సాయుధ దళాల సేవలు అనిర్వచనీయం

 

సాయుధ దళాల సేవలు అనిర్వచనీయం

రాష్ట్ర హోమ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైనిక్ వెల్పేర్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత

అమరావతి, డిశంబరు 07 (ప్రజా అమరావతి):  శత్రుమూకల నుండి దేశాన్ని నిరంతరం రక్షిస్తూ ప్రజలు సుఖశాంతులతో నిశ్చంతగా జీవించడానికి  సాయుధ దళాలు అందించే సేవలు వెలకట్టలేనివని, అనిర్వచనీయమైనవని రాష్ట్ర హోమ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత కొనియాడారు. సాయుధ దళాల పతాక దినోత్సవం-2021 ని పురస్కరించుకొని మంగళవారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో మంత్రి ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సైనికులకు, మాజీ సైనికులకు, వీర మరణం పొందిన సైనిక కుటుంబీకులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. 

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేశ భక్తికి ప్రతీకలైన సైనికులు ఎండా, వానా , చలిని ఏమాత్రం లెక్కచేయకుండా వారి ప్రాణాలను సైతం ఫణంగా పెడుతూ దేశ సరిహద్దుల్లో ఎంతో అంకిత భావంతో విధులను నిర్వహిస్తున్నారని అభినందించారు. దేశాన్ని ఎల్లవేళలా రక్షిస్తున్న సాయుధ దళాలకు, వారి కటుంబాలకు సమాజం యావత్తూ అండాగానిలవాల్సి ఉందని, సాయుధ దళాల పతాక నిధికి పెద్దఎత్తున విరాళాలను అందజేయాలని ఆమె పిలుపునిచ్చారు. దేశ రక్షణకై సైనికులుగా తమ బిడ్డలను పంపించే కుటుంబీకులు చాలా ఉన్నతాశయం గలవారని, అటు వంటి కుటుంబాలు గ్రామాలకు గ్రామాలు మన రాష్ట్రంలో ఎన్నో ఉండటం మన రాష్ట్రానికి ఎంతో గర్వకారణం అన్నారు. 

మానతా దృక్పదంతో ఆలోచించే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సాయుధ దళాల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నారన్నారు. వీర మరణం చెందిన సైనిక కుటుంబాలకు గతంలో రూ.5.00 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తే, ప్రస్తుతం మన ప్రభుత్వం రూ.50 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. మరణించిన సైనిక కుటుంబీకులకు కారుణ్యనియామకం క్రింద సత్వరమే ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడం జరుగుచున్నదన్నారు. సైనికులకు ఇళ్ల స్థలాల పట్టాలను కూడా వెంటనే అందజేయడం జరుగుచున్నదన్నారు.  సాయుధ దళాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లపుడూ కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. 

రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ వి.వెంకట రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణ విషయంలో సాయుధ ధళాలు అందజేసే సేవలు ఎంతో శ్లాఘనీయమని గుర్తించిన కేంద్ర కేబినెట్ కమిటీ 1949 సంవత్సరంలో డిశంబరు 7 వ తేదీని  సాయుధ దళాల పతాక దినోత్సవంగా ఖరారు చేయడం జరిగిందన్నారు. అప్పటి నుండి  సాయుధ  దళాల పతాక దినోత్సవాన్ని ప్రతి ఏడాది డిశంబరు 7 న నిర్వహించుకోవడం జరుగుచున్నదన్నారు. సైనికులకు ఇళ్ల స్థలాలు కేటాయించే ధరఖాస్తులు గత పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్నాయని, అయితే ఈ ప్రభుత్వం  అత్యంత ప్రాధాన్యతతో ఇప్పటి వరకూ 140 మందికి ఒక్కొక్కరికీ 300 చ.గ. విస్తీర్ణంగల ఇళ్లస్థలాల పట్టాలను అందజేయడం జరిగిందని, మరో ఐదు పెండింగ్ లో ఉన్నాయని, వారికి కూడా త్వరలో ఇళ్లస్థలాల పట్టాలు అందజేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా బాపట్ల, సత్తెనపల్లికి చెందిన సైనిక కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున ఎక్సేగ్రేషియాను ఈ ప్రభుత్వం అందజేసిందని తెలిపారు. ఆరుగురికి  కారుణ్యనియామక ఉత్తరువులను ఇప్పటికే అందజేయడం జరిగిందని, మరో ఇద్దరికి త్వరలో అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.  

దేశ రక్షణకై సరిహద్దులో అసువులు బాసిన ప్రకాశం జిల్లాకు చెందిన వీరసైనికుడు హవల్దార్  గుర్రాల చంద్రశేఖర్ యొక్క వీర పత్ని మేరీ మంజుల, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వీర సైనికుడు గోపాల కృష్ణ సురపతి యొక్క వీరపత్ని  దీపా, విజయనగరం జిల్లాకు చెందిన వీర సైనికుడు నాయక్ పాండ్రంకి చంద్రరావు యొక్క వీరపత్ని టి.సుధారాణి, కర్నాలు జిల్లాకు చెందిన వీర సైనికుడు సిపాయి పొలుకనటి శివ గంగాధర్ యొక్క వీరపత్ని యాదవల్లి రాధిక మరియు గుంటూరు జిల్లాకుచెందిన వీర సైనికుడు  సిపాయి ఎం.జస్వంత్ కుమార్ రెడ్డి యొక్క వీర పత్ని ఎం.వెంకటేశ్వరమ్మకు సైనిక సంక్షేమ ప్రత్యేక నిధి నుండి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని మంత్రి మేకతోటి సుచరిత చేతుల మీదుగా అందజేస్తూ వారిని  శాలువాతో సన్మానించారు.  సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా 164 సార్లు రక్తదానం చేసిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ సైనికుడు సార్జెంట్ బొడ్డేపల్లి రామకృష్ణారావును మంత్రి ప్రశంసిస్తూ శాలువాతో సన్మానించారు. 

అదేవిధంగా గత ఎడాది  సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్బంగా పెద్ద ఎత్తున విరాళాలను సేకరించిన తూర్పుగోదావరి జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి  కెప్టెన్ డా.పి.సత్యప్రసాద్(రిటైర్డు),  కర్నూలు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి  పి.రాచయ్య మరియు పశ్చిమ గోదావరి జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి  కె.వి.ఎస్.ప్రసాదరావుకు మంత్రి ట్రోఫీలను అందజేసి శాలువాతో సన్మానించారు. అందుకు సహకరించిన ఆయా జిల్లాల కలెక్టర్లను ఆమె అభినందించారు. 

రాష్ట్ర హోమ్ శాఖ ప్రధాన కార్యదర్శి  కుమార్ విశ్వజీత్,  సైనిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు  వి.వి.రాజారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.