నెలాఖరులోపు ఘాట్ రోడ్డు మరమ్మతులు పూర్తి : టిటిడి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
తిరుమల, డిసెంబరు 16 (ప్రజా అమరావతి): ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రెండో ఘాట్ రోడ్డు మరమ్మతు పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని, వైకుంఠ ఏకాదశిలోపు పూర్తిస్థాయిలో వాహనాల రాకపోకలకు అనుమతించాలని టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశించారు. మరమ్మతులు జరుగుతున్న ప్రాంతాలను గురువారం సాయంత్రం ఛైర్మన్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ వర్షానికి పెద్ద బండరాళ్లు పడినా స్వామివారి దయవల్ల ఎవరికీ ప్రమాదం జరగలేదన్నారు. పడిన బండరాళ్లను పూర్తిస్థాయిలో తొలగించామని, యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. 7, 8, 9, 14, 15 కిలోమీటర్ల వద్ద త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. ఐఐటి నిపుణుల సూచనల మేరకు ఇంకా బండరాళ్లు పడే ప్రాంతాలను గుర్తించి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ పనులన్నింటినీ ఈ నెలాఖరుకు పూర్తి చేసి రెండో ఘాట్ రోడ్డును భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ఛైర్మన్ వెంట టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇఇ శ్రీ సురేంద్రనాథ్ రెడ్డి, డెప్యూటీ ఇఇ శ్రీ రమణ తదితరులు ఉన్నారు.
addComments
Post a Comment