కష్ట కాలంలో వైఎస్సార్ కుటుంబానికి అండగా నిలిచిన ధర్మాన కృష్ణదాస్
- కష్ట కాలంలో వైఎస్సార్ కుటుంబానికి అండగా నిలిచిన ధర్మాన కృష్ణదాస్


 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, డిసెంబర్ 30 (ప్రజా అమరావతి): కష్టకాలంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుటుంబానికి డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ అండగా నిలిచారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం శ్రీరాంపురంలోని గౌతమబుద్ధ హాస్టల్ స్థలంలో నూతనంగా నిర్మించిన గుడివాడ వెలమ సంక్షేమ సంఘ భవన ప్రారంభోత్సవ సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడారు. 2010 నవంబర్ నెల్లో కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన సీఎం జగన్మోహనరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని చెప్పారు. కాంగ్రెస్లో మంత్రిగా ఉన్న తన సోదరుడు ధర్మాన ప్రసాదరావు ఎంత చెప్పినా వినకుండా డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్ కు అండగా నిలిచారన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ప్రేమగా పిలిచేవారని, ఆయన మరణం తర్వాత జగన్ వెనక నడిచేందుకు ఎమ్మెల్యే పదవిని కూడా ధర్మాన కృష్ణదాస్ వదులుకున్నారన్నారు. అప్పటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు కూడా వెళ్ళలేదని, ఏం జరుగుతుందో తెలియకపోయినా వైఎస్సార్ కుటుంబానికి అండగా ఉండేందుకు ధర్మాన కృష్ణదాస్ తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టారన్నారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఎమ్మెల్యేగా గెల్చిన ధర్మాన కృష్ణదాస్ తన సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం జగన్ కు సలహా కూడా ఇచ్చారన్నారు. కష్టకాలంలో అండగా నిలిచిన ధర్మాన కృష్ణదాస్ కు డిప్యూటి సీఎం పదవిని ఇచ్చి సీఎం జగన్ కూడా కృతజ్ఞత చూపారన్నారు. డిప్యూటి సీఎం పదవిని చేపట్టిన ధర్మాన కృష్ణదాస్ కేబినెట్ మంత్రులందరితో సఖ్యతగా మెలుగుతూ వస్తున్నారన్నారు. తన దగ్గరకు ఏ పనిమీద వచ్చినా కుల, మతాలు చూడకుండా గౌరవంగా మాట్లాడి పనిచేసి పంపుతారన్నారు. శ్రీకాకుళం జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి కావడంతో తాను ధర్మాన కృష్ణదాస్ స్వగ్రామం నర్సన్నపేటలోని ఆయన ఇంటికి కూడా వెళ్ళానన్నారు. ఎంతో ప్రేమానురాగాలతో ధర్మాన కృష్ణదాస్ కుటుంబ సభ్యులకు తనను ఆదరించారని గుర్తు చేసుకున్నారు. వెలమ సంఘీయులు ధనిక కమ్యూనిటీ అని ఇక్కడ వచ్చే వరకు తనకు తెలియదన్నారు. ధనికులు అంటే కోట్లాది రూపాయల డబ్బు సంపాదించిన వారు కాదని, మంచి పనికి స్థాయికి మించి సహకారం అందించేవారేనని అన్నారు. ముందుగా డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ కు వెలమ సంక్షేమ సంఘం నేతలు పుష్పగుచ్ఛాన్ని అందజేసి సత్కరించారు. అనంతరం మంత్రి కొడాలి నానితో కలిసి డిప్యూటి సీఎం ధర్మాన వెలమ సంఘీయుల ఐక్యతను చాటుతూ చేతులు కలిపారు. 

ఈ కార్యక్రమంలో నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, నవరత్నాలు అమలు కమిటీ వైసైచైర్మన్ అంకమరెడ్డి నారాయణమూర్తి, మాజీ మంత్రి మరడాని రంగారావు, వెలమ కార్పోరేషన్ డైరెక్టర్లు జీ మాధవి, జీ శ్రీనివాసరావు, నవుడు వెంకటరమణ, గుడివాడ వెలమ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ గోర్జి సత్యనారాయణ, అధ్యక్షుడు గంటా ఆనంద్, ప్రధాన కార్యదర్శి గులిపల్లి ప్రభాకరరావు, విజయవాడ అధ్యక్షుడు మూకల అప్పారావు, జడ్పీటీసీ సభ్యుడు రొంగల అప్పాజీ, సంఘ నాయకులు మూడెడ్ల రామారావు, సంభంగి రంగారావు, చింతల భాస్కరరావు, సింగిరెడ్డి గగారిన్, నగిరెడ్డి మోహన్, సబ్బాని రంగారావు, మూడెడ్ల ఉమా, మూడెడ్ల శ్రీధర్, గంటా చంద్రశేఖర్, వంగపండు బ్రహ్మాజి, వీ బాబు, గులిపల్లి రవికుమార్, గేదెల రమేష్, సిరిపురపు కిరణ్ కుమార్, గంటా శ్రీనివాసరావు, దత్తి సింహాచలం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలడుగు రాంప్రసాద్, వల్లూరుపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.