పర్యాటక రంగం అభివృద్ధికై జనవరిలో పెట్టుబడిదారుల సమావేశం
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావు
అమరావతి,డిశంబరు 20 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి మరియు విస్తరణకై పెట్టుబడిదారుల సమావేశం (Investors Meet) వచ్చే ఏడాది జనవరిలో విశాఖపట్నం లేదా విజయవాడలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం అమరావతి సచివాలయంలోని ఆయన చాంబరులో పర్యాటక, క్రీడా శాఖల అధికారులతో మంత్రి సమావేశమై ఆయాశాఖల వారీగా నిర్వహిస్తున్న పనుల ప్రగతిని సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 13 ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏడు, ఐదు నక్షత్రాల హోటళ్లను నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. ఐదు ప్రాంతాల్లో హోటళ్లను నిర్మిస్తామని ఇప్పటికే ఒబెరాయ్, హైయత్ గ్రూపులు ముందుకు వచ్చాయని, మిగిలిన ప్రాంతాల్లో కూడా హోటళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ఈ ఇన్వెస్టర్ల మీట్ ను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.
వచ్చే మూడు మాసాలు పర్యాటక రంగానికి మంచి సీజన్ అని తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు దేశ,విదేశాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారన్నారు. వీరందరికీ స్వామివారి దర్శనం కల్పించాలనే లక్ష్యంతో ప్రస్తుతం పర్యాటక సంస్థకు ఇస్తున్న వేయి దర్శనం టికెట్లను కనీసం 2 వేలకు పెంచాలని టి.టి.డి. చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డిని కోరగా వారు సానుకూలంగా స్పందించారన్నారు. అదే విధంగా కొండ దిగువనున్న పద్మావతి నిలయంలో పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మరియు కొండపైనున్న శ్రీనివాస నిలయం రెస్టారెంట్నురెన్యువల్ చేసేందుకు చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి ఆమోదం తెలిపారన్నారు.
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది పర్చి అంతర్జాతీయ పటంలో రాష్ట్రానికి మంచి స్థానాన్ని కల్పించాలనే ఉద్దేశ్యంతో నూతన టూరిజం పాలసీని ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఇందులో బాగంగా 48 ప్రాంతాల్లో నూతనంగా రెస్టారెంట్లను ఏర్పాటుచేసి ఆపరేషన్ అండ్ మెయింటినెన్సుకై ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే లక్ష్యంతో టెండర్లను పిలవడం జరిగిందని, వాటిలో 33 రెస్టారెంట్లకు టెండర్లు అందాయని, మిగతావాటి టెండర్లు అందలేదన్నారు. వీటికి కూడా మళ్లీ జనవరిలో టెండర్లను పిలిచి సాద్యమైనంత త్వరగా వాటినన్నింటినీ ఆపరేషన్ లోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. వీటికి తోడు ప్రస్తుతం ఉన్న 38 హోటళ్లు / రెస్టారెంట్లలో ఆక్యుపెన్సీ 50 శాతం మాత్రమే ఉందని, దాన్ని 75 శాతానికి తీసుకువెళ్లేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రైవేటు హోటళ్లకు దీటుగా వీటిని తీర్చిదిద్దుతున్నామన్నారు. వీటిలో క్వాలిటీ కంట్రోల్ మరియు చెక్ చేసేందుకు ముగ్గురు అధికారులతో ఒక టాస్కుఫోర్స్ కమిటినీ ఏర్పాటు చేస్తున్నామని, ఈ కమిటీ నెలకు కనీసం 10 రెస్టారెంట్లను సందర్శించి వాటి నిర్వహణను మెరుగుపర్చేందుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం సంస్థకు సంబందించి మొత్తం 38 టూరిజం బోట్లను నడపడం జరుగుతుందని, వీటితో పాటు కొన్ని చోట్ల ప్రైవేటు బోట్లను కూడా నడుపుతున్నామన్నారు. పోచారం, నాగార్జునసాగర్ లో బోట్లను ఆపరేషన్లోకి తీసుకురావడం జరిగిందని, నాగార్జున సాగర్ నుండి శ్రీశైలానికి నడిపే బోటు కొన్ని మరమ్మత్తువల్ల నిలిపివేయడం జరిగిందని, దాన్ని కూడా వచ్చే సంక్రాంతికల్లా ఆపరేషన్ లోకి తీసుకురావడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రైవేటు బోటు ఆపరేటర్లను ప్రోత్సహించే విధంగా తాటిపూడి, తాండవ, సోమశిల, గంటికోట తదితర రిజర్వాయర్లలో కూడా బోటింగ్ సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అయితే భద్రత ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీలేకుండా తగు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
జనవరి 12 న నేషనల్ యూత్ డే......
స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకొని జనవరి 12 న నేషనల్ యూత్ డే ను అన్ని రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించాలని కేంద్ర యూత్ సర్వీసెస్ మంత్రి ఆదేశాలు జారీచేశారన్నారు. వారి ఆదేశాల మేరకు జనవరి 12 న విశాఖపట్నం లేదా విజయవాడలలో ఘనంగా నేషనల్ యూత్ డే ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
రాష్ట్రం యొక్క పేరు ప్రఖ్యాతలు పెరిగే విధంగా ఏడాదికి రెండు సార్లు జాతీయ స్థాయి యూత్ ఫెన్టివల్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని, దానికి కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర యూత్ సర్వీసెస్ శాఖ అధికారులు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
మూడు జాతీయ స్థాయి మెగా క్రీడా కార్యక్రమాలు......
రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు వచ్చే ఏడాది ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మూడు జాతీయ స్థాయి మెగా క్రీడా కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. వారి ఆదేశాలకు అనుగుణంగా మూడు ప్రాంతాల్లో మూడు మెగా క్రీడా కార్యక్రమాలను నిర్వహించేందుకు క్రీడా శాఖ అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే సి.ఎం.కప్ టోర్నమెంట్స్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మన రాష్ట్రం నుండి ఒలింపిక్స్ లో పాల్గొన్నబ్యాట్మింటెన్ క్రీడాకారిణి పి.వి.సింధుకు రూ.30 లక్షలతో పాటు విశాఖలో 2 ఎకరాల ప్రభుత్వ స్థలం, హాకీ క్రీడాకారిణి రజినికి రూ.30 లక్షలతో పాటు పాత బకాయిలు రూ.60 లక్షలను కూడా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు.
ఈ మద్యే జరిగిన వరల్డు బ్యాడ్మింటెన్ చాంపియన్షిప్ పోటీలో రాష్ట్రానికి చెందిన కిదాంబి శ్రీకాంత్ రజతపతకం సాధించినందుకు మంత్రి అభినందిస్తూ త్వరలో వీరికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానించడం జరుగుతుందన్నారు.
ఈసమావేశంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఎ.వరప్రసాద్ రెడ్డి, రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, పర్యాటక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ,శాఫ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి,యువజన సర్వీసులు శాఖ డైరెక్టర్ సి.నాగరాణి,సాంస్కృతిక శాఖ సీఈఓ మల్లిఖార్జునతో పాటు ఇంకా పలువురు పర్యాటక,క్రీడా శాఖల అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment