తిరుచానూరు ఆలయానికి గోదానం చేసిన టీటీడీ ఛైర్మన్ దంపతులు

 తిరుచానూరు ఆలయానికి గోదానం చేసిన టీటీడీ ఛైర్మన్ దంపతులు


– శ్రీయాగం లో పాలుపంచుకున్న అర్చకులు, ఆలయ అధికారులు, సిబ్బందికి సన్మానం

తిరుపతి 27 జనవరి (ప్రజా అమరావతి): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు గురువారం గోవు, దూడ దానం చేశారు.

నవకుండాత్మక శ్రీ యాగం ముగింపు అనంతరం ఛైర్మన్ దంపతులు శాస్త్రోక్తంగా గో పూజ నిర్వహించారు. గోవు, దూడ కు దాణా, పండ్లు తినిపించారు. అనంతరం గోవు, దూడ ను దానంగా అందించారు.

అనంతరం చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు శ్రీ యాగం నిర్వహణలో పాలుపంచుకున్న శ్రీ వేంపల్లి శ్రీనివాస్, శ్రీ బాబు స్వామి తో పాటు 70 మంది అర్చకులను శాలువతో సత్కరించి, బంగారు డాలర్, సంభావనలు అందించారు. వీరితో పాటు ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి భాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అధికారులు, సిబ్బంది, విజిలెన్స్ అధికారులు, సిబ్బంది, ఎస్వీబీసీ, టీటీడీ ప్రజాసంబంధాల విభాగం సిబ్బందిని శాలువతో సన్మానించారు.

దేశం, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతాయి : టీటీడీ చైర్మన్

నవకుండాత్మక శ్రీ యాగం అర్చకులుశాస్త్రోక్తంగా, బ్రహ్మాండంగా నిర్వహించారని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. యాగం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 50 సంవత్సరాల క్రితం శ్రీశ్రీ చిన జీయర్ స్వామివారి తాత ఈ యాగం నిర్వహించారన్నారు. ఇప్పుడు శ్రీ పద్మావతి అమ్మవారు తమ ద్వారా యాగం జరిపించారని చెప్పారు. యాగ ఫలితం వల్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ ప్రజలు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని శ్రీ సుబ్బారెడ్డి కోరారు. యాగం మహా పూర్ణాహుతికి కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి హాజరయ్యారని, శ్రీశ్రీ చినజీయర్ స్వామి ఫోన్ ద్వారా తమ ఆశీస్సులు అందజేశారని ఆయన తెలిపారు.

Comments