- మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పాస్టర్లకు గౌరవ వేతనం
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, డిసెంబర్ 4 (ప్రజా అమరావతి): ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని అర్హులైన పాస్టర్లకు సీఎం జగన్మోహనరెడ్డి గౌరవ వేతనాన్ని అందిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శనివారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నాని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జాన్ బెన్నీ లింగం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహనరెడ్డి గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా పాస్టర్లకు నెలకు రూ. 5 వేల గౌరవ వేతనాన్ని ప్రకటించడం అభినందనీయమన్నారు. ఈ గౌరవ వేతనాన్ని చర్చి అకౌంట్లకు జమ చేస్తున్నారని చెప్పారు. పాస్టర్ల వ్యక్తిగత అకౌంట్లకు జమ అయ్యేలా చూడాలని కోరారు. అలాగే ఈ నెల 15 వ తేదీన గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గుడ్లవల్లేరు గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రావాలంటూ మంత్రి కొడాలి నానిని ఆహ్వానించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలోని అర్చకులు, ఇమామ్ లు, మౌజమ్ లు, పాస్టర్లకు ప్రభుత్వం గౌరవ వేతనాన్ని అందజేస్తోందన్నారు. కేటగిరీ -1 అర్చకులకు రూ.15 వేల 625 లు, కేటగిరీ -2 అర్చకులకు రూ.10 వేలు, ఇమామ్లకు రూ.10 వేలు, మౌజమ్లకు రూ. 5 వేలు, పాస్టర్లకు రూ.5 వేలు చొప్పున ప్రతి నెలా గౌరవ వేతనాన్ని అందిస్తూ కరోనా కష్టకాలంలో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. గౌరవ వేతనాన్ని అందించే క్రమంలో ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్నీ సీఎం జగన్మోహనరెడ్డి నెరవేర్చుతున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా గుడ్లవల్లేరులో ఈ ఏడాది కూడా అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జాన్ బెన్నీ లింగం ఆధ్వర్యంలో సెమీక్రిస్మస్ వేడుకలను నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. క్రీస్తు చూపిన ప్రేమ, దయాగుణం వంటి మార్గాల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలడుగు రాంప్రసాద్, ఉప్పాల రాము, కోగంటి ధనుంజయ, కౌన్సిల్ గుడివాడ పట్టణ అధ్యక్షుడు కృపాకర్, గుడ్లవల్లేరు మండల ఉపాధ్యక్షుడు ఇమ్మానియేల్, నాయకులు జెర్మియా, యెహెూషువా తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment