విద్యుత్ ఆదా జీవన విధానంలో భాగం కావాలి

 విద్యుత్ ఆదా జీవన విధానంలో భాగం కావాలి'* 


*:జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి* 


*సందర్భం: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు(డిసెంబరు 14-20), జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం* 


*కార్యక్రమం: విద్యుత్ ఆదాపై అవగాహన ర్యాలీ* 


అనంతపురము, డిసెంబరు 14 (ప్రజా అమరావతి);


విద్యుత్ ఆదా, ఇంధన ఆదా లాంటి అంశాలు మన జీవన విధానంలో భాగం కావాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. ఒకప్పుడు రకరకాల ఇంధనాలు మన దైనందిన జీవితంలో కనిపించేవి కానీ ఇప్పుడు విద్యుత్ అనే ఏకైక ఇంధనంతో నడిచే దిశగా ప్రపంచం నడుస్తోందన్నారు. ఇప్పటికే మన జీవితాల్లో నిత్యావసరం లాగా భాగమైన విద్యుత్ ని ఆదా చేసుకోవడం ద్వారా మన జీవన ప్రమాణాలు మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందన్నారు.  ఈరోజు నుండి ఈనెల 20వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, పాఠశాల విద్య, గృహ నిర్మాణము,  మున్సిపాలిటీ, పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి, డిస్కంలు వివిధ శాఖలు ఈ కార్యక్రమంలో  భాగస్వాములు కావాలని ఆమె తెలిపారు ఈ  వారోత్సవాలలో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆమె కోరారు.


అనంత అత్యంత ఎక్కువ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న జిల్లా అని, రైతులు విద్యుత్ ఆదా ప్రమాణాలు పాటించడం, విద్యుత్ ను తక్కువగా వినియోగించుకుని, తక్కువ కాలంలో చేతికి వచ్చే పంటలను వేయడంపై దృష్టి సారించాలన్నారు. నాణ్యమైన మోటార్లు, ఇతర విద్యుత్ పరికరాలు వాడటం వల్ల మోటార్లు దీర్ఘకాలం పని చేసి రైతులకు అనవసర శ్రమ, ఖర్చులను తగ్గిస్తాయన్నారు.


సామాన్య ప్రజలు తమ కరెంటు బిల్లులను పరిశీలించి ఏయే నెలల్లో తమ వాడకం ఎక్కువగా ఉందో గుర్తించి, వినియోగం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఒక గదిలో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఫ్యాను, లైట్, ఏసీ లాంటివి ఆఫ్ చేసి వస్తున్నామా, లేదా అనే స్పృహ నిరంతరం ఉండాలన్నారు.  ప్రజలు విద్యుత్ ఆదా చేయడం వల్ల అన్ని రంగాలకు, అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యుత్ నిరంతరం అందించేందుకు వీలవుతుందన్నారు. 


స్థానిక కలెక్టరేట్ భవనంలో జాతీయ జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం(డిసెంబరు 14) మరియు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల (డిసెంబరు 14-20) సందర్భంగా ఇంధన శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ఆదాపై ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ప్రారంభించారు. 


ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, విద్యుత్ శాఖ ఎస్ ఈ నాగరాజు, వ్యవసాయ శాఖ జేడీ చంద్రా నాయక్,  జెడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. 


Comments