కండలేరు జలాశయ మట్టికట్ట శాశ్వత మరమ్మతు పనులను త్వరలోనే పూర్తి

 

నెల్లూరు, డిసెంబర్ 18 (ప్రజా అమరావతి): కండలేరు జలాశయ మట్టికట్ట శాశ్వత మరమ్మతు పనులను త్వరలోనే పూర్తి


చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. శనివారం  రాపూరు మండలం కుమ్మరగుంట వద్ద కండలేరు మట్టికట్ట 6వ కిలోమీటర్ వద్ద ఇటీవల సంభవించిన వర్షాలకు మట్టి కొంత దిగువకు జారిన ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఇక్కడ చేపడుతున్న మరమ్మతు పనులను తెలుగు గంగ పర్యవేక్షక ఇంజనీర్ శ్రీ హరి నారాయణ రెడ్డి కలెక్టర్ కు వివరించారు. మట్టి జారిన వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టామని మరో పది రోజుల్లో పూర్తిస్థాయి మరమ్మతు పనులను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కండలేరు వద్ద మట్టికట్ట నుంచి మట్టి కిందకు జారడంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు తాను వచ్చినట్లు పేర్కొన్నారు. ఇక్కడ మట్టి జారిన వెంటనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టినందుకు కలెక్టర్ కండలేరు జలాశయ అధికారులను అభినందించారు. అలాగే ఇటీవల జిల్లాలో సంభవించిన వరదలకు దెబ్బతిన్న గ్రామాల్లో మంచినీరు,  రహదారి, విద్యుత్ ఇతర సౌకర్యాల పునరుద్ధరణకు చేపట్టిన తాత్కాలిక మరమ్మతు పనులు పూర్తయ్యాయని చెప్పారు. జిల్లాలో 37 చోట్ల పంచాయతీ రాజ్ రహదారులు దెబ్బతినగా 30 చోట్ల మరమ్మతు పనులు పూర్తి చేశామని, ఆర్ అండ్ బి కి సంబంధించి 30 మేజర్, 30 మైనర్ మొత్తం 60 రహదారుల మరమ్మతు పనులకు అనుమతులు మంజూరు చేశామని, కొన్నిచోట్ల శాశ్వత మరమ్మతు పనులకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని కలెక్టర్ వివరించారు. గ్రామాల్లో మెడికల్ క్యాంపు లు, పారిశుద్ధ్య నివారణా చర్యలను చేపట్టినట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పశువులకు రెండు వేల మెట్రిక్ టన్నుల దాణాను ఉచితంగా అందించామని, నష్టపరిహారం కూడా చెల్లించామన్నారు. పునరావాస కేంద్రాల్లో గడిపిన కుటుంబాలకు అవసరమైన ప్రభుత్వ సహాయాన్ని అందించామన్నారు. జిల్లాలో 251 పక్కా గృహాలు దెబ్బతిన్నాయని వీరికి కొత్త గృహాలు మంజూరు చేసినట్లు చెప్పారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ళకు 95 వేల రూపాయలు, పూరి గుడిసెలకు 5200 రూపాయలు బాధితుల ఖాతాల్లోకి జమ చేసినట్లు చెప్పారు. జిల్లాలో వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు చాలామంది ముందుకు వచ్చారని, వీరి సాయంతో అవసరమైన చోట బాధితులకు ఇంటి సామాగ్రి, ఎస్టిలకు ఇంటి నిర్మాణానికి 15 వేల రూపాయల అదనపు సహాయాన్ని అందజేస్తామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వరద నష్టం నివారణ చర్యలను ముమ్మరంగా చేపడుతున్నట్లు వివరించారు. 

  ఈ పర్యటనలో తెలుగు గంగ ప్రాజెక్ట్ ఈఈ విజయ్ కుమార్ రెడ్డి, డిఈ శ్రీ విజయరామిరెడ్డి, ఏఈ తిరుమలయ్య, ఎంపీడీవో శ్రీ ఆమోష్ బాబు, తాసిల్దార్ శ్రీమతి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.



అనంతరం జిల్లా కలెక్టర్ రాపూరు మండల పరిధిలోని కంబాలపల్లి సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నూతన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, బల్క్ మిల్క్ సెంటర్ నిర్మాణాల పురోగతిపై పంచాయతీ రాజ్ ఏఈ వాసుని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు రుణ విముక్తి పత్రాలను అందజేశారు. 

   కలెక్టర్ వెంట ఎంపీడీవో శ్రీ ఆమోష్ బాబు, తాసిల్దార్ శ్రీమతి పద్మావతి, సచివాలయ అడ్మిన్ మమత, సిబ్బంది వేణు, నాగేశ్వరరావు, శిరీష, వాలంటీర్లు పాల్గొన్నారు. 

Comments