పర్యాటక రంగం అభివృద్ధి,విస్తరణకు మరింత కృషి:మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
అమరావతి,డిశంబరు 10 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి మరియు విస్తరణకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావు తెలిపారు.శుక్రవారం అమరావతి సచివాలయంలోని ఆయన చాంబరులో పర్యాటక, క్రీడా శాఖల అధికారులతో మంత్రి సమావేశమై ఆశాఖల వారీగా నిర్వహిస్తున్న పనుల ప్రగతిని సమీక్షించారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ కోవిడ్ వల్ల దెబ్బతిన్న పర్యాటక సంస్థ రెస్టారెంట్ల ఆదాయం ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోందని పర్యాటక సంస్థ హోటళ్ల ద్వారా ఈ ఏడాది ఇప్పటి వరకూ రూ.69.57 కోట్లు మేర ఆదాయం వచ్చిందని తెలిపారు.ఈ అదాయాన్ని మరింత మెరుగు పర్చేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించామన్నారు.డిశంబరు నుండి మార్చి మాసం వరకూ పర్యాటక రంగానికి మంచి సీజన్ అని, ఈ సీజన్ లో టూరిజమ్ రెస్టారెంట్లలో సేవలను మరింత మెరుగుపర్చాలని నాణ్యమైన ఆహారాన్ని అందించుట ద్వారా ఆయా రెస్టారెంట్లలో ఆక్యుపెన్సీని పెంచాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
పర్యాటక సంస్థకు సంబంధించి అరకు,విశాఖపట్నం,దిండి, సూర్యలంక, మైపాడు, కడప,గండికోట,శ్రీశైలం తదితర ప్రాంతాల్లో తొమ్మిది చోట్ల హరితా హోటళ్లు ఉన్నాయని వాటిని పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేయించి మరింత నాణ్యతను పెంచి ప్రైవేటు రిస్టారెంట్లకు దీటుకా వీటిని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు.కొత్తగా గండికోటలో రూ.4.50 కోట్లతో రోప్ వే పనులు,బొర్రా గుహల్లో రూ.2.70 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పనులు,మారేడుమిల్లిలో రూ.1.15 కోట్లుతో కాటేజీలు,మౌలిక వసతులు, అడ్వంచర్ స్పోర్ట్సు సౌకర్యాల కల్పన పనులను నిర్వహించడం జరుగుతోందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు.లంబసింగ్ కి వారాంతంలో సుమారు 20 వేల మంది పర్యాటకులు వస్తున్నారని వారి సౌకర్యార్థం తాత్కాలికంగా ఒక రెస్థారెంట్,టాయిలెట్స్ ను ఏర్పాటు చేస్తున్నామని ఆపనులు వారం రోజుల్లో పూర్తికానున్నాయన్నారు.శాశ్వత ప్రాతిపదికన సౌకర్యాల కల్పనకు చేపట్టిన కాటేజీ నిర్మాణ పనులు మధ్యలో అగిపోయాయని ఆపనులను రూ.3కోట్లతో వచ్చే రెండు మాసాల్లో పూర్తిచేయనున్నామన్నారు.
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జన్మస్థలం అయిన పాండ్రంగిలో మ్యూజియం హాల్ నిర్మాణానికి, కృష్ణదేవిపేటలో ఆయన సమాది అభివృద్దికి గతంలోనే నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు.అయితే ఆపనులు కొంత మందకొడిగా సాగుచున్న నేపథ్యంకలో రానున్న ఫిబ్రవరి నాటికే ఆ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు .
రాష్ట్రంలో పర్యాటక బోట్లన్నిటినీ పునరుద్దరించడం జరిగిందని అయితే సాంకేతిక కారణాల వల్ల నాగార్జునసాగర్ లో ఒక బోట్ ప్రారంభంకాలేదని వారం రోజుల్లో దాన్ని ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు.భద్రాచలం నుండి పాపికొండలకు వచ్చే పర్యాటకులకు వీలుగా పోచవరంలో వద్ద ఈ నెల 14న బోటింగ్ సౌకర్యాన్ని ప్రారంభించాలని, అలాగే పాపికొండలకు వచ్చే పర్యాటకులు రాత్రి బస చేసేందుకు వీలుగా వసతి సౌకర్యం కల్పించాలని ఆదేశించినట్టు తెలిపారు.అదే విధంగా పోలవరం నుండి పాపికొండలకు వచ్చే పర్యాటకులకు నూతన బోటింగ్ పాయింట్ ను ఈ నెల 20లోగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన్లటు మంత్రి తెలిపారు .
పర్యాటక సంస్థకు చెందిన 34 హోటళ్ల ఆపరేషన్ అండ్ మెయింటినెన్సును ఏజన్సీలకు అప్పగించాలని టెండర్లను పిలువగా 18 రెస్టారెంట్లకు టెండర్లు వచ్చాయని,15 రెస్టార్లెంటకు అసలు స్పందనే రాలేదని,ఒక దానిని ఉప సంహరించుకున్నామని మంత్రి తెలిపారు.ఈ 15 రెస్టారెంట్లకు మళ్లీ టెండర్లను పిలుస్తామని, ఆసక్తిగల ఔత్సాహికులు ముందుకు వచ్చి వెంటనే టెండర్లను దాఖలు చేయాలని మంత్రి విజ్ఞప్తిచేశారు.
కడప డివిజన్లోని అడపూర్,కర్నూలు డివిజన్లోని మడకసిర,నెల్లూరు డివిజన్లోని ఇసకపల్లి,కసుమూరు,గొలగముడి,కొత్తకోడూరు, ప్రకాశం జిల్లాలోని చందవరం, విజయవాడ డివిజ్లోని అమరావతి,కోటప్పకొండ,ముక్త్యాల,విశాఖపట్నం డివిజన్లోని అరకు యాత్రీనివాస్ ప్రాంగణంలోని ఐదు రెస్టారెంట్లకు ఎవరూ టెండర్లను దాఖలు చేయలేదని మంత్రి వివరించారు. అయితే వీటిని కూడా జనవరి నాటికి పూర్తి స్థాయిలో ఆపరేషన్ లోకి తీసుకువచ్చి పర్యాటక శాఖ ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వారి ఆదేశాల ప్రకారం పర్యాటక రంగాన్నిమరింత ముందుకు తీసుకువెళతామని మంత్రి తెలిపారు .
రాష్ట్రంలో ఉత్తమ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవడం జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు.గ్రామీణ,మండల,నియోజకవర్గ,జిల్లా స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహించి ప్రతిభకల ఉత్తమ క్రీడాకారులను గుర్తించాలనే లక్ష్యంతో సి.ఎం.కప్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఇప్పటికే శ్రీకాకుళం,విశాఖపట్నం జిల్లాల్లో ఈ టోర్నమెంట్స్ ను నిర్వహించడం జరిగిందని ఈనెల 11,12 తేదీల్లో విజయనగరం నిర్వహిస్తామన్నారు.ఈవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వచ్చే ఏడాది మార్చిలోపు ఈ టోర్నమెంట్స్ నిర్వహిస్తామని తెలిపారు.అలాగే మార్చిలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్స్ ను నిర్వహించి ప్రతిభగల క్రీడాకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారాలను అందజేయడం జరుగుతుందన్నారు.
జాతీయ స్థాయిలో బంగారు పతకాన్నిసాధించిన వారికి రూ.5.లక్షలు,వెండిపతకం విజేతకు 3లక్షలు,కాంస్య పతక విజేతకు 2లక్షలు నగదు పురస్కారాన్ని అందజేయడం జరుగుతుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.ఇప్పటి వరకూ సుమారు రూ.7.00 కోట్ల మేర నగదు పురస్కారాలను అందజేయడం జరిగిందన్నారు.మన రాష్ట్రం నుండి ఒలింపిక్స్ లో పాల్గొన్నబ్యాట్మింటెన్ క్రీడాకారులు పి.వి.సింధు, సాత్విక్ సాయిరాజ్ మరియు హాకీ క్రీడాకారిణి రజినిలకు కూడా నగదు పురస్కారాలను అందజేయడం జరిగిందని మంత్రి తెలిపారు.పి.వి.సింధుకు విశాఖపట్నంలో ఇప్పటికే స్థలం కూడా ఇవ్వడం జరిగిందన్నారు.
ఈసమావేశంలో శాఫ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి,సాంస్కృతిక శాఖ సీఈఓ మల్లిఖార్జునతో పాటు పర్యాటక,క్రీడా శాఖల అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment