వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వివరాలు అందించాలి.

 గుంటూరు, 28 జూన్ 2025 (ప్రజా అమరావతి):- జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారుల సమన్వయంతో సక్రమంగా అమలు జరిగేలా పకడ్బందీ ప్రణాళిక ప్రకారం కృషి చేస్తున్నామని కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 

     శనివారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ , జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, రాజ్యసభ సభ్యులు ఆళ్ళ  అయోధ్య రామిరెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రీస్టీనా, శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్,  బూర్ల రామాంజనేయులు,   గళ్లా మాధవి , జీయంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు తో కలసి పాల్గొన్నారు. జిల్లాలో జాతీయ రహదారుల ప్రాజెక్టులు, ఆర్వోబీలు, ఆర్ యూ బీలు, అమృత్ పథకం, జల్ జీవన్ మిషన్, అయూష్మాన్ భారత్ , సూర్య ఘర్ , ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం అమలు తీరుపై సంబంధిత శాఖ అధికారులతో కేంద్ర  గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ , శాసన సభ్యులు  సమీక్ష నిర్వహించి సూచనలు అందించారు. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో జల్ జీవన్ మిషన్ పనుల తీరుపై నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలోని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వివరాలు అందించాల


న్నారు. పీఎం సూర్యఘర్ యూనిట్లు ప్రతి ఒక్కరు ఏర్పాటు చేసుకునేలా గ్రామ స్థాయిలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కల్పించాలన్నారు.  ప్రధాన మంత్రి  అవాస్ యోజనా, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్ పథకాలపై సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలపై తదుపరి మూడు నెలల తరువాత జరిగే దిశ సమావేశం నాటికి నిర్దేశించిన మేరకు అధికారులు చర్యలు తీసుకొని నివేదికలు అందించాలన్నారు.

జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకంకు సత్వరమే రుణాలు మంజూరు చేసేలా బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించటం జరుగుతుందన్నారు. ప్రధాన మంత్రి అవాస్ యోజన పధకంలో అనర్హులను గుర్తించేందుకు ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తున్నామన్నారు.  

రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో త్రాగునీటి పథకం ఫిల్టరేషన్ ప్లాంట్ లు శుభ్రపరచాలన్నారు. పీఎం సూర్యఘర్ పధకం యూనిట్ల ఏర్పాటుకు పీపీపీ పద్దతిలో చర్యలు తీసుకోవాలన్నారు.

  శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద ప్రజా ప్రతినిధుల వాహనాలకు క్యూలైన్ లో కాకుండా ప్రత్యేకంగా దారిని ఏర్పాటు చేయాలన్నారు. జల్ జీవన్ మిషన్ పనులు గత ప్రభుత్వ హయంలో నియోజకవర్గంలో అస్తవ్యస్తంగా జరిగాయని, దీనిపై పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలన్నారు. 

  శాసన సభ్యులు బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ అమృత్ 1.0 లో మంజూరు చేసిన గోరంట్ల రిజర్వాయర్ పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రధాన మంత్రి అవాస్ యోజన పధకం ఇళ్ళ నిర్మాణానికి లే అవుట్ లకు సేకరించిన భూములలో నిరుపయోగంగా ఉన్న వాటిని తిరిగి వినియోగించుకునేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాలన్నారు. ప్రదాన మంత్రి అవాస్  యోజన పధకం పనులలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలన్నారు.

సమావేశం అనంతరం కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ఫథకాల అమలు తీరును పరిశీలించేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాస్థాయి అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ ( దిశ) సమావేశం ప్రజా ప్రతినిదులు, అధికారులతో నిర్వహించి అవసరమైన సూచనలు అందించటం జరుగుతుందన్నారు. ముఖ్యంగా జిల్లా జాతీయ రహదారుల ప్రాజెక్టుకు సంబంధించి గొల్లపూడి  నుంచి చినకాకాని వరకు నిర్మిస్తున్న వెస్ట్రన్ బైపాస్ పనులు 90 శాతం వరకు పూర్తి అయ్యాయని, సెప్టెంబరు నాటికి నూరు శాతం పనులు పూర్తి అవుతాయన్నారు. ఎయిమ్స్ వద్ద జాతీయ రహదారి నుంచి అప్రోచ్ రోడ్డు పనులు అక్టోబరు నాటికి పూర్తి అవుతాయన్నారు. అమరావతి రింగు రోడ్డు పనులు , వినుకొండ అమరావతి రోడ్డు, గుంటూరు – నిజాంపట్నం రోడ్డు పనులకు సంబంధించి  కేంద్ర ప్రభుత్వంతో పరిశీలించాల్సిన అంశాలపైన చర్చించటం జరిగిందని, పనులు వేగవంతం అయ్యేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వేకి సంబంధించి నందివెలుగు, పేరేచర్ల, ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద మంజూరు చేసిన అర్వోబీ పనులు ప్రారంభించటానికి, సంజీవయ్యనగర్, శ్యామల నగర్, నెహ్రునగర్ – సీతానగరం ఆర్వోబీ నిర్మాణ పనులు వేగవంతం చేయటం జరుగుతుందన్నారు. అమృత్ 2.0 ద్వారా మంజూరు చేసిన త్రాగునీటి సరఫరా పనులకు టెండర్లు పిలవటం జరిగిందని, అగష్టు 15  నాటికి పనులు ప్రారంభించేలా అధికారులతో చర్చించటం జరిగిందన్నారు. అమృత్ 1.0 లో పెండింగ్ పనులను నాలుగు నెలల్లో పూర్తి చేసేలా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా జిల్లాలో 722 పనులు మంజూరు కాగా వీటిలో ఇప్పటికీ పనులు ప్రారంభించని 400 పనులను ప్రబుత్వం రద్దు చేసిందని, దాదాపు 300 పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జల్ జీవన్ మిషన్ తో స్థిరమైన  మంచి నీటి వనరులతో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి పైపులైన్లు త్రాగునీరు సౌకర్యం కల్పించాల్సి ఉండగా , గత ప్రభుత్వం పరిమితమైన నీటి వనరులతోనే పనులు నిర్వహించారని, వీటీని సరిచేయాల్సిన అవసరం ఉందని, అదే విధంగా పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లుకు రూ. 10 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉందని, దీనిపై ముఖ్యమంత్రి స్థాయిలో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పీఎం సూర్యఘర్ కు జిల్లాలో 7.8 లక్షల కుటుంబాలు అర్హులని, వీరిలో ప్రస్తుతం 1.10 లక్షల మంది పీఎం సూర్యఘర్ దరఖాస్తు చేసుకున్నారని, పది శాతం ఇప్పటికే వెండర్స్ కు మ్యాపింగ్ చేయటం జరిగిందన్నారు. నియోజవర్గం లేదా పార్లమెంట్ పరిధిలో పీపీపీ పద్దతిలో యూనిట్లు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. పీఎం సూర్యఘర్ కు బ్యాంకర్లు వెంటనే రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో అయుష్మాన్ భారత్ ద్వారా ఇప్పటికే ఆరు లక్షల మందిని నమోదు చేశామని, ఇంకా 3.6 లక్షల మంది నమోదు చేయాల్సి ఉందని, రానున్న రెండు నెలల్లో నమోదు ప్రక్రియ పూర్తి అయ్యేలా వైద్యారోగ్యశాఖ అధికారులకు సూచనలు అందించామన్నారు. ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం ద్వారా నిర్మించిన లే అవుట్ల లో గత ప్రభుత్వంలో కనీస సౌకర్యాలు కల్పించక పోవటం వలన ప్రజలు నివాసానికి అనుకూలంగా లేక నిరుపయోగంగా ఉన్నాయన్నారు.  అనర్హులకు ఇళ్ళు కేటాయింపు, లే అవుట్ అభివృద్ధి పనులలో అవినీతి, నాసిరకం నిర్మాణాలు, లే అవుట్లలో సామన్ల చోరి తదితర అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. లే అవుట్లలోని ఇళ్ళలో ప్రజలు నివసించటానికి వీలుగా కల్పించాల్సిన మౌలిక సౌకర్యాలు, రవాణా సౌకర్యాలపై సంబంధిత శాఖల అధికారులను పూర్తి నివేదిక అందించాలని అదేశించటం జరిగిందన్నారు. 

సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్  కే ఖాజావలి, జిల్లా పరిషత్ సీఈఓ జ్యోతి బసు, జాతీయ రహదారులు, రైల్వే, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Comments