నెల్లూరు జనవరి 11 (ప్రజా అమరావతి);
సచివాలయ వ్యవస్థ లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎటువంటి ఆందోళన చెందవల్సిన అవసరం లేదని, వివిధ శాఖలతో భాగస్వాములై ఉన్నందున , వారి ప్రోబెషన్ డిక్లేర్ చేయడం కొద్దిగా ఆలస్యమవుతుందని హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ తెలిపారు.
మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ వి సి హాలులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రికి ఎంతో ఇష్టమైన సచివాలయ వ్యవస్థ లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ త్వరలో న్యాయం
జరుగుతుందని, ఎటువంటి అపోహలకు ఆస్కారం లేకుండా అందరూ తమ తమ విధులకు హాజరవ్వాలని కోరారు. ఒకే సచివాలయంలో పనిచేస్తున్నప్పటికీ, వివిధ రకాల శాఖలకు చెందిన వారైనందున, ఆయా శాఖల నిబంధనల మేరకు రెగ్యులరైజేషన్, ప్రోబేషన్ డిక్లేర్ చేయడం జరుగుతుందన్నారు.
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు, సచివాలయ వ్యవస్థ పనితీరు సమీక్ష నిర్వహించేందుకు నెల్లూరుకు విచ్చేసినట్లుగా తెలుపుతూ, జిల్లాలోని కావలి దగ్గర లో, నెల్లూరు అర్బన్ లో వేసిన ప్రభుత్వ లేఅవుట్ లను పరిశీలించానని, అవి అందరికీ ఎంతో అనువుగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల లో భాగంగా మొదటి రెండు విడతల్లో 28 వేలకోట్ల రూపాయల వ్యయంతో మంజూరైన మొత్తం 15 లక్షల 65 వేల ఇళ్లకు గానూ ఇప్పటివరకూ 10 లక్షల 85 వేల ఇళ్ళు గ్రౌండింగ్ చేశామని, మిగిలిన వాటిని మార్చిలోపు గ్రౌండింగ్ చేయడానికి అన్నీ కలిపి వచ్చే జూన్ లోగా పూర్తి చేయుటకు తగు చర్యలు తీసుకుంటున్నట్లుగా వివరించారు. కోర్టు కేసులు, వర్షాలు వరదల వలన ఇప్పటివరకూ ఆలస్యమైందని అన్నారు. ప్రస్తుతం అన్ని ఆటంకాలు తొలగినందున, ప్రభుత్వం కూడా త్వరత్వరగా చెల్లింపులు చేస్తున్నందున, లబ్ధిదారులు అందరూ త్వరపడి ఇళ్ళు నిర్మించుకునేందుకు ముందుకు రావాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో మెప్మా, గ్రామీణ ప్రాంతాలలో డిఆర్డిఏ ద్వారా లబ్ధిదారులకు 35 వేల రూపాయల రుణం కూడా అందజేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా ఎటువంటి హక్కులు లేకుండా అదే ఇళ్లలో నివశిస్తున్న, ఇప్పటికీ బ్యాంకులకు వడ్డీలు కడుతూ ఉన్నవారికి అండగా రూపోందించిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంనకు చక్కని స్పందన లభిస్తున్నదని , ఇప్పటివరకూ రాష్ట్రంలో 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 2 లక్షల మందికి రిజిస్టర్ డాక్యుమెంట్లు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతిరోజూ పదివేల మందికి డాక్యుమెంటు చేయడం జరుగుతున్నట్లుగా వివరించారు.
అదేవిధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామస్థాయి పరిపాలనా వ్యవస్థను తీసుకురావడం జరిగిందన్నారు . పరిపాలనను మండల స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు తీసుకు రావడం వలన ప్రజలకు ఎంతగానో సౌలభ్యంగా ఉన్నదని తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు కొందరు హౌసింగ్ కార్యదర్శిని కలిసి ప్రోబెషన్ త్వరగా చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హౌసింగ్ కార్యదర్శి స్పందిస్తూ, సచివాలయ ఉద్యోగులంతా నిరసనలు విరమించి వెంటనే యధావిధిగా విధులకు హాజరుకావాలని, వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతవరకూ కొద్దిగా సహనం, ఓపికతో వేచి ఉండాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ లు శ్రీ హరేందర్ ప్రసాద్, శ్రీ గణేష్ కుమార్, శ్రీ విదేహ ఖరే, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్, గృహ నిర్మాణ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ వేణుగోపాల్ పాల్గొన్నారు.
addComments
Post a Comment