*సీఎస్ఆర్ నిధులు సీఎం కేర్స్‌కు ఎందుకివ్వరు?*
రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీసిన శ్రీ విజయసాయి రెడ్డి
న్యూఢిల్లీ, డిసెంబర్ 3 (ప్రజా అమరావతి): కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కింద కంపెనీలు ఖర్చు చేయకుండా మిగిలిపోయిన నిధులను పీఎం కేర్స్‌కు జమ చేయాలని కంపెనీ చట్టం నిర్దేశిస్తోంది. ఆ నిధులను పీఎం కేర్స్‌కు మాత్రమే ఎందుకు జమ చేయాలి, సీఎం కేర్స్‌కు ఎందుకు జమ చేయకూడదని వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. కంపెనీల చట్టం సవరణను ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై శుక్రవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ కంపెనీల నికర లాభంలో రెండు శాతం సొమ్మును ఆయా కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వివిధ కార్యక్రమాలకు ఖర్చు చేయాలి. ఆర్థిక సంవత్సరం పూర్తయిన ఆరు నెలలోగా ఈ రెండు శాతం నిధులను ఏకారణం చేతైనా సీఎస్‌ఆర్ కార్యక్రామాలకు ఖర్చు చేయని పక్షంలో ఆ నిధులను పీఎం కేర్స్‌కు జమ చేయాలని కంపెనీల చట్టం నిర్దేశిస్తోంది. నా ప్రశ్న ఏంటంటే ఆ నిధులను పీఎం కేర్స్‌కు మాత్రమే ఎందుకు జమ చేయాలి, సీఎం కేర్స్‌కు ఎందుకు జమ చేయకూడదని శ్రీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకుని ఖర్చు చేయని సీఎస్‌ఆర్ నిధులను ఆయా కంపెనీలు సీఎం కేర్స్‌కు కూడా జమ చేసేలా కంపెనీల చట్టంలోని ప్రొవిజన్స్‌కు సవరణ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అలాగే సీఎస్‌ఆర్ నిధులను స్మారక చిహ్నాల పునరుద్దరణకు వినియోగించాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ సభ్యుడు శ్రీ జైరాం రమేష్ వ్యతిరేకించడాన్ని ఆయన తప్పుబట్టారు. జాతీయ స్మారక చిహ్నాలనేవి మన జాతి సంపద అని అన్నారు. అవి దేవాలయాలు కావచ్చు, చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు. కుల, మతాలకు అతీతంగా జాతీయ స్మారక చిహ్నాల పరిరక్షణ చేపట్టడం మన కర్తవ్యం. రేపో మాపో ఈ పార్లమెంట్ భవనం కూడా మన ప్రజాస్వామ్య వ్యవస్థకు స్మారక చిహ్నంగా మారుతుంది. దీనిని పరిరక్షణ చేయకుండా వదిలేయం కదా అని ప్రశ్నిస్తూ సీఎస్‌ఆర్ నిధులను జాతీయ స్మారక చిహ్నాల పరిరక్షణకు వినియోగించాలన్న ప్రతిపాదనను పూర్తిగా సమర్ధించారు.
సీఎస్‌ఆర్ నిధులను ఆయా సంస్థలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి కూడా వినియోగించేలా నిబంధనలను సవరించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. సీఎస్‌ఆర్ నిధులను ఏయే ప్రజా, పర్యావరణహిత కార్యక్రమాలకు వినియోగించాలో కంపెనీల చట్టంలో నిర్దేశించారు. వాటికి తప్పకుండా వినియోగించాల్సిందే. అయితే ఆయా కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది యోగ సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆ జాబితాలో చేర్చాలని కోరారు. అలాగే ఒక కంపెనీ రిజిస్టర్డ్ కార్యాలయం ఒక నగరంలో ఉంటే ఫ్యాక్టరీలు వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నందున రెండు శాతం సీఎస్‌ఆర్ నిధులను కంపెనీలు సమంగా ఆయా స్థానిక ప్రాంతాల్లో వినియోగించేలా చూడాలని కోరారు. చివరగా 2 శాతం సీఎస్‌ఆర్ నిధులను ఆయా కంపెనీలు ఖర్చు కింద చూపించడానికి వీల్లేకుండా అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం చట్ట సవరణ తీసుకువచ్చారు. దానినే ప్రస్తుత ప్రభుత్వం కూడా అనుసరిస్తోంది. ఇది ఎంత మాత్రం సమంజసం కాదని అన్నారు.
addComments
Post a Comment