన్, ఒక పోస్టాఫీసు, 10 ఎకరాలలో మంచి ఆటస్ధలం ఇవన్నీ ఇక్కడ ఏర్పాటవుతున్నాయి. ఇవి చేయడానికి అంటే నీళ్ల సరఫరా చేయడానికి రూ.28 కోట్లు ఖర్చు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం రూ.49 కోట్లు, రోడ్లు నిర్మాణానికి రూ.69 కోట్లు కలిపి మొత్తం రూ.147 కోట్లు ఇక్కడ ఖర్చు చేస్తున్నాం. ఈ రూ.147 కోట్లను 7400 ఇళ్లకు సగటున ఎంత అని చెప్పి పంచితే మరో రూ.2 లక్షలు వీటి కోసం ఇస్తున్నాం. ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వం తరపున ఇంటి స్ధలానికి రూ.2లక్షలు, ఇళ్లు కట్టడానికి రూ.2లక్షలు, రోడ్లు, డ్రైనేజీ ఇతర సౌకర్యాలకు మరో రూ.2లక్షలు కలిపి రూ.6 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఇవన్నీ పూర్తయి సంవత్సరమో, రెండు సంవత్సరాల తర్వాత వీటి విలువ కనీసం రూ.10 లక్షలు అక్క, చెల్లెమ్మల చేతిలో పెట్టినట్లవుతుంది. 


*అనేక ఇబ్బందులు దాటుకుని..*

అందుకనే ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు ఇక్కడ 7309 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. పక్కనే బ్రాహ్మణపల్లిలో మరో 733 మందికి ఇళ్లపట్టాలిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మొదట్లో అందరితో పాటు డిసెంబరు 25న చేద్దామనుకున్నాం.. .కానీ రకరకాల కోర్టు కేసులు, గిట్టని వారు  రకరకాల ఇబ్బందులు పెట్టిన పరిస్థితుల్లో .. ఆ చిక్కుముడులన్నింటినీ విప్పుకుని ఈ క్రిస్మస్‌ సందర్భంగా పులివెందుల, బ్రాహ్మణపల్లెలో 8042 మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో ఈ ఆస్తినిపెడుతున్నాం. 

ఈ లేవుట్‌లో రూ. 147 కోట్లతో అన్ని రకాల మౌలిక సదుపాయాలు చేపడుతున్నాం. వీటితో ఈ పక్కనే ఒక ఇండస్ట్రియల్‌ పార్కు కూడా రాబోతుంది. ఈ మధ్య కాలంలో అపాచీ అంటే ఆడిడాస్‌ షూ తయారు చేసే కంపెనీ తీసుకురావడం జరిగింది. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. అక్కడ దాదాపు రెండువేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఈ రోజు ఇక్కడకు రాకమునుపు ఆదిత్యా బిర్లా వస్త్ర పరిశ్రమకు శంకుస్థాపన చేశాం. మరో సంవత్సకారంలో ఈ ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది. అది పూర్తయిన వెంటనే మొదటి దఫాలోనే అక్కడ దాదాపు 2200 ఉద్యోగాలు వాళ్లు ఇస్తున్నారు.  ఈ ఇళ్ల కార్యక్రమాలు పూర్తయినవెంటనే ఇక్కడ నుంచి వాక్‌ టూ వర్క్‌..  ఇక్కడ నుంచి వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేసుకుని వాళ్లు ఇచ్చే రూ.10 వేలో, రూ.15వేలో తీసుకుని ఆనందంగా ఇంటికి రావచ్చు. మంచి జీతాలతో పక్కనే ఉద్యోగఅవకాశాలు కూడా కన్పిస్తున్నాయి. 


*మరికొన్ని అభివృద్ధి పనులకూ శ్రీకారం*

ఇవి కాక ఈ రోజు రక,రకాల కార్యక్రమాలు కొన్నింటికి శంకుస్థాపన చేశాం, కొన్నింటిని ప్రారంభించాం. ఈ ప్రారంభించే కార్యక్రమాల్లో పులివెందులలో మార్కెట్‌ యార్డుకు సంబంధించి రూ.10.50 కోట్ల వ్యవయంతో చేపట్టి మార్కెట్‌ యార్డు రూపురేఖలు మారుస్తూ పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రారంభిస్తున్నాం.


ఇదే మాదిరిగా పులివెందులలో రకరకాల అభివృద్ధిపనులు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి పరిస్థితి ఏమిటని పరిశీలిస్తే... చీనీ రైతుల సౌకర్యం కోసం 6 వేల టన్నుల చీనీ నిల్వ చేసే విధంగా రూ. 4 కోట్ల 79 లక్షల వ్యయంతో నిర్మించిన షెడ్‌ను కూడా ఇవాళ ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.

 పులివెందులతో పాటు, పెద్దముడియం, శ్రీ అవదూత కాశినాయన (ఎస్‌ఏకెఎన్‌) మండలాల్లో పోలీస్‌ స్టేషన్లు, పులివెందులలో పోలీస్‌మెన్‌ డార్మిటరీ కూడా ప్రారంభిస్తున్నాం.


*తొలిసారి ఆక్వాహబ్‌*

పులివెందులతో పాటు పరిసర ప్రాంత వాసులకు చేపలు, రొయ్యలకు సంబంధించిన దుకాణాలు వస్తాయని వస్తాయని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు. పులివెందులతో పాటు పరిసర ప్రాంత వాసులకు చేపలు, రొయ్యలుతో పాటు తాజా మత్స్య ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తూ.. ఆక్వా హబ్‌ ప్రారంభిస్తున్నాం.  దీంతో పాటు నియోజకవర్గంలో 100 పైగా ఫిష్‌ కియోస్క్‌లు అంటే రీటైల్‌ షాపులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. హబ్‌ ఇప్పటికే ప్రారంభమైంది. రిటైల్‌ షాపులు త్వరలోనే అన్నిచోట్లా కూడా రాబోతున్నాయి. 

రాష్ట్రంలో ఇటువంటివి 70 ఆక్వాహబ్‌లు పెడుతున్నాం. 14వేల రీటైల్‌ షాపులు పెడుతున్నాం. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలు జరుగుతాయి. ఒకటి చేపలు, రొయ్యలు పండించే రైతులకు సైతం గిట్టుబాటు ధరలు విషయంలో చర్యలు తీసుకునేదానికి ఇది వీలుకల్పిస్తుంది.  చేపలు, రొయ్యలు తింటే ఆరోగ్యంగా, బాగా ఉండే పరిస్థితి మా పులివెందుల ప్రజలకు దక్కే పరిస్థితి ఉంటుంది. రైతులకూ మంచి జరగడంతో పాటు ప్రజలకు మంచి ఆహారం లభిస్తుంది.  


*పులివెందులలో ఇంకా ఏమేం చేస్తున్నామో.. .వివిధ పనులకు సంబంధించిన పురోగతి చూస్తే...* 


 వైయస్సార్‌ ప్రభుత్వ వైద్య కళాశాల దీనికోసం రూ.500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులు వేగంగా సాగుతున్నాయి. 500 పడకల మెడికల్‌ కాలేజీ 2023 డిసెంబరు నాటికి వైద్య కళాశాలను అందుబాటులోకి తెస్తాం.

అదే మాదిరిగా కొత్త బస్‌ డిపో, బస్‌ స్టేషన్‌. దీనికోసం రూ.34.20 కోట్లతో చేపడుతున్న కార్యక్రమం... 2022 డిసెంబరు నాటికి పనులు పూర్తి చేసి, డిపో, బస్‌ స్టేషన్‌ను అందుబాటులోకి తెస్తాం. అది కూడా ఈ ప్రాంతానికి దగ్గరలోనే ఉంది. 


 పులివెందుల శిల్పారామం ఆధునీకరణ ద్వారా ప్రజలు ఆహ్లాదకరంగా ఉండాలని ప్రత్యేక ధ్యాసపెట్టాం. దీనికోసం రూ,12.96 కోట్లుతో పనులు చేయిస్తున్నాం. వచ్చే ఏప్రిల్‌ నాటికి పనులు పూర్తి చేసి సందర్శకులకు అనుమతిస్తాం.

పులివెందుల క్రీడా సముదాయం (ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌). దీనికోసం సుమారు రూ.18 కోట్లు వెచ్చించడం జరుగుతుంది. ఇది   2022 జూలై నాటికి పూర్తి చేస్తాం. 


అదే విధంగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే ప్రజలు చాలా సంతోషపడతారు అని చెప్పి.. మంచి నగరంగా తీర్చిదిద్దాలంటే మంచి పార్కులు ఉండాలి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి అని చెప్పి... దీనికోసం ఉలిమెల్ల సరస్సును సందర్శకులను ఆహ్లాదపర్చే విధంగా అభివృద్ధి చేస్తున్నాం. దీనికోసం రూ. 44 కోట్ల 99 లక్షలతో చేపట్టిన ఈ పనులను  2022 డిసెంబరు నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. 


పులివెందులలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ. రూ. 100 కోట్లతో చేపట్టిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జూలై నాటికి ఈ పనులు పూర్తవుతాయి. అదే విధంగా  రూ.65 కోట్లతో చేపట్టిన పులివెందుల సమగ్ర నీటి పథకాన్ని, ప్రతి ఇంటికి నీటి సదుపాయం అందే విధంగా వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేస్తాం. 

ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్‌ కళాశాలల్లో అదనపు వసతులు, వీటి కోసం రూ. 10 కోట్ల 59 లక్షలు ఖర్చు చేస్తున్నాం. పనులన్నీ చకచకా జరుగుతున్నాయి. 2022 మే నాటికి వీటిని కూడా పూర్తి చేస్తాం.

 కోటి ఇరవై లక్షలతో పులివెందులలో ఫైర్‌ స్టేషన్‌ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది.  జెఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో లెక్చర్‌ హాల్‌ కాంప్లెక్స్, ఇన్నొవేషన్, స్టార్టప్‌ సెంటర్‌ ఇవన్నీ పురోగతిలో ఉన్నాయి. 

 విద్యార్ధుల కోసం కోసం ఇండోర్‌ స్టేడియమ్‌ కూడా నిర్మిస్తున్నాం.  రూ. 20 కోట్ల 70 లక్షలతో చేపట్టిన ఈ పనులన్నింటినీ 2023 మార్చి నాటికి పూర్తి చేసి పిల్లలకు అందుబాటులోకి తీసుకొస్తాం. 


*రైతుల కోసం..*

పులివెందుల నియోజకవర్గంలో మండలానికి ఒకటి చొప్పున మొత్తం 8 మార్కెటింగ్‌ గిడ్డంగుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  2022 మార్చి నాటికి వీటిని పూర్తి చేస్తాం. ఇందు కోసం రూ. 9 కోట్ల 23 లక్షలు వ్యయం చేస్తున్నాం.

అరటి రైతుల కోసం ఇంటిగ్రేటెడ్‌  ప్యాక్‌ హౌజ్‌. శీతల గిడ్డంగి నిర్మిస్తున్నాం. 13 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులను 2022 డిసెంబరు నాటికి పూర్తి చేస్తాం.


ఇడుపులపాయలో పర్యాటక సర్క్యూట్‌తో పాటు, వైయస్సార్‌ స్మారక గార్డెన్‌ పనులు కొనసాగుతున్నాయి. రూ. 20 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులను 2022 మార్చి నాటికి పూర్తవుతాయి. 

 వేంపల్లిలో రూ. 92 కోట్ల వ్యయంతో చేపట్టే భూగర్భ డ్రైనేజీ పనులను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలుపెట్టి, 2023 జూలై నాటికి పూర్తి చేస్తాం.

వేంపల్లిలోనే రూ.20 కోట్ల వ్యయంతో చేపడుతున్న డిగ్రీ కాలేజీ పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలుపెట్టి, 2023లో విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి పూర్తి చేస్తాం.

మనమంతా గండి శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానానికి ఎక్కువగా వెళ్తుంటాం. ఈ దేవస్థానం పునర్నిర్మాణం కోసం రూ. 14 కోట్ల 50 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ పనులను 2023 జూన్‌ నాటికి పూర్తి చేస్తాం.


వేంపల్లిలో బాలురు, బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలలకు కొత్త భవనాలను 2022 ఏప్రిల్‌ నాటికి పూర్తి చేస్తాం. వాటి నిర్మాణ  కోసం రూ. 14 కోట్ల 80 లక్షలు ఖర్చు చేస్తున్నాం. 

వేంపల్లిలో పాలిటెక్నిక్‌ కాలేజీలో అదనపు తరగతి గదుల నిర్మాణం కూడా చురుగ్గా సాగుతోంది. రూ. 9 కోట్ల 97 లక్షలతో చేస్తున్న ఈ పనులు కూడా 2022 ఏప్రిల్‌ నాటికి పూర్తి చేస్తాం.


వేంపల్లిలో ఉర్దూ జూనియర్‌ కళాశాల పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. అవి కూడా 2022 ఏప్రిల్‌ నాటికి పూర్తవుతాయి. ఈ ఉర్దూ కాలేజీ కోసం రూ. 5 కోట్లు ఖర్చు చేస్తున్నాం.

సింహాద్రిపురంలో డ్రైనేజీ పనులను 2022 ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తాం. ఇందుకోసం 14 కోట్లు ఖర్చు చేస్తున్నాం. సింహాద్రిపురం పాలిటెక్నిక్‌ కాలేజీలో అదనపు తరగతి గదులతో పాటు, ల్యాబ్‌ ఏర్పాటు చేస్తున్నాం. రూ. 5 కోట్ల వ్యయంతో చేస్తున్న ఈ పనులు 2022 ఏప్రిల్‌ నాటికి పూర్తి చేస్తాం.


*రూ.480 కోట్లతో వాటర్ గ్రిడ్‌*

పులివెందుల నియోజకవర్గంలో రూ. 480 కోట్ల వ్యయంతో చేపట్టిన వాటర్‌గ్రిడ్‌  అంటే సమగ్ర నీటి సరఫరా వ్యవస్థ...  పనులను 2022 జూన్‌ నాటికి పూర్తవుతాయి. ఈ పనులు శరవేంగా జరుగుతున్నాయి. 

గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్‌) ప్రధాన కాల్వ నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) కాల్వ వరకు నీటిని తరలించే ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నాయి. ఇది పులివెందుల, రాయచోటి, తంబల్లపల్లె, పలమనేరు, మదనపల్లి, పుంగనూరు అన్ని నియోజకవర్గాలకు ఆయుకట్టు స్ధిరీకరించడానికి ఉపయోగపడుతుంది. 

రూ. 5 వేల 36 కోట్ల వ్యయంతో చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఈ పనులు కొనసాగుతున్నాయి, వాటిని 2023 జూన్‌ నాటికి పూర్తి చేస్తాం.  యురేనియమ్‌ తవ్వకాలతో ప్రభావితమయ్యే వేముల మండలంలోని 7 గ్రామాలకు నీటి సరఫరా కోసం చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (సీబీఆర్‌) నుంచి ఎర్రబల్లి చెరువు వరకు నీటి తరలించే పనులు జరుగుతున్నాయి. రూ.1100 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులను 2022 డిసెంబరు నాటికి పూర్తి చేస్తాం.

ఇక గండికోట నుంచి వచ్చే నీటిని 40 రోజుల్లో చిత్రావతి, పైడిపాలెం జలాశయాలు నింపడం కోసం చేపడుతున్న ఎత్తిపోతల పథకానికి మాత్రం కాస్తా అడ్డంకులు వచ్చాయి ఇక్కడ రైతులు భూసేకరణకు ఇష్టపడటం లేదు కాబట్టి సమస్య వచ్చింది. ఇది ప్రారంభించలేక పోతున్నాం. ఈలోగా ఉన్న కాలువ సామర్ధ్యం పెంచి అధ్యయనం చేయమని చెప్పి ఇంజనీరింగ్‌ శాఖకు చెప్పడం జరిగింది. 

అదే విధంగా పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ (పీబీసీ), గండికోట ఎత్తిపోతల పథకం (జీకేఎల్‌ఐ), చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (సీబీఆర్‌)వీటికి సంబంధించి కుడి కాల్వ పరిధిలో లక్షా 22 వేల ఎకరాలను.. సూక్ష్మ నీటి సాగు పరిధిలోకి తీసుకు రావడం కోసం చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.1256 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టాం. దీంట్లో 1200 సంపులు కట్టాల్సి ఉండగా... ఇప్పటికి 40 సంపులు పూర్తి కావస్తున్నాయి. మిగిలినవి కట్టడానికి రైతుల నుంచి భూసేకరణవిషయంలో సహాయ, సహకారాలు రావాల్సిన ఉంది. ఇది పులివెందులలో మనం చే సుకోగలిగితే.. ప్రతి ఎకరా సస్యశ్యామలం అవుతుంది. రైతులను సహకరించాలని కోరుతున్నాను. 

చేపట్టిన పనులను 2022 డిసెంబరు నాటికి పూర్తి చేస్తాం. పనులు వేగవంతం చేయాల్సి ఉంది. రైతులు కూడా ఇన్‌వాల్వ్‌ కావాల్సిన అవసరం ఉంది. 


అదే విధంగా వేముల, వేంపల్లి మండలాల్లో పీబీసీ కాల్వ చివరి టెయిల్‌ ఎండ్‌ గ్రామాల్లో ఆయకట్టు స్థిరీకరణ కోసం అలవలపాడు వద్ద రూ. 56 కోట్ల 83 లక్షల వ్యయంతో ఎత్తిపోతల పథకం చేపట్టడం జరిగింది. ఈ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. చిన్న ప్రాజెక్టు కాబట్టి ప్రారంభం అయిన వెంటనే స్పీడ్‌గా పనులు చేయించే దిశగా అడుగులు వేస్తాం. 


*పులివెందుల - మోడల్ టౌన్‌*

పులివెందుల మోడల్‌ టౌన్‌ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ గరండాలవంక సుందరీకరణ పనులు, రింగ్‌రోడ్డు సెంట్రల్‌ మీడియన్ పనులు, రిలయెన్స్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి కదిరి రోడ్డులో రోడ్డు విస్తరణపనులు, అహోబిల పురంలో మోడల్‌ స్కూల్‌ నిర్మాణం, మార్కెట్‌ పనులు కూడా మొదలయ్యాయి.


వీటితో పాటు సిటీసెంటర్, రాణితోపు డెవలప్‌మెంట్, స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్, షాపింగ్‌ కాంపెక్స్, సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్, స్లాటర్‌ హౌస్‌ తదితర పనులన్నీ కూడా అతి త్వరలోనే మొదలవుతాయి.


వీటన్నింటితో పాటు, పులివెందుల పరిసర మండలాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడం కోసం పులివెందుల పట్టణంలో కొత్తగా ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు, వేంపల్లిలో జూనియర్‌ కాలేజీ మంజూరు చేస్తున్నాం. ఈ రెండూ ఈరోజు తీసుకున్న నిర్ణయాలు.. వీటికి కూడా శ్రీకారం చుడుతున్నాం. 


 పులివెందులకు మంచి చేసే విషయంలో ఏనాడూ వెనుకంజ వేయలేదు. మమకారంతో, ప్రేమతో పులివెందుల ప్రజలకు మంచి జరగాలని ఆరాట పడ్డాం. ఇళ్ల పట్టాల పంపిణీ చేసే కార్యక్రమంలో ఇటు 9 కౌంటర్లు, అటు 9 కౌంటర్లు కనిపిస్తున్నాయి. నా మీటింగ్‌ తర్వాత మీ అందరికీ ఇళ్ల పట్టాలుతో పాటు ఇళ్లు కట్టడానికి శాంక్షన్‌ పత్రం కూడా ఇస్తారు. ఈ రోజు రేపు ఇవే కార్యక్రమాలు జరుగుతాయి. మీ ఇంటి శాంక్షన్‌కు సంబంధించిన పత్రాలు తీసుకుని వెళ్లండి.


 మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు వల్లే జగన్‌ అనే నేను ఇవన్నీ కూడా చేసే పరిస్థితుల్లో ఉన్నాను.  మీ అందరి చల్లని ఆశీస్సులు, దేవుడి దయ అని చెపుతూ..  మీ అందరి ప్రేమానురాగాలకు రుణపడి ఉంటాను అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు. 


అనంతరం అర్హులైన మహిళలకు ఇళ్లపట్టాలిచ్చే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు.

Comments