నెల్లూరు, డిసెంబరు 18 (ప్రజా అమరావతి):--- టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా నిర్ణీత లక్ష్యం మేరకు అందరికీ రుణాలు
అందజేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి ఎన్ చక్రధర్ బాబు బ్యాంకర్లను ఆదేశించారు.
శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో టిడ్ కో, జగనన్న తోడు, పి. ఎం. స్వానిధి పథకాల అమలుపై సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి బ్యాంకుల వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం, అల్లిపురం, అక్కచెరువుపాడు,కల్లూరు పల్లి,గూడూరు, కావలి, ఆత్మకూరు, సూల్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి పట్టణాల్లో 365, 430చదరపు అడుగుల టిడ్ కో గృహాలు మంజూరు అయిన 7968 లబ్ధిదారులకు సంబంధించిన దరఖాస్తులు పంపగా అందులో 1154 మందికి రుణాలు మంజూరు చేసి 984 మందికి 21.24 కోట్ల రూపాయల రుణాలు విడుదల చేయడం జరిగిందన్నారు. మిగిలిన వారందరికీ కూడా బ్యాంకర్లు ఈనెల 31వ తేదీలోగా తప్పనిసరిగా రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయుటకు బ్యాంకర్లు తమ వంతు పూర్తి సహకారం అందించాలన్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అన్ని బ్యాంకు బ్రాంచ్ మేనేజర్లకు అందేలా చూడాలన్నారు. మెప్మా అధికారులు లబ్ధిదారులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు బ్యాంకర్లకు పూర్తిస్థాయిలో అందించాలన్నారు. బ్యాంకర్లు పెద్ద ఎత్తున రుణ మేళాలు నిర్వహించి విరివిగా రుణాలను మంజూరు చేయాలన్నారు. ఇకపై రుణాల మంజూరు విషయమై వారాంతపు నివేదికలను క్రమం తప్పకుండా అందజేయాలన్నారు.
ఈనెల 28వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి "జగనన్న తోడు పథకం" లాంఛనంగా ప్రారంభిస్తారని, ఇందుకోసం ఈనెల 24వ తేదీ లోగా వీధి విక్రయదారులు, తోపుడు బండ్లు, ప్లాట్ఫామ్ వ్యాపారస్తులకు ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో డి ఆర్ డి ఎ ద్వారా 41 వేల మంది స్వయం సహాయక బృందాల లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాల్సి ఉందన్నారు. అలాగే పట్టణాల పరిధిలో మెప్మా ద్వారా 'జగనన్న తోడు- పీఎం స్వా నిధి ' కింద 19601 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించాలన్నారు.
ఈ సమావేశంలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్, డి ఆర్ డి ఎ, మెప్మా పి డి లు శ్రీ సాంబశివ రెడ్డి, శ్రీ రవీంద్ర, మెప్మా గృహాల జిల్లా కో ఆర్డినేటర్ శ్రీ రామ సుబ్బా రావు, సులూరుపేట, నాయుడుపేట, ఆత్మకూరు, కావలి, వెంకటగిరి, గూడూరు మున్సిపల్ కమిషనర్లు శ్రీ నరేంద్ర కుమార్, శ్రీ చంద్రశేఖర్,శ్రీ రమేష్, శ్రీ శివా రెడ్డి, శ్రీ మధు కిరణ్ రెడ్డి, శ్రీ శ్రీకాంత్ పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
addComments
Post a Comment