త్వరలో వరంగల్, నర్సంపేటలో ఇంటింటికి మేఘా గ్యాస్

 త్వరలో వరంగల్, నర్సంపేటలో ఇంటింటికి మేఘా గ్యాస్  పైప్ ల ద్వారా వంట గ్యాస్ సరఫరా 


హైదరాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం, విజయవాడ వెళ్లే రహదారుల్లో ప్రతి 20 కిలోమీటర్లకు  గ్యాస్ స్టేషన్ 


హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ గ్యాస్ విక్రయ కేంద్రాలు 


సన్నాహాలు చేస్తున్న  మేఘా గ్యాస్ 


వరంగల్, డిసెంబర్ 15 (ప్రజా అమరావతి):


వరంగల్, నర్సంపేట లలో ఇంటింటికి వంట గ్యాస్ సరఫరా చేసేందుకు మేఘా గ్యాస్ సన్నాహాలు చేస్తోంది.  వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఈ రెండు పట్టణాల్లో ఇంటింటికి వంట గ్యాస్ సరఫరా చేస్తామని మేఘా గ్యాస్  టెక్నికల్ హెడ్   జి. రాజ్ కుమార్ చెప్పారు.  బుధవారం హనుమకొండలోని నక్కలగుట్టలో  శ్రీ ప్రతాపరుద్ర ఆటోమోటివ్స్ లో   మేఘా గ్యాస్ కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సి ఎన్ జి ) విక్రయ కేంద్రాన్ని  భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల రిటైల్ సేల్స్ విభాగం డి జి ఎం కె ఎస్ వి భాస్కర రావు ప్రారంభించారు.  ఈ కార్యక్రమం లో ఆటోమోటివ్స్ యజమాని గుండు ప్రభాకర్,  రెటైల్స్ సేల్స్ మేనేజర్ జి. వినయ్ కుమార్, రిటైల్ ఇంజనీరింగ్ విభాగం మేనేజర్ హరీష్ పహాడియా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా రాజ్ కుమార్  మాట్లాడారు. తాము ప్రారంభించిన అవుట్లెట్ వరంగల్ , హనుమకొండల్లో మూడోదని చెప్పారు. త్వరలో  ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో  పది సి ఎన్ జి ఔట్లెట్లను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.  వరంగల్, నరసంపేట లలో ఇంటింటికి గ్యాస్ సరఫరా చేసేందుకు అనువుగా ప్రస్తుతం పైప్ లైన్ వేస్తున్నామని రాజ్ కుమార్ వెల్లడించారు.  ఇప్పటికే తాము నల్గొండ, భువనగిరి యాదాద్రి జిల్లాలోని బీ బీ నగర్, వలిగొండ ప్రాంతాల్లో ఇంటిటికి గ్యాస్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.  రంగారెడ్డి జిల్లాలో అవుటర్ రింగ్ రోడ్ వెమ్మడి సి  ఎన్  జి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.  హైదరాబాద్ నుంచి వరంగల్, అదే విధముగా హైదరాబాద్ నుంచి  విజయవాడ,ఖమ్మం రహదారుల్లో ప్రతి 20 కిలో మీటర్లకు ఒక సి ఎన్ జి విక్రయ కేంద్రాన్ని మేఘా గ్యాస్ ఆరంభిస్తుందన్నారు.  ఖమ్మం నగరంలోని రోటరీ నగర్, దంశాల పురం, ఖమ్మం బస్సు స్టాండ్ వద్ద  మేఘా గ్యాస్ సి ఎన్ జి కేంద్రాలు ప్రారంభిస్తున్నామన్నారు.  రంగారెడ్డి జిల్లాలో ఉన్న మూడు సి ఎన్ జి విక్రయ కేంద్రాలకు అదనంగా మరో 10 కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు.భాస్కర రావు మాట్లాడుతూ పర్యావరణ హితం కాంక్షించే వారందరు  తమ వాహనాలకు సి ఎన్ జి ని వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.    తమ సంస్థ పెట్రోల్ బంకుల్లో  సి ఎన్ జి విక్రయ కేంద్రాలను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.