అనుక్షణం అప్రమత్తంగా....
తుఫానును ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డిన యంత్రాంగం
రాత్రంతా విధులు నిర్వహించిన జిల్లా కలెక్టర్, జెసీలు
మండలాల్లోనే ఉండి పర్యవేక్షించిన స్పెషల్ ఆఫీసర్లు
విజయనగరం, డిసెంబరు 04 (ప్రజా అమరావతి) ః
జవాద్ తఫాను ముప్పు జిల్లాకు దాదాపు తప్పిపోయినట్లే. అయితే ఈ తుఫాను జిల్లాను రెండు రోజులపాటు హడలెత్తించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తుఫానును ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం మునుపెన్నడూ లేని విధంగా సర్వశక్తలూ కేంద్రీకరించింది. శనివారం తెల్లవారుఝామున తుఫాను తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణశాఖ సూచనల మేరకు, శుక్రవారం రాత్రంతా ఉన్నతాధికారులు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. మండల, మున్సిపల్ ప్రత్యేకాధికారులంతా శుక్రవారం పగలూ, రాత్రీ కూడా మండలాల్లోనే ఉండి, సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. గంట గంటకూ తమ ప్రాంతాల పరిస్థితిని కలెక్టర్‌కు నివేదించారు. దీంతో క్రిందిస్థాయి అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి విధులను నిర్వహించారు. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలనూ తీసుకున్నారు. నదులు, చెరువులు సమీపంలో పాకల్లో ఉన్నవారిని, లోతట్టు ప్రాంతంలో ఉన్నవారిని, మత్స్యకారులను రాత్రికి రాత్రే పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి అప్పటికప్పుడు భోజన, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో, గర్భిణీలను సుమారు 50 మందిని ముందే ఆసుపత్రులకు తరలించడం, అధికారులు ముందుచూపుకు అద్దం పడుతోంది. సచివాలయ ఉద్యోగుల నుంచి జిల్లా కలెక్టర్ వరకూ ప్రతీఒక్కరూ తుఫానును ఎదుర్కొనే విధుల్లో భాగస్వామ్యమయ్యారు.
ఐఏఎస్ అధికారులు సైతం శుక్రవారం రాత్రంతా కలెక్టరేట్లోనే ఉండి విధులను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్లు కూడా షిప్టుల పద్దతిలో కలెక్టరేట్ కంట్రోల్ రూములు ఉండి విధులు నిర్వహించడం, యంత్రాంగం చిత్తశుద్దికి అద్దం పడుతోంది. రాత్రి 2 గంటలు వరకూ జాయింట్ కలెక్టర్(అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్(హౌసింగ్) మయూర్ అశోక్ కంట్రోల్ రూమ్ నుంచి తుఫాను సహాయ చర్యలను పర్యవేక్షించారు. ఉదయం నుంచి ఏకధాటిగా జిల్లా వ్యాప్తంగా పర్యటించిన కలెక్టర్, అనంతరం కలెక్టరేట్ నుంచి అధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. రాత్రి 10 గంటలకు ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని, మళ్లీ రాత్రి 2 గంటలకు కలెక్టరేట్‌కు వచ్చి, కంట్రోల్ రూము నుంచి పరిస్థితిని సమీక్షించారు. మండల స్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, పరిస్థితిని తెలుసుకున్నారు. తెల్లవారి 4 గంటలు నుంచి జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్ కంట్రోల్ రూము బాధ్యతలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్లు నలుగురూ శుక్రవారమంతా జిల్లా వ్యాప్తంగా పర్యటించి, తుఫాను సన్నద్దతను సమీక్షించడమే కాకుండా, ప్రజలతో భేటీ అయి, వారిని అప్రమత్తం చేశారు. అనంతరం కలెక్టర్ తో కలిసి రాత్రంతా విధులను నిర్వహించడం విశేషం. చివరకు జవాద్ తుఫాను తన దిశను మార్చకొని, ఒడిషావైపు వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ మరో 24 గంటలు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో, అదే అప్రమత్తతతో విధులను కొనసాగిస్తున్నారు.
addComments
Post a Comment