మార్కెట్లో వస్తున్న సరికొత్త డిజైన్లపై చేనేత కార్మికులకు అవగాహన కల్పించి

 


నెల్లూరు, డిసెంబర్ 9 (ప్రజా అమరావతి): మార్కెట్లో వస్తున్న సరికొత్త డిజైన్లపై చేనేత కార్మికులకు అవగాహన కల్పించి


వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు వెంకటగిరిలో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో  డిజైనింగ్ సెంటర్ ను నెలకొల్పడం శుభ పరిణామమని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. గురువారం వెంకటగిరి సమీపంలోని బొప్పాపురంలోని సాలెకాలనీలో అంతరన్ సేవా కార్యక్రమంలో భాగంగా టాటా ట్రస్ట్ వారు నెలకొల్పిన డిజైనింగ్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన డిజైనింగ్ సెంటర్లో ఏర్పాటుచేసిన చేనేత మగ్గాలను పరిశీలించి నిర్వాహకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  తదుపరి చేనేత చీరలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ  చేనేత కార్మికులు ఈ శిక్షణా సంస్థను ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో హస్తకళలకు మంచి గుర్తింపు ఉందని,  వెంకటగిరి చేనేత కార్మికులకు జిల్లాలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఈ డిజైనింగ్ సెంటర్ ద్వారా 300 మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ సంస్థ ద్వారా  చేనేత కార్మికులు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు పొందే అవకాశం ఉందన్నారు. ఇటీవల సంభవించిన వరదల ప్రభావంతో చేనేత కార్మికులు కూడా చాలామంది నష్టపోయారని, వారందరికీ ఇప్పటివరకు 90 వేల రూపాయల వరకు నష్ట పరిహారంగా అందజేశామని, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  అలాగే ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఇళ్లకు సంబంధించి రుణాలు పొందిన వారు ప్రస్తుతం కనీస రుసుము చెల్లిస్తే వారికి జగనన్న సంపూర్ణ గృహ పథకం కింద పూర్తి హక్కులు లభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ పథకానికి మంచి స్పందన వస్తుందన్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఈ పథకం ప్రయోజనాలను తెలియజేయడంతో ప్రజలంతా కూడా  స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని చెప్పారు. ఈ పథకం వల్ల పేదలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని, ఇంటిపై పూర్తి హక్కులు లభించి భవిష్యత్తులో వారికి భరోసా కలుగుతుందన్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద పదివేల మంది లబ్ధిదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, వీరందరికీ ఈనెల 21న రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తామని చెప్పారు. 

  ముందుగా జిల్లా కలెక్టర్ బంగారు పేట సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన నలుగురు లబ్ధిదారులకు గృహ రుణాల విముక్తి పత్రాలను అందజేశారు. 


 ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శ్రీ మురళీకృష్ణ, హ్యాండ్లూమ్స్ ఏడి శ్రీ ఆనంద్ కుమార్, ఎండిఓ వెంకటేశ్వర్ రావు, వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ శ్రీ మధు కిరణ్ రెడ్డి, చైర్ పర్సన్ శ్రీమతి నక్కా భానుప్రియ, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ నక్కా వెంకటేశ్వరరావు, డక్కిలి తాసిల్దార్ బిఆర్కే ప్రసాద్, టాటా ట్రస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకట సురేష్, మస్తాన్, సచివాలయ అడ్మిన్ అంకోజీ రావు, సిబ్బంది చంద్రకళ, సాయి కృష్ణ, నరేంద్ర, వెంకటేశ్వర్లు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.