18 నుండి 31 వరకూ నైట్ కర్ఫ్యూ

 18 నుండి 31 వరకూ నైట్ కర్ఫ్యూ


ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్


అమరావతి (ప్రజా అమరావతి): రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 18 నుండి 31వరకూ నైట్ కర్ప్యూను విధిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పండుగ సీజన్ కారణంగా స్వస్థలాలకు  వెళ్లి వచ్చే వారికి అసౌకర్యం లేకుండా ఈ నెల 18 నుండి రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు టెస్ట్-ట్రేస్-ట్రీట్ విధానంతో ముందుకెళ్లాలని ఆయన  సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మార్గదర్శకాల మేరకు ప్రస్తుతం రాష్ట్రంలో విస్తరిస్తున్న -ఒమైక్రాస్ వేరియంట్ ను అడ్డుకునేందుకు కఠిన చర్యలు అమలు చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. కాగా ఆసుపత్రులు, వైద్య పరీక్షలు, ఫార్మసీ రంగాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్లు, ఇంటర్నెట్ సర్వీసులు, ప్రసార సేవలు, ఐటి, ఐటి సంబంధిత సేవలు, పెట్రోల్ బంకులు, విద్యుదుత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, నీటి సరఫరా, పారిశుధ్య వ్యవస్థలకు సంబంధించిన సిబ్బందికి ఈ నిషేధాజ్ఞల నుండి మినహాయింపునిచ్చారు. అదే విధంగా అత్యవసర విధుల్లో వుండే న్యాయాధికారులు, కోర్టుల సిబ్బంది, స్థానిక, పురపాలక, పంచాయితీరాజ్ సంస్థలకు చెందిన సిబ్బందిని కూడా ఈ నిషేధాజ్ఞల నుండి మినహాయించారు. అయితే వారు విధి నిర్వహణలో గుర్తింపు కార్డును తప్పనిసరిగా చూపాల్సి వుంటుంది. వీరితో పాటు గర్భిణులు, వైద్య చికిత్స పొందుతున్న పేషెంట్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుండి వచ్చిపోయే వారు  సంబంధిత ఆధారాలు , ప్రయాణ టికెట్లు చూపటం ద్వారా తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. వీరికోసం విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికార యంత్రాంగానికి సూచించారు. దీంతో పాటు అంతర్రాష్ట్ర, రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు కూడా కర్ఫ్యూ నుండి మినహాయింపునిచ్చినట్లు సింఘాల్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ఆయన మరికొన్ని సూచనలు చేశారు. ప్రజలందరూ మాస్క్ లు ధరించటం తప్పనసరి అని, ఈ నిబంధనను అతిక్రమించిన వారికి రు.100 జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. వివాహాలు, మతపరమైన  వంటి వాటికి బహిరంగ ప్రదేశాలలో గరిష్టంగా 200 మంది, ఇన్ డోర్లో 100 మందికి మాత్రమే అనుమతి వుంటుందని, ఈ కార్యక్రమాలకు హాజరయ్యే వారంతా కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. సినిమా హాళ్లలో సీటు వదిలి సీటులో కూర్చోపటంతో పాటు ప్రేక్షకులందరూ మాస్క్ ధరించటం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇక ప్రజా రవాణా వ్యవస్థల వాహనాలలో ఇటు సిబ్బందితో పాటు, ప్రయాణికులు కూడా మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని , వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు తమ ఆవరణలలో వున్న వారంతా తప్పనిసరిగా మాస్కలు ధరించేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రు.10 వేల నుండి రు.25 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మార్కెట్లు, షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాలలో కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే భారీ జరిమానాలు విధిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన  మార్కెట్లు , వాణిజ్య సముదాయాలు వంటి ప్రదేశాలలో పరిస్థితి తీవ్రత ఆధారంగా వాటిని ఒకటి లేదా రెండు రోజుల పాటు  మూసివేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు అనుసరించే విధంగా మార్కెట్ అసోసియేషన్లు, యాజమాన్యాలు ప్రజలలో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని, ఇందులో విఫలమైతే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. మతపరమైన ప్రదేశాలు కూడా కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని భౌతిక దూరం. మాస్క్ లు ధరించటం, తగిన రీతిలో పారిశుధ్యం వంటి విధానాలు అనుసరించాలని, కోవిడ్ వ్యాప్తి నిరోధానికి అవసరమైన సందర్భాలలో కఠిన నిర్ణయాలు కూడా తీసుకునే అధికారాన్ని ఆయా యాజమాన్యాలకు కల్పిస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు నెల 18 నుండి అమలులో వుంటాయని, అప్పటి వరకూ గతంలో జారీ చేసిన 751 జిఓ నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, పోలీసు కమీషనర్లు, సూపరింటెండెంట్లు ఈ నిబంధనల అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నిబంధనల అమలులో విఫలమైన వారిపై విపత్తు నిర్వహణా చట్టం నిబంధనల ప్రకారం చర్యలు చేపడతామని సింఘాల్ హెచ్చరించారు. తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకూ ఈ ఆదేశాలు అమలులో వుంటాయని స్పష్టం చేశారు.


 

Comments