- గుడివాడ పట్టణంలో వెలమ సంక్షేమ సంఘ భవన నిర్మాణం అభినందనీయం
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
- 30 న ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వానం
- ఆహ్వాన పత్రికను అందించి శాలువాతో ఘన సత్కారం
గుడివాడ, డిసెంబర్ 27 (ప్రజా అమరావతి): రాష్ట్రంలోని వెలమ సంఘీయులకు విద్య, సంక్షేమం తదితర కార్యక్రమాల్లో చేయూతనిచ్చిన గుడివాడ పట్టణంలోని గౌతమ బుద్ధ హాస్టల్ స్థలంలో వెలమ సంక్షేమ సంఘ భవనాన్ని నిర్మించడం అభినందనీయమని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని రాజేంద్రనగర్లో ఉన్న నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడివాడ పట్టణ వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గంటా ఆనంద్, ప్రధాన కార్యదర్శి గులిపల్లి ప్రభాకరరావు, ట్రెజరర్ వర్రె శ్రీనివాసరావు, సభ్యులు బోరాడ మధుసూదనరావు, గులిపల్లి రవికుమార్, మూకల సత్యనారాయణ, వంగపండు బ్రహ్మాజి, మూడెడ్ల ఉమా, మూడెడ్ల శ్రీధర్, రెడ్డి షణ్ముఖ, మర్రాపు శంకర్ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గంటా ఆనంద్ మాట్లాడుతూ గుడివాడ పట్టణం 8 వ వార్డు శ్రీరాంపురంలో వెలమ సంక్షేమ సంఘం భవనాన్ని సంఘ సభ్యుల సహకారంతో నిర్మించామన్నారు. ఈ భవనాన్ని ఈ నెల 30 వ తేదీ ఉదయం 10.36 గంటలకు ప్రారంభించేందుకు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో కలిసి రావాలంటూ మంత్రి కొడాలి నానిని ఆహ్వానించామన్నారు. ప్రారంభోత్సవ సభకు ముఖ్యఅతిథులుగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు, నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, విశిష్ఠ అతిథులుగా కొప్పుల వెలమ కార్పోరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, నవరత్నాల అమలు పథకం వైస్ చైర్మన్ అంకమరెడ్డి నారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, గౌరవ అతిథులుగా విజయవాడ వెలమ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు గంటా శ్రీనివాసరావు, అధ్యక్షుడు మూకల అప్పారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సిరిపురపు కిరణ్ కుమార్, ట్రెజరర్ గంటా శ్రీనివాసరావు తదితరులు విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానికి ఆహ్వాన పత్రికను అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో వెలమ సంఘీయుల సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పారు.
addComments
Post a Comment