తిరుపతిలోని ఎస్వీ గోశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి: టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి
తిరుపతి, డిసెంబరు 18 (ప్రజా అమరావతి): రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక గోశాల ఏర్పాటులో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా మొదట చిత్తూరు జిల్లా, తిరుపతిలో గల ఎస్వీ గోశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం ఈఓ ఎస్వీ గోశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుపతి, పలమనేరులోని గోశాలలను రాజస్థాన్ లోని పత్మేడ గోశాల వారి నిర్వహణలో ఉంచడమా లేదా వారి సూచనలతో అభివృద్ధి చేయడమా అనే అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తిరుమలలోని గోశాలను అభివృద్ధి చేసి నవనీత సేవను నిరంతరాయంగా కొనసాగించేందుకు వీలుగా గోశాల నిర్వాహకులతో ఎంఓయు కుదుర్చుకోవాలని అధికారులకు సూచించారు. తిరుపతిలో జరిగిన గో సమ్మేళనంలో చేసిన తీర్మానం మేరకు గో సంరక్షణ కోసం భారత ప్రధాన మంత్రివర్యులకు, హోం మంత్రివర్యులకు నివేదించాల్సి ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని గో సమ్మేళనం కమిటీ సభ్యులను కోరారు.
ప్రసాదాల తయారీ కోసం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ముడిసరుకులను వినియోగించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పంచగవ్య ఉత్పత్తులపై అవగాహన పెంచడంలో భాగంగా తొలుత రాష్ట్రంలోని ఏవైనా రెండు గోశాలల్లో వీటి తయారీకి ప్రణాళికలు రూపొందించాలన్నారు. అనంతరం గో ఆధారిత ఉత్పత్తులను పెంచేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు.
ఈ సమీక్షలో జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, బోర్డు మాజీ సభ్యులు శ్రీ శివకుమార్, ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీ విజయరామ్, చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు, గోశాల సంచాలకులు డాక్టర్ హరనాథ్ రెడ్డి, వెటర్నరీ వర్సిటీ ప్రొఫెసర్ నాయుడు పాల్గొన్నారు.
addComments
Post a Comment