ఆప్యాయతలు, ఆత్మీయతల మధ్య తణుకు నగరంలోకి రావడం ఆనందంగా ఉంది.


తణుకు, పశ్చిమగోదావరి జిల్లా (ప్రజా అమరావతి); గా



*గతంలో ఉన్న కేవలం నివసించే హక్కు స్ధానంలో దాదాపు 52 లక్షల మందికి సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్‌ – జగనన్న సంపూర్ణ గృహహక్కు*


*ఈ పథకం ద్వారా ఇప్పటికే లబ్ధిపొందిన దాదాపు 8.26 లక్షల మందికి నేటి నుంచి రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందించే కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....:* 


ఈ రోజు ఎంతో ఆప్యాయతలు, ఆత్మీయతల మధ్య తణుకు నగరంలోకి రావడం ఆనందంగా ఉంది.


ఇక్కడకు వచ్చినప్పటినుంచి మీ ప్రేమానారాగాలు చూస్తుంటే... సొంత అన్నకు, తమ్ముడు ఎలాంటి ఆప్యాయతలు చూపిస్తారో ఆ ఆప్యాయతలకు ఏమాత్రం తగ్గకుండా చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలను చూపిస్తున్న  ప్రతి అక్క, చెల్లెమ్మ, అవ్వా, తాతలకు, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.


*మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం..*

దేవుడు దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అందులోనూ నా పుట్టిన రోజు నాడు దాదాపుగా 50 లక్షల పై చిలుకు కుటుంబాలకు మంచి జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. 


*ఇళ్లు- ఆనందాలకు సాక్ష్యం*

ఇళ్లు అంటే కేవలం ఇటుకలు, స్టీల్‌ వీటితో కట్టిన కట్టడం మాత్రమే కాదు. ఇళ్లు అంటే ఒక సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతీక. ఒక ఇళ్లు కట్టుకుంటే ఆ ఇంట్లో  సంతోషాలకు, ఆనందాలకు వారికది సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. 


సొంత ఊరు మాదిరిగానే మనం ఉన్న ఇళ్లను కూడా మన జీవితకాలం గుర్తుపెట్టుకుంటాం. ఈ రోజు ఒక ఇళ్లు ఎంత అవసరమో మనమంతా చూస్తుంటాం. కుటుంబంలో రూపాయి, రూపాయి ఖర్చు మిగుల్చుకుంటూ.. ఆ మిగిలిన ప్రతి రూపాయితోనూ చివరికి తమ పిల్లలకు ఏదైనా ఒక ఆస్తిగా ఇవ్వడానికి ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుందంటే అది ఒక చక్కటి ఇళ్లు కట్టుకొవడమే.

ఆ ఇంటిని వాళ్లు బ్రతికినంత కాలం అనుభవించి వాళ్ల తదనంతరం ఒక ఆస్తిగా పిల్లలకు ఇవ్వాలని చాలామంది రూపాయి, రూపాయి పొదుపు చేసుకుంటూ ఇళ్లు కట్టుకుంటారు. 


*అటువంటి కలను నిజం చేస్తూ...*

ఈ రోజు అటువంటి కలని నిజం చేస్తూ... ఇప్పటికే ఈ రెండున్నర సంవత్సరకాలంలోనే దేవుడి దయతో మనందరి ప్రభుత్వం 31 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. 31 లక్షల ఇళ్లపట్టాలంటే చరిత్రలో ఎప్పుడూ కనీ, వినీ ఎరుగని విధంగా ప్రతి పేదకు తమ సొంతింటి కలను మీ ఆన్నగా సాకారం చేస్తూ... నిండు మనస్సుతో  ఇప్పటికే అక్కచెల్లెమ్మలకు అందించాం.


*ఇప్పటికే 15.60 లక్షల ఇళ్లు మొదలు* 

వీటిలో 15.60 లక్షల ఇళ్లకు సంబంధించి నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. 31 లక్షల ఇంటి స్ధలాల విలువ అక్షరాలా రూ.26 వేల కోట్లు. ఈ 31 లక్షల ఇళ్లు కట్టడం కూడా పూర్తయితే... ఆ ఇంటికి పెట్టిన మౌలిక సదుపాయాలు కూడా కలుపుకుంటే... ప్రతి అక్క చేతిలో కనీసం అంటే రూ.5 నుంచి రూ. 10 లక్షలు వారి చేతిలో పెట్టినట్లవుతుంది. అలాంటి గొప్ప కార్యక్రమానికి ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో మనం శ్రీకారం చుట్టాం. 


*52 లక్షల మందికి సర్వ హక్కులూ...*

రాష్ట్రంలో దాదాపు 52 లక్షల మందికి తమ ఇంటిలో నివసించే హక్కు మాత్రమే ఉన్న కుటుంబాలకు... అంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇంటి పట్టాలు, ఇంటి స్ధలాలు వస్తూనే ఉన్నాయి. అయినా కూడా వారికి నివసించే హక్కు మాత్రమే ఉన్న ఈ కుటుంబాలన్నింటికీ కూడా వారి ఇంటి మీద సర్వ హక్కులు ఇచ్చేందుకు జగనన్న సంపూర్ణగృహహక్కు పథకాన్ని తీసుకొచ్చామని సగర్వంగా తెలియజేస్తున్నాను.


*8.26 లక్షల మందికి నేటి నుంచి రిజిస్టర్డు డాక్యుమెంట్లు*

ఈ 52 లక్షల మందిలో ఇప్పటికే ఓటీఎస్‌(ఒన్‌ టైం సెటిల్‌మెంట్‌), జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ద్వారా లబ్ధి పొందిన 8.26 లక్షల మందికి నేటి నుంచి వారి రిజిస్టర్డు డాక్యుమెంట్లను అంటే వారికి ఉచితంగా వారి పేరుతోనే రిజిస్టర్‌ చేసి ఆ డాక్యుమెంట్లను ఈ రోజు నుంచి ఇవ్వనున్నాం. ఇదొక గొప్ప మార్పుకు చిహ్నం.


ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే... ఈ 52 లక్షల మంది చేతుల్లో పెట్టబోయే ఆస్తి ఇది. ఈ ఆస్తి అంతా వారి చేతుల్లోకి వస్తుంది, వాళ్లకు ఇష్టమొచ్చినట్లు దాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. 


*మీ దృష్టికి కొన్ని విషయాలు*

కొన్ని విషయాలు మీ అందరి దృష్టికి తీసుకురావాలి. మనమేదైనా ఇంటికి బాడుగ చెల్లిస్తే... ఆ ఇంట్లో ఉండే హక్కులు మాత్రమే మనకుంటాయి. అదే సొంత ఇళ్లైతే మార్కెట్‌ రేటుకు ఆ ఇంటికి మనకు ఎప్పుడు అవసరమొస్తే అప్పుడు అమ్ముకునే వీలు, ఆ ఇంటి మీద హక్కు మనకుంటుంది. ఈ రోజు ఇళ్ల పరిస్థితి ఎలాగుందంటే.. ఈ రోజు మనముంటున్న ఇళ్లలో అమ్ముకునే హక్కు మనకు లేదు. మన సంతానానికి ఆ ఇంటిని చట్టపరంగా రిజిస్టర్‌ చేసి ఒక పట్టా ఆధారంగా రాసి ఇచ్చే హక్కు కూడా మనకు లేదు. మనకు అవసరం ఏదైనా వచ్చినప్పుడు మనం నివాసం ఉంటున్న ఆ ఇంటిని, ఇంటి స్థలాన్ని బ్యాంకుల్లో తనఖా పెట్టుకుని కాస్తా కూస్తో డబ్బులు తీసుకునే అవకాశం కూడా ఏ ఒక్కరికీ లేదు. ఈ రోజు ఇటువంటి పరిస్థితుల్లో ఏహక్కూ లేని గత కాలం నుంచి.. ప్రభుత్వాలు కట్టించి ఇచ్చిన ఇళ్ల స్థలాలలో, ఇళ్లలో మనమంతా ఉంటున్నాం.


*ఈ ఇళ్ల పరిస్థితిని పూర్తిగా మార్చబోతున్నాం*

 ఈ ఇళ్లకు సంబంధించి ఇటువంటి పరిస్థితిని పూర్తిగా ఈ రోజు నుంచి మార్చబోతున్నాం. 

ఏ ఇంటి యజమాని అయినా కూడా తన అవసరాల కోసం తను ఉంటున్న ఇంటిని తనఖా పెడతామంటే లోను ఇవ్వడానికి ఏ బ్యాంకు కూడా ఒప్పుకోని పరిస్థితిని మార్చడానికి శ్రీకారం చుడుతున్నాం. ఎవరికైనా ఇంటిమీద హక్కు ఉంటే మార్కెట్‌ రేటు ఒక మాదిరిగా ఉంటుంది. ఇంటి మీద హక్కు లేకపోతే మార్కెట్‌లో రూ.10 లక్షలు పలికే ఇంటి విలువ.. రూ.లక్షకు, రెండు లక్షలకు కూడా కొనుక్కునేవాడు ఉండడు. ఇటువంటి పరిస్థితిని కూడా మార్చుతూ పూర్తి హక్కులతో ఆ అక్కచెల్లెమ్మలు, ఆ ఇంటి యజమాని అమ్మకునే స్వేచ్చను ఈ రోజు నుంచి ఇస్తున్నాం.


*రిజిస్ట్రేషన్ చేసిన- చేయని ఇళ్ల విలువలో తేడా* 

ఉదాహరణకు ఇదే గోదావరి జిల్లాలలో రిజిస్ట్రేషన్‌ చేసిన ఇంటికి, రిజిస్ట్రేషన్‌ చేయని ఇంటికి తేడా ఎంత ఉందో గమనించండి. ఇదే తణుకులో కాసేపటి కిందట కలెక్టర్‌ గారిని అడిగినప్పుడు..  19వ వార్డులో మార్కెట్‌లో ఇంటి విలువ అక్షరాలా రూ.30 లక్షలు, సెంటు రూ.15 లక్షలు పలుకుతుంది. 

12వ వార్డులో మార్కెట్‌లో ఇంటి విలువ రూ.12 లక్షలు, అంటే సెంటు రూ.6 లక్షలు. 7వ వార్డులో సెంటు విలువ రూ.15 లక్షలు, మార్కెట్‌లో ఇంటి విలువ రూ.30 లక్షలు. 

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మార్కెట్‌ విలువలు ఇదే మాదిరిగా ఉంటాయి. రాష్ట్రమంతటా చూసినా కూడా ఇంటి విలువ రూ.4–5 లక్షల నుంచి రూ.20–30 లక్షల వరకు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత డబ్బును, సొంత ఇంటిమీద పూర్తి హక్కులు లేని ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ రోజు నష్టపోతుంది. ఎందుకంటే వాళ్లు ఇంట్లో ఉన్నా.. దాన్ని అమ్ముకునే అవకాశం లేదు. తాకట్టు పెట్టుకునే స్వేచ్చ లేదు. పిల్లలకెవరికైనా బహుమతిగా ఇవ్వాలంటే ఇచ్చే స్వేచ్చ కూడా లేని పరిస్థితి.


*ఈ సమస్యలకు పరిష్కారమే- గృహహక్కు పథకం...*

ఈ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం ఏమిటని.. నా పాదయాత్రలో నన్ను అడిగిన ప్రతి అక్కకూ, చెల్లెమ్మకు ఏం చేస్తే బాగుంటుందని సమాధానం వెతికిన పిమ్మట మంచి చేసే ఆలోచనలో భాగంగా ఈ రోజు జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం పుట్టుకొచ్చింది.


*పూర్తి స్ధాయి యజమానులుగా...*

ఈ రోజు ఈ పథకం ద్వారా స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ప్రభుత్వం ఇచ్చిన, కట్టించిన ఇళ్లల్లో కేవలం నివసించే హక్కు మాత్రమే ఉన్న లబ్ధిదారులను ఈరోజు నుంచి ఆ ఇళ్లకి పూర్తిస్ధాయి యజమానులుగా మార్చబోతున్నాం. అంటే ఇంటి మీద సర్వహక్కులను కూడా రిజిస్టర్‌ చేసి ఇవ్వబోతున్నాం. సర్వహక్కులు  లభించడం వల్ల ఇంటిని మార్కెట్‌ రేటుకు చట్టబద్దంగా రిజిస్టర్‌ ఇళ్లుగా అమ్ముకునేందుకు వీలుంటుంది. బహుమతిగా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే అది కూడా చేయవచ్చు. కుటుంబ ఆర్ధిక అవసరాల కోసం బ్యాంకులకు వెళ్లి తాకట్టు పెట్టుకోవాలనుకుంటే అలా తాకట్టు పెట్టుకునే వెసులుబాటు కూడా ఈ సర్వహక్కులు ఇవ్వడం వల్ల సాధ్యమవుతుంది. 


మరో ముఖ్యమైన విషయమేమిటంటే... మనం ఉంటున్న ఇళ్లు కబ్జాలకు గురికాకుండా అడ్డుకట్టు కూడా పడుతుంది.


*రూ.10 తోనే పూర్తి రిజిస్ట్రేషన్‌*

 ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో తమ సొంత డబ్బుతో వారే ఇళ్లు నిర్మించుకుని కేవలం నివాస హక్కులు మాత్రమే అనుభవిస్తున్న దాదాపు 12 లక్షల కుటుంబాలకు ఈస్కీం వలన కేవలం రూ.10 చెల్లిస్తే  వాళ్లకు పూర్తిగా రిజిస్ట్రేషన్‌ చేయించి, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పూర్తిగా మాఫీ చేసి, కేవలం పదిరూపాయిలతోనూ ఆ ఇంటి మీద సర్వహక్కులను రిజిస్ట్రేషన్‌ చేయించి, డాక్యుమెంటు వాళ్ల చేతుల్లో పెడుతున్నాం.


 రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 52 లక్షల గృహ నిర్మాణ లబ్ధిదారుల్లో 2011 ఆగష్టు 15 వరకు గృహనిర్మాణ సంస్ధ వద్ద స్ధలాలను తనఖా పెట్టి ఇళ్ల నిర్మాణాలు కోసం రుణాలను తీసుకున్న మిగతా 40 లక్షల మంది లబ్ధిదారులకు అసలు, వడ్డీ రెండూ కలిపి దాదాపు రూ.14,400 కోట్లు బకాయిలుగా ఉంటే, అందులో ఏకంగా రూ.10 వేల కోట్లు మాఫీ చేసి ఇస్తున్నాం. ఈ అసలు వడ్డీ కలిపి రూ.10 వేల కోట్లు మాఫీ చేయడమే కాకుండా వీళ్లకి దాదాపుగా రూ.6వేల కోట్లు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు కూడా మాఫీ చేస్తున్నాం.  అంటే వీళ్లందరూ వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి వస్తే.. 7.5 శాతం రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, స్టాంపు డ్యూటీలు కట్టాలి. అంటే ప్రతి ఇంటిలో కూడా ఈ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటే కూడా, కనీసం ఇంటి విలువ రూ.15 లక్షలు అని లెక్కవేసుకుంటే... రిజిస్ట్రేషన్‌ ఛార్జీలే కనీసం రూ.1లక్ష కట్టాల్సి వస్తుంది. అది కూడా పూర్తిగా మాఫీ చేస్తూ ఉచితంగా మరో రూ.6 వేల కోట్లు లబ్ధి చేకూరేలా ఈరోజు ఈ 52 లక్షల కుటుంబాలకు మేలు చేస్తున్నాం. అక్షరాలా రూ.16 వేల కోట్లు మాఫీ చేస్తూ వీళ్లందరికీ లబ్ధి చేకూరుస్తున్నాం. 


హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా ఇంతవరకు రుణాలు తీసుకుని, వడ్డీ, అసలు పేరుకుపోయి కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న వీరందరికీ కూడా గ్రామాల్లో అయితే కేవలం రూ.10 వేలు, మున్సిపాల్టీలలో అయితే రూ.15వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేలు చెల్లిస్తే వీళ్లందరికీ సర్వహక్కులతో రిజిస్ట్రేషన్‌ ఉచితంగా చేయించి వాళ్ల ఆస్తులను వాళ్ల చేతుల్లో పెడుతున్నాం.

 

వాళ్ల తీసుకున్న రుణం ముందే కొద్దో, గొప్పో కట్టి ఉండే, వాళ్లు తీసుకున్న అవుట్‌ స్టాండింగ్‌ లోన్‌ ఇంత కన్నా తక్కువగా ఉంటే.. అంటే వాళ్లు చెల్లించాల్సిన అసలు, వడ్డీ ఇంతకన్నా తక్కువగా ఉంటే వారు ఆ తక్కువ మొత్తాన్ని చెల్లిస్తే చాలు వారికి కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయించి వాళ్ల చేతుల్లో కూడా ఇళ్ల పట్టాలు పెడతాం. 


తద్వారా వారి ఆస్తుల విలువ మార్కెట్‌ విలువకు సమానంగా పెరిగే వాతావరణ కలుగుతుంది. దీనివల్ల జరిగే గొప్ప మేలు ఏమిటంటే...   భవిష్యత్తులో శెనక్కాయలకు, బెల్లాలకు అమ్ముకోవాల్సిన పనిలేదు. మార్కెట్‌లో రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్లు ఉన్న ఇళ్లకు ఎంతైతే రేటు ఉంటుందో... అదే రేటుకే వీళ్లు అమ్ముకునే స్వేచ్ఛ దొరుకుతుంది. 


*గతంలో డీ-ఫామ్ మాత్రమే ఇచ్చారు.*

గతంలో గృహనిర్మాణ సంస్ధలకు అప్పులున్న చోట లబ్ధిదారులు అసలు, వడ్డీ కలిపి కొన్ని సందర్భాలలో చెల్లించారు కూడా. ఆ  అప్పులకు సంబంధించి ఆ ఇంటి స్ధలం, ఇంటిని సొంతం చేసుకోవాలన్న ఆరాటంతో అసలు  వడ్డీ, కలిపి కట్టిన కొంతమందికి కేవలం డీ–ఫామ్‌ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు అలా కాకుండా రిజిస్టర్‌ డాక్యుమెంట్లు కూడా చేయించి వాళ్ల చేతుల్లో పెడుతున్నాం.


గత ప్రభుత్వ హయాంలో దాదాపు 41 వేల మంది ఇదే కార్యక్రమం చేశారు. æఇంటి స్ధలం తీసుకోవాలి, ఇళ్లు వాళ్ల చేతుల్లో పెట్టుకోవాలి, అప్పులేమైనా ఉంటే వదిలించుకోవాలన్న ఆరాటంతో ఈ 41 వేల మంది అసలు, వడ్డీ కడితే వాళ్లకు కేవలం డీ-ఫామ్ మాత్రమే దక్కింది. అటువంటి వారందరికీ కూడా ఈ రోజు రిజిస్ట్రేషన్‌ చేసి డాక్యుమెంట్లు ఇస్తున్నాం.


*22-ఏ జాబితా నుంచి తొలగిస్తున్నాం.*

లబ్ధిదారుడి స్థిరాస్తి గతంలో నిషేధిత భూముల జాబితా అంటే 22–ఏ లో ఉండేది. ఇప్పుడు వీళ్ల ఆస్తిని రిజిస్ట్రేషన్‌ చేయించడమే కాకుండా నిషేధిత జాబితా నుంచి పూర్తిగా తొలగిస్తున్నాం.

ఈ రోజు లబ్దిదారుడికి చెందిన స్ధిరాస్తిని సబ్‌రిజిస్ట్రర్‌ కార్యాలయానికి వెళ్లి గంటల తరబడి, రోజుల తరబడి నిరీక్షించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంటిని మీ గ్రామం, మీ వార్డు సచివాలయంలోనే ఈ నామమాత్రపు రుసుమును కడితే చాలు కేవలం 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.


*వివాద రహిత ఆస్తిగా ఇస్తున్నాం*

 ఒటీఎస్‌ ద్వారా లబ్ది పొందిన ఇంటి మీద పూర్తిగా క్రయవిక్రయాలు జరపడానికి వీళ్లకి ఏ విధమైన లింక్‌ డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు. అంటే దీనర్ధం మార్కెట్‌లో ఇంతకముందు వివాదాల ఆస్తి అనుకున్న మీ ఇంటిని అత్యంత వివాద రహిత ఆస్తిగా, క్లియర్‌ టైటిల్‌గా మార్చి రిజిస్ట్రేషన్‌ చేయించి మీకు ఇస్తున్నాం.


*జీర్ణించుకోలేని శక్తులున్నాయి*

కేవలం నివాసహక్కు మాత్రమే అనుభవిస్తున్న పేదలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా... మంచి చేయడానికి ఆరాటపడుతున్న మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం మంచి చేస్తుంటే జీర్ణించుకోలేని శక్తులు చాలా ఉన్నాయి. ఆ జీర్ణించుకోలేని శక్తులు చంద్రబాబునాయుడుగారు కావచ్చు, ఈనాడు రామోజీరావు గారు కావచ్చు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 కావచ్చు. పేదవాడికి ఎక్కడైనా మంచి జరిగితే వీళ్లందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితులలో ఉన్నారు. 


*మీకెందుకు కడుపు మంటని వాళ్లనే నేరుగా ప్రశ్నించండి ?*

వీళ్లందరూ ఒకవేళ మీ దగ్గరకు వస్తే.. మీరు వాళ్లను కొన్ని ప్రశ్నలడగమని చెప్పి మిమ్మల్నందరినీ కోరుతున్నాను. 

మీకున్నవి(రామోజీరావుగారికి, చంద్రబాబునాయుడు గారికి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి), మీరు కొన్నవి రేట్లు పెరిగే రిజిస్టర్డు భూములు అయినప్పుడు, మాకూ అలాగే రేట్లు పెరిగే, నామ మాత్రపు ధరకు ఉచితంగా రిజిష్టర్‌ చేసి, రిజిష్టర్డు ఇళ్లు ఇస్తాను అని మా అన్న చెపుతాఉంటే.. .మీకు ఎందుకు కడుపుమంటే ? అని అడగండి. 


వాళ్లు వచ్చినప్పుడు వాళ్లను గట్టిగా అడగండి.. అయ్యా మా ఇళ్లను ఓటీఎస్‌ లేకుండా మార్కెట్‌ రేటుకు మీరు కొంటారా ? అని అడగండి.  

ఎటువంటి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు లేకుండా మా ఇంటిని మార్కెట్‌ రేటుకు మీరు కొంటారా ? అని చెప్పి గట్టిగా నిలదీయండి. 

వాళ్లు వచ్చినప్పుడు వాళ్లను గట్టిగా అడగండి.. అయ్యా మీ వారసులకేమో మీ ఆస్తులు రిజిస్టర్‌ చేసి ఇస్తారు కదా ? మరి వా వారసులకు మా ఇళ్లు చట్టబద్దంగా రిజిస్టర్‌ చేసే అవకాశాన్ని మా జగనన్న మాకు ఇస్తుంటే మీకెందుకయ్యా కడుపుమంట ? అని గట్టిగా అడగండి. 


*చంద్రబాబు టైంలో అధికార్లు చెప్పినా వినలేదు*

ఆశ్చర్యమేమిటి అంటే 2014 నుంచి 2019 వరకు ఇదే పెద్దమనిషి చంద్రబాబు పరిపాలన... ఈ మధ్య కాలంలో ఐదుసార్లు అధికార్లు ప్రభుత్వం కట్టించిన ఇళ్ల మీద కనీసం వడ్డీ మాఫీ చేయాలి అని చెప్పి ప్రతిపాదనలు పంపిస్తే.. ఏదో ఒక నెపంతో మంజూరు చేయకుండా తిప్పి పంపారు. రుణమాఫీ కథ దేవుడెరుగు కనీసం వడ్డీ మాఫీ కూడా చేయని ఈ పెద్ద మనుషులు ఈ రోజు మాట్లాడుతున్నారు.

 

ఇదే పెద్దమనుషులు హయాంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో 43 వేల మంది లబ్ధిదారులు వాళ్ల ఆస్తిని వాళ్లు తీసుకోవాలి, అప్పులు ఏమైనా ఉంటే  ఏ రోౖజైనా అది మనకు చెందని ఆస్తి కదాని చెప్పి, అసలు, వడ్డీ కలిపి రూ.15 కోట్ల 29 లక్షలు చెల్లిస్తే... గత ప్రభుత్వం ఆ చెల్లించిన 43వేల మందికి ఎలాంటి యాజమాన్య హక్కులు ఇచ్చారు ? అని గట్టిగా నిలదీసి అడగండి. డబ్బులు కట్టించుకున్నాక కూడా వాళ్లకు ఎలాంటి యాజమాన్య హక్కులు ఇవ్వని ఇలాంటి పెద్దమనుషులంతా కూడా ఈ రోజు మాట్లాడుతున్నారు. 


*పేదవాడి మేలు జీర్ణించుకోలేక*

పేదవాడికి మంచి జరుగుతుంటే ఎంత జీర్ణించుకోలేని కడుపుమంట వీళ్లకుందీ అని అర్ధం చేసుకొమ్మని మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకొక విషయం కూడా మీతో చెప్పాలి. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం అని చెప్పి ఏకంగా నా పేరుతోనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ఓటీఎస్‌ ద్వారా వీళ్లందరికీ నామమాత్రపు ధరలతో ఏకంగా రూ16 వేల కోట్లు మేలు చేసే కార్యక్రమం చేస్తుంటే... వీళ్లంతా ఇలా మాట్లాడుతున్నారు.


*లంచాలకు, వివక్షకు తావులేకుండా...*

 ఈ 30 నెలల కాలంలోనే మీ జగనన్న ప్రభుత్వం నేరుగా బటన్‌ నొక్కి ఎటువంటి మధ్యవర్తి, నాయకుడు మధ్యలో లేకుండానే, ఎటువంటి లంచాలకు, వివక్షకు తావులేకుండా కేవలం డీబీటీ ద్వారా మాత్రమే రూ.1 లక్షా 16 వేల కోట్లు బదిలీ చేశాం. నేరుగా డీబీటీ ద్వారా బటన్‌ నొక్కి ఒక్క రూపాయి కూడా లంచాలకు తావులేకుండా, మంచి చేసిన మీ జగనన్న మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని అనుకుంటాడా అని ఒక్కసారి ఈ పెద్దమనుషులకు అర్ధమయ్యే విధంగా చెప్పమని మిమ్మల్ని కోరుతున్నాను. 


*మంచి పథకమిది*

దేవుడి దయతో ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చాం. ఒక మంచి పథకం గురించి ఎవరూ కూడా మిస్‌ కాకూడదని చెప్పి ప్రతి వాలెంటీర్‌ను కూడా రిక్వెస్ట్‌ చేస్తున్నాను. ప్రతి ఇంటికి వెళ్లి ఈపథకం గురించి అర్ధమయ్యేటట్టు చెప్పండి. కారణమేమిటంటే ఈ పథకం ద్వారా మంచి జరగాలి. ఈ 52 లక్షల మందికి రూ.1 లక్షా 58 వేల విలువ చేసే ఈ ఆస్తిని వాళ్ల చేతుల్లో పెట్టడానికి వీలు రావాలి, కావాలి అనే ఉద్దేశ్యంతో మంచి పథకానికి శ్రీకారం చుడుతున్నాం.

ఇదే పేదల పాలిట శత్రువులు అందరినీ గట్టిగా అడగండి. అయ్యా ? పేదలంటే మీకు ఎందుకు అంత కడుపుమంట ? మీ పిల్లలేమో ఇంగ్లిషు భాషలో ఇంగ్లిషు మీడియం బడులలో చదవచ్చు. మా పిల్లలేమో తెలుగుమీడియం బడులలో మాత్రమే చదవాలని మీరు ఆరాటపడటం కరెక్టేనా అని గట్టిగా అడగండి. ఇదే పేదలంటే వ్యతిరేకంగా ఉన్న ఇలాంటి పెద్దమనుషులందరినీ కూడా అడగండి. 


*కోర్టులకెళ్లి అడ్డుకోవడం..*

మా జగనన్న 31 లక్షల ఇళ్ల పట్టాలు పేదవాళ్లకు మంచి చేయాడానికి ఇస్తే.. మీరు కోర్టులకు వెళ్లి మాకు ఎక్కడ ఇళ్లు పట్టాలు వస్తాయో ? మాకు ఎక్కడ మంచి జరుగుతుందోనని అడ్డుకోవడం, ధర్మమేనా ? అని చెప్పి ఇదే పెద్దమనుషలును గట్టిగా నిలదీసి అడగండి. ఇదే పెద్దమనుషులు రాజధాని అమరావతి అని చెప్పుకుంటున్నారు. 


*డెమొగ్రాఫిక్‌ ఇంబేలన్స్ అంట*

ఇదే రాజధానిలో పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తే.. ఏకంగా ఇదే పెద్దమనుషులు కోర్టులకు వెళ్లి వేసిన పిటీషన్ ఏమిటో తెలుసా? రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే..డెమొగ్రాఫిక్‌ ఇంబేలన్స్‌ వస్తుందట ? 

అంటే వాళ్ల మధ్యలో పేదవాడు వస్తే... ఉంటే సామాజికంగా సమతుల్యం పోతుందని ఏకంగా పిటిషన్లు వేసారంటే  పేదవాళ్ల మీద వీరికున్న ప్రేమ ఎంతనేది మీరు ఆలోచన చేయమని అడుగుతున్నాను.


*మీ అందరికీ విజ్ఞప్తి*

మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒక్కటే... ఇదే పథకాన్ని రేపు ఉగాది వరకు పొడిగిస్తున్నాం. ఎందుకంటే ఈ 52 లక్షల మందికి మంచి జరగాలి. స్వచ్ఛందంగా ఈ పథకాన్ని చేస్తున్నాం.  వీలైనంత ఎక్కువ మందికి మంచి జరగాలి అనే ఉద్దేశ్యంతో ఉగాది వరకు ఈ పథకాన్ని అంటే ఏఫ్రిల్‌ 2 వ తేదీ వరకు పొడిగిస్తూ ఉన్నాం. 


ఈ పథకం ద్వారా మంచి జరుగుతుంది, మంచి చేసుకొమ్మని చెప్పి మిమ్మల్ని  అందర్నీ విజ్ఞప్తి చేస్తూ... దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి కార్యక్రమాలు చేసే అవకాశం దేవుడి ఇవ్వాలని కోరుకుంటున్నాను. 


మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు. 


అనంతరం సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సంపూర్ణ గృహహక్కుపథకం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ పత్రాలను అందించారు. 



ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రులు ధర్మాన కృష్టదాస్, ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పేర్ని వెంకట్రామయ్య(నాని), తానేటి వనిత, శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు, పలువురు ఎమ్నెల్సీలు, ఎమ్మెల్యేలు, స్ధానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Comments