నెల్లూరు, డిసెంబర్ 4 (ప్రజా అమరావతి): జిల్లాలో వరద నష్టం నివారణ చర్యలను త్వరితగతిన పూర్తిచేయాలని
జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటుచేసిన అధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరద సమయంలో జిల్లా యంత్రాంగం మొత్తం సమష్టిగా పని చేసిందని, ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా అభినందించారని పేర్కొన్నారు. ఇదే ఒరవడి కొనసాగిస్తూ అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, తాగునీరు, విద్యుత్ ఇతర పనులకు సంబంధించి తాత్కాలికంగా చేపడుతున్న మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే శాశ్వత ప్రాతిపదికన అవసరమైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇసుక మేటలు వేసిన పొలాలను గుర్తించి ఉపాధి హామీ పనుల కింద పొలాలను యథాస్థితికి తెచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చే యోచనలో ఉన్నట్లు ప్రకటించారు. అన్ని మండలాల ప్రత్యేక అధికారులు పునరావాస కేంద్రాలు, రెస్క్యూ ఆపరేషన్లు, వరద సాయం పంపిణి, పునరుద్ధరణ పనులకు సంబంధించి బిల్లులను త్వరితగతిన అందజేయాలని ఆదేశించారు. ఈనెల 8,9,10 తేదీల్లో జిల్లాకు భారీ వర్ష సూచన హెచ్చరికల నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. జిల్లాలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని, ఈ పథకం అమలులో జిల్లాను ప్రత్యేక స్థానంలో నిలపాలని సూచించారు. ఇప్పటివరకు ఈ పథకం కింద సుమారు 6 కోట్ల రూపాయలు లబ్ధిదారులు చెల్లించారని చెప్పారు. అలాగే కోర్టు సమస్య పరిష్కారం అయినందున జగనన్న ఇళ్ల నిర్మాణ పనులను మొదలుపెట్టాలని సూచించారు. అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్ జిల్లాలో ఇప్పటివరకు 95 శాతం పూర్తయిందని, మిగిలిన ఐదు శాతాన్ని కూడా ఈ వారంలో పూర్తి చేసి నూరు శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిరప్రసాద్ మాట్లాడుతూ వరద ప్రభావిత గ్రామాల్లో వరద నష్టం, చేపట్టిన సహాయక కార్యక్రమాలు, పునరుద్ధరణ పనులు, ఎక్కడ నష్టం కలిగిందో తెలిపే చిత్రాలు తదితర అంశాల ఆధారంగా ప్రత్యేక డాక్యుమెంటరీని తయారు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు శ్రీ విధేహ్ ఖరే, శ్రీ గణేష్ కుమార్, నెల్లూరు నగర మునిసిపల్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) శ్రీమతి రోజ్ మాండ్, డి.ఎఫ్.ఓ శ్రీ షణ్ముఖ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన్న ఓబులేసు, డి ఎం హెచ్ ఓ శ్రీమతి రాజ్యలక్ష్మి, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ శ్రీ శ్రీనివాసరావు, డి.పి. ఓ శ్రీమతి ధనలక్ష్మి, డ్వామా, డిఆర్డిఎ, హౌసింగ్ పి.డిలు శ్రీ తిరుపతయ్య, శ్రీ సాంబశివారెడ్డి, శ్రీ వేణుగోపాల్, డి.ఈ.ఓ శ్రీ రమేష్ కుమార్, ఇరిగేషన్ ఎస్.ఇ శ్రీ కృష్ణమోహన్, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్.ఇ శ్రీ శ్రీనివాసరావు, పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీ సుబ్రహ్మణ్యం వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment