గుడివాడలో మున్సిపల్ స్థలాన్ని వెలమ సంక్షేమ సంఘానికి కేటాయించేందుకు చర్యలు
 


- గుడివాడలో మున్సిపల్ స్థలాన్ని వెలమ సంక్షేమ సంఘానికి కేటాయించేందుకు చర్యలు 


- రూ.1.20 కోట్లతో నిర్మించుకోవడం అభినందనీయం 

- వెలమ సంఘీయులు ఇతరులకు ఆదర్శంగా నిలవాలి 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, డిసెంబర్ 30 (ప్రజా అమరావతి): గుడివాడ బైపాస్ రోడ్డులోని మున్సిపల్ స్థలాన్ని వెలమ సంక్షేమ సంఘానికి కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం శ్రీరాంపురంలోని గౌతమబుద్ధ హాస్టల్ స్థలంలో నూతనంగా నిర్మించిన గుడివాడ వెలమ సంక్షేమ సంఘ భవన ప్రారంభోత్సవ సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడారు. గుడివాడ పట్టణంలో వెలమ సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి 2 వేల గజాల స్థలాన్ని ఇప్పిస్తానని సంఘీయులకు హామీ ఇచ్చానని తెలిపారు. శ్రీరాంపురంలోని గౌతమబుద్ధ హాస్టల్ ను వందేళ్ళ కిందట తమ పూర్వీకులు స్థాపించి రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన సంఘీయులకు విద్యా, వసతి సౌకర్యాలను కల్పించారని, ఎంతో మంది ఉన్నతికి కృషి చేశారని గుడివాడ వెలమ సంక్షేమ సంఘ నాయకులు చెప్పారన్నారు. గౌతమబుద్ధ హాస్టల్ స్థలంలోనే వెలమ సంక్షేమ సంఘ భవనాన్ని నిర్మించాలని సంఘీయులంతా భావించారన్నారు. ఏడాది సమయంలో రూ.1.20 కోట్ల వ్యయంతో నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేశారన్నారు. గుడివాడ ప్రాంతంలో అనేక కులాలు ఉన్నాయని, వెలమ సంఘీయులకు అన్ని హంగులతో సంఘ భవనాన్ని అందుబాటులోకి రావడం అభినందనీయమని చెప్పారు. వెలమ సంఘీయులకు క్రమశిక్షణ, ఏదైనా సాధించాలన్న పట్టుదల, పెద్దల పట్ల గౌరవం ఉంటాయన్నారు. పూర్వం నుండి ప్రతి కులానికీ కొన్ని ప్రత్యేకతలు ఉంటూ వస్తున్నాయని, మన పూర్వీకులు ముందు చూపుతో ఎన్నో ఆలోచనలు చేశారన్నారు. వాటిని అనుసరిస్తూ, తమ పూర్వీకులు తిరిగిన గౌతమబుద్ధ హాస్టల్ స్థలాన్ని కళ్యాణ మండప నిర్మాణానికి ఎంపిక చేసుకోవడం గొప్ప విషయమన్నారు. ఒక్క ఏడాదిలోనే రూ. కోటి 20 లక్షల విరాళాలను సేకరించడం సామాన్యమైన విషయం కాదన్నారు. ప్రస్తుతం ఈ వెలమ సంక్షేమ సంఘ భవనంలో చిన్నచిన్న శుభకార్యాలను నిర్వహించుకోవచ్చని చెప్పారు. పెద్ద పెద్ద ఫంక్షన్లను నిర్వహించుకునేందుకు ఇంకో భవనం అవసరం ఉంటుందన్నారు. వెలమ సంఘీయులు ఇతర కులాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. మిగతా కులాల సంఘీయులు కూడా ఇటువంటి భవనాలను నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. దీనివల్ల సంఘీయులకు కూడా ఎంత మేలు చేకూరుతుందని, ఏవైనా సమస్యలుంటే ఒక వేదికపైకి వచ్చి ఐక్యంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. భవన నిర్మాణానికి సహకరించిన దాతలను మంత్రి కొడాలి నాని అభినందించారు. ముందుగా మంత్రి కొడాలి నానికి గుడివాడ వెలమ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ గోర్జి సత్యనారాయణ పుష్పగుచ్ఛాన్ని అందజేసి శాలువాతో సత్కరించారు. డిప్యూటీ సీఎం ధర్మానతో కలిసి వెలమ సంక్షేమ సంఘ భవనాన్ని మంత్రి కొడాలి నాని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, నవరత్నాలు అమలు కమిటీ వైసైచైర్మన్ అంకమరెడ్డి నారాయణమూర్తి, మాజీ మంత్రి మరడాని రంగారావు, వెలమ కార్పోరేషన్ డైరెక్టర్లు జీ మాధవి, జీ శ్రీనివాసరావు, నవుడు వెంకటరమణ, గుడివాడ వెలమ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ గోర్జి సత్యనారాయణ, అధ్యక్షుడు గంటా ఆనంద్, ప్రధాన కార్యదర్శి గులిపల్లి ప్రభాకరరావు, విజయవాడ అధ్యక్షుడు మూకల అప్పారావు, జడ్పీటీసీ సభ్యుడు రొంగల అప్పాజీ, సంఘ నాయకులు మూడెడ్ల రామారావు, సంభంగి రంగారావు, చింతల భాస్కరరావు, సింగిరెడ్డి గగారిన్, నగిరెడ్డి మోహన్, సబ్బాని రంగారావు, మూడెడ్ల ఉమా, మూడెడ్ల శ్రీధర్, గంటా చంద్రశేఖర్, వంగపండు బ్రహ్మాజి, వీ బాబు, గులిపల్లి రవికుమార్, గేదెల రమేష్, సిరిపురపు కిరణ్ కుమార్, గంటా శ్రీనివాసరావు, దత్తి సింహాచలం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలడుగు రాంప్రసాద్, వల్లూరుపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.