విపత్కర పరిస్థితుల్లో జిల్లాలో ప్రజలకు ఏ సాయం కావాలన్నా రెడ్ క్రాస్ ముందుంటుంది

  

నెల్లూరు, డిసెంబర్ 30 (ప్రజా అమరావతి):  విపత్కర పరిస్థితుల్లో జిల్లాలో ప్రజలకు ఏ సాయం కావాలన్నా రెడ్ క్రాస్ ముందుంటుంద


ని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో రెడ్ క్రాస్ సంస్థ కృషి ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు రెడ్ క్రాస్ నిర్వాహకులను అభినందించారు. గురువారం నగరంలోని రెడ్ క్రాస్ కార్యాలయంలో ఇటీవల వరద ముంపునకు గురైన నెల్లూరు సమీపంలోని భగత్ సింగ్ కాలనీ, ఇందుకూరుపేట మండల పరిధిలోని గంగపట్నం వరద బాధితులకు 108 బియ్యం, నిత్యావసర సరుకుల కిట్లను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు ఏ సాయం కావాలన్నా రెడ్ క్రాస్ స్పందిస్తున్న తీరు అభినందనీయమన్నారు.  కరోనా విపత్కర పరిస్థితుల్లో జిల్లాలోని ప్రజలను ఆదుకునేందుకు రెడ్ క్రాస్ చేపట్టిన వివిధ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లో దేశంలోనే వేల సంఖ్యలో ప్లాస్మా సేకరించి రోగులకు అందించిన ఘనత నెల్లూరు రెడ్ క్రాస్ కెే దక్కిందన్నారు. కోవిడ్ బాధితుల మృతదేహాలను బంధువులు కూడా తీసుకెళ్లలేని  పరిస్థితుల్లో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బోడీగాడి తోట స్మశాన వాటికలో క్రిమిషన్  ఏర్పాటు చేసి వారి అంత్యక్రియలు నిర్వహించడం ఇప్పటికీ మర్చిపోలేని విషయమన్నారు. మృతదేహాలను కాల్చేందుకు ఇప్పటికీ కూడా ఈ క్రిమిషన్ యంత్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇటీవల సంభవించిన వరదల సమయంలో బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ సాయం తో పాటు రెడ్ క్రాస్ చేపట్టిన కార్యక్రమాలు బాధితులకు ఊరట కలిగించాయన్నారు. ఇటీవల నిర్వహించిన ఎన్నికల సమయంలో కూడా రెడ్ క్రాస్ వాలంటీర్లు వికలాంగులకు సాయం చేసి వారు ఓటు హక్కు వినియోగించుకునేలా తోడ్పాటును అందించారని కొనియాడారు. 

    

   రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్ పూర్తి సహాయ సహకారాలతో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆరు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి  భోజన వసతులు కల్పించినట్లు గుర్తు చేశారు. వలస కార్మికులకు అవసరమైన అన్ని సేవలు అందించామన్నారు. ప్రస్తుతం జిల్లాలో వరద బాధితులను ఆదుకునేందుకు దాతల సహాయంతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. వరదలకు బాగా నష్టపోయిన సాలు చింతల, స్టౌబీడీ కాలనీ, సర్వేపల్లి కాలువ గట్టు, వెంకటేశ్వరపురం, దేవరపాలెం, కోవూరు ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన కందిపప్పు, మినపప్పు, నూనె, చింతపండు, చక్కెర తదితర నిత్యావసర సరుకులు, బియ్యం, వంట సామాగ్రి, సబ్బులు, కొబ్బరి నూనె, శానిటైజర్ తో కూడిన హైజనిక్  కిట్లను సుమారు 365 కుటుంబాలకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అందించినట్లు చెప్పారు.  ఒక్కొక్క కిట్ విలువ సుమారు 1500 రూపాయలు ఉంటుందన్నారు. ఇప్పటివరకు సుమారు 500 కుటుంబాలకు ఈ నిత్యావసర సరుకుల కిట్లను అందజేసినట్లు వివరించారు. అలాగే విష జ్వరాలతో బాధపడుతున్న రోగులకు నెలకు సుమారు 2500 యూనిట్లు రక్తాన్ని అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరింత చేరువయ్యేలా సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. అనంతరం తలసేమియా వ్యాధి తో బాధపడుతూ చికిత్స పొందుతున్న చిన్నారులకు కలెక్టర్ స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో  రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ పి మస్తానయ్య, శ్రీ భయ్యా ప్రసాద్, శ్రీ గంధం ప్రసన్నాంజనేయులు, శ్రీ దాసరి రాజేంద్ర ప్రసాద్, శ్రీ యడవల్లి సురేష్,  శ్రీ సురేష్ జైన్ తదితర రెడ్ క్రాస్ సభ్యులు,  సిబ్బంది పాల్గొన్నారు.