కష్టంలో అండగా...
*కష్టంలో అండగా...*


*డ్రైవర్ కుటుంబానికి రూ.4 లక్షలు ఆర్థిక సాయం*

*రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి!*

*కుటుంబాన్ని ఆదుకున్న రాష్ట్ర సమాచార కమిషనర్*

*భవిష్యత్తులోనూ అండగా ఉంటానని భరోసా*

మంగళగిరి (ప్రజా అమరావతి);

          తన వద్ద పని చేసే డ్రైవర్ మృతి చెందటంతో చలించిపోయిన రాష్ట్ర సమాచార కమిషనర్ డాక్టర్ చావలి సునీల్ డ్రైవర్ కుటుంబానికి అండగా నిలిచారు. డ్రైవర్ తల్లిదండ్రులను తన కార్యాలయానికి పిలిపించి రూ.4 లక్షలు ఆర్థిక సాయం అందజేసి చేయూతనిచ్చి, మానవత్వానికి చిరునామాగా నిలిచారు. వివరాల్లోకి వెళితే..

ఏలూరు కు చెందిన జక్కుల ప్రకాష్ బాబు (22) కొద్ది కాలంగా మంగళగిరి మండలం చినకాకాని పరిధి ఎన్నారై వైద్యశాల సమీపంలో గల రాష్ట్ర  కార్యాలయంలో సమాచార కమిషనర్ చావలి సునీల్ వద్ద కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. పని ముగించుకుని స్థానికంగా నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఏలూరులో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు. ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం రాజు పోతుపల్లి గ్రామం వద్ద గత నెల 31న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాష్ మృతి చెందాడు. అండగా ఉంటాడనుకున్న కొడుకు దూరమైన ఘటన తల్లిదండ్రులను కలచి వేసింది.  సమాచార కమిషనర్ చావలి సునీల్ విచారం వ్యక్తం చేశారు. డ్రైవర్ కుటుంబానికి అండగా నిలవాలన్న ఉద్దేశంతో తన నెల జీతంతో పాటు మిత్ర బృందం నుండి రూ.4 లక్షలు సేకరించారు.  రూ 4 లక్షలు చెక్కును ప్రకాష్  తండ్రి నరసింహారావు, తల్లి భారతీ లకు శుక్రవారం రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ చావలి సునీల్  అందజేశారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు..డ్రైవర్ ప్రకాష్ మృతి తీరని లోటు అని చావలి సునీల్ అన్నారు. ద్విచక్ర వాహనం పై వెళ్లే వారు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.

*హెల్మెట్లు అందజేత*

తన వద్ద పనిచేసే డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుర్ఘటనను జాతీయ రహదారిపై హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసే ద్విచక్ర వాహన చోదకులకు చావలి సునీల్ తెలియజేశారు. ఈ సందర్భంగా హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తూ, హెల్మెట్లను  ఉచితంగా అందజేసి వాటిని ధరించి వాహనాలపై రాకపోకలు సాగించాలని సూచించారు.   ప్రాణం ఎంతో విలువైనది అని  దానిని కాపాడుకోవాలని ఈ విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

Comments