ఏపీ నుంచి గణనీయంగా పెరిగిన ఎగుమతులు

 

*ఏపీ నుంచి గణనీయంగా పెరిగిన ఎగుమతులు*

రాజ్యసభలో శ్రీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, డిసెంబర్ 3 (ప్రజా అమరావతి): ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్‌ గణనీయమైన పురోగతి సాధించినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్‌ రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2016-17లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 11,939 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరగ్గా 2020-21 నాటికి ఎగుమతుల విలువ 16,842 కోట్లకు పెరిగినట్లు వెల్లడించారు. ఎగుమతుల్లో ఆక్వా ఉత్పత్తులు, డ్రగ్స్, ఫార్మా, కెమికల్స్ ఉత్పాదనలు, పండ్లు, కూరగాయలు ప్రధాన భూమిక పోషించినట్లు ఆమె తెలిపారు. దేశం మొత్తం మీద ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌దే అతి పెద్ద వాటా అని చెప్పారు.

ఉత్తర ఆసియా, ఆగ్నేయాసియా దేశాలకు సైతం ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆక్వా ఎగుమతులను రెట్టింపు చేయడానికి తమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. చైనా, విజయత్నాం, ఫిలిప్పీన్స్‌, థాయిలాండ్‌, దక్షిణ కొరియా దేశాలకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆక్వా ఉత్పాదనల ఎగుమతులను మరింతగా పెంచేందుకు ఎంపెడా, వాణిజ్య విభాగం ఆయా దేశాల్లోని భారత దౌత్య కార్యాలయాల ద్వారా ఆయా దేశాల మార్కెట్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే చర్యలు చేపట్టింది. వర్చువల్‌ విధానంలో విక్రేతలు, కొనుగోలుదార్లతో సమావేశాలు నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. కోల్డ్‌ స్టోరేజ్‌లో నిలువ చేసిన చేపలు, రొయ్యలతోపాటు ఎండబెట్టిన చేపలను కూడా ఎగుమతి చేయడానికి అవసరమైన అత్యాధునిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. రోగరహతింగా, సురక్షిత ఆక్వా సాగు చేసే విధంగా రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. చేప, రొయ్య పిల్లల పెంపకానికి రైతులకు ఆర్థిక సహాయం కూడా అందింస్తున్నట్లు తెలిపారు. రైతు సొసైటీల ద్వారా ఎగుమతులకు గిరాకీ ఉన్న ఆక్వా ఉత్పాదనల మార్కెటింగ్‌ కోసం ఈ-సంత పేరిట ఈ కామర్స్‌ పోర్టల్‌ను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ-సంత ద్వారా దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులే ఎగుమతిదార్లకు తమ ఆక్వా ఉత్పాదనలను విక్రయించుకునే సదుపాయం కలిగిందని తెలిపారు.


*బీఎస్‌ఎన్‌ఎల్‌ను ప్రైవేటీకరించే ప్రతిపాదన లేదు....*

భారత్‌ సంచార్‌ నిగమ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)ను ప్రైవేటీకరించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి శ్రీ దేవుసింహ్‌ చౌహాన్‌ రాజ్యసభకు తెలిపారు. శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌), మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎంటీఎన్‌ఎల్‌)ను పునరుద్ధరించే ప్రణాళికకు ప్రభుత్వం 2019 అక్టోబర్‌ 23న ఆమోదం తెలిపింది. ఈ ప్రణాళికలో భాగంగా 50 ఏళ్ళ పైబడిన ఉద్యోగలకు వీఆర్‌ఎస్‌ ప్రకటించి ఉద్యోగులపై ఖర్చును తగ్గించుకోవడంతోపాటు బడ్జెటరీ కేటాయింపుల ద్వారా 4జీ సేవలు అందించడానికి అవసరమైన స్పెక్ట్రమ్‌ సమకూర్చుకోవడం, అప్రధానమైన ఆస్తుల విక్రయం ద్వారా నిధులు సేకరించి రుణభారం తగ్గించుకోవడం ఈ ప్రణాళికలో భాగమని మంత్రి తెలిపారు.

*ఏపీలో మొబైల్‌ కనెక్టివిటీ లేని గ్రామాలు 1787*

టెలికామ్‌ సర్వీసు ప్రొవైడర్లు ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్‌లో మొబైల్‌ కనెక్టివిటీ లేని గ్రామాల సంఖ్య 1787గా ఉన్నట్లు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి శ్రీ దేవుసింహ్‌ చౌహాన్‌ తెలిపారు. మొబైల్‌ కనెక్టివిటీ లేని ఈ మొత్తం గ్రామాల్లో 1126 గ్రామాలు విశాఖపట్నం జిల్లాలోనే ఉన్నట్లు తెలిపారు. యూనివర్శల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (యూఎస్‌ఓఎఫ్‌) కింద విశాఖపట్నం జిల్లాలోని 1054 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీ కల్పించే పనులు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. మొబైల్‌ సేవలు కల్పించే ప్రాజెక్ట్‌పై కంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న 18 నెలల్లో ఆయా గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీ ఏర్పడుతుందని తెలిపారు.

Comments