= నాట్య కళాయోగి పామర్తి జీవిత చరిత్రపై గ్రంథాన్ని రూపొందించడం అభినందనీయం
= రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
= గ్రంథావిష్కరణకు రావాలంటూ కళాసంఘాల ఆహ్వానం
గుడివాడ, డిసెంబర్ 17 (ప్రజా అమరావతి): నాట్య కళాయోగి పామర్తి సుబ్బారావు జీవిత చరిత్రపై గ్రంథాన్ని రూపొందించడం అభినందనీయమని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని శ్రీప్రభాకర నాట్యమండలి అధ్యక్షుడు మట్టా రాజా, సరిగమ సంగీత పరిషత్ కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఆర్వీఎల్ నరసింహారావు, సరిగమ సంగీత పరిషత్ అధ్యక్షుడు శీరం శ్రీనివాసరావు తదితరులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నట ప్రభాకర, హాస్యరత్న, క్రీడా కిరీటి పామర్తి సుబ్బారావు గ్రంథావిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 19 వ తేదీ ఉదయం 10 గంటలకు గుడివాడ పట్టణంలోని శ్రీకైకాల సత్యనారాయణ పురపాలక కళామందిరంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. పద్మభూషణ్, ఆచార్య డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ గ్రంథాన్ని ఆవిష్కరిస్తారన్నారు. గ్రంథావిష్కరణ సభకు ముఖ్యఅతిథిగా రావాలంటూ మంత్రి కొడాలి నానిని ఆహ్వానించి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ పట్టణం కళారంగానికి పుట్టినిల్లు అని అన్నారు. ఈ ప్రాంతం నుండే ఎన్టీఆర్, ఏఎన్నార్, కైకాల, ఘంటసాల వంటి కళాకారులు ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారని చెప్పారు. ఎంతో మంది కళాకారులను దివంగత పామర్తి సుబ్బారావు తయారు చేశారని, ఎన్నో నాటకాలకు రంగస్థలంపై ప్రాణం పోశారన్నారు. నేటికీ పామర్తి సుబ్బారావు రచించిన నాటకాలను ఆయన శిష్యులు ప్రదర్శనలు ఇస్తున్నారని చెప్పారు. అటువంటి కళాకారుడు గుడివాడ పట్టణంలో పుట్టడం కళాకారుల అదృష్టమని అన్నారు. పామర్తి సుబ్బారావు కళారంగానికి అందించిన సేవలను గుర్తుచేస్తూ ఆయన జీవిత చరిత్రపై గ్రంథాన్ని రూపొందించడం నేటి కళాకారులకు స్పూర్తిగా నిలుస్తుందని మంత్రి కొడాలి నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, నందివాడ ఎంపీపీ పెయ్యల ఆదాం, పార్టీ నేతలు పాలడుగు రాంప్రసాద్, పాలేటి చంటి , షేక్ బాజీ, మురారి నగేష్, గోవాడ చంటి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment