గిరిజనుల రాజ్యాంగ పరమైన హక్కులను పరిరక్షించాలి
ప్రభుత్వం అందజేసే సంక్షేమ ఫలాలు గిరిజనులకు అందాలి
ప్రభుత్వ కార్యాలయాల్లో నియామకాలు, ప్రమోషన్ లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సక్రమముగా అమలు చేయాలి : ఛైర్మన్ ఎస్.టి కమిషన్ డాక్టర్ కుంభా రవి బాబు
చిత్తూరు, జనవరి 05 (ప్రజా అమరావతి) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్.టి కమిషన్ రాజ్యాంగ పరమైన జుడీషియల్ అధికారాలు గల కమిషన్ అని, ప్రభుత్వ అధికారులు బాధ్యతతో పని చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా గల 32 లక్షల మంది గిరిజనుల హక్కులను పరిరక్షిచాలని రాష్ట్ర ఎస్.టి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కుంభా రవిబాబు పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమై వివిధ శాఖలలో అమలు అవుతున్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై సమీక్షించారు. ఈ సంధర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఐ.టి.డి.ఎ ప్రాంతాలలో గిరిజన ప్రజా ప్రతినిధులు ఉన్నారని వారి సమక్షంలో గిరిజనులు తమ సమస్యలను పరిష్కరించుకుంటున్నారని, కొన్ని జిల్లాలలో ముఖ్యంగా చిత్తూరు లాంటి జిల్లాలో గిరిజన ప్రజాప్రతినిధులు లేనందున గిరిజనులు వారి సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియకున్నారని తెలిపారు. గిరిజనుల సమస్యలు జిల్లా కలెక్టర్ దృష్టికి వస్తే వెంటనే సంబందిత అధికారుల ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పధకాల అమలులో, సంక్షేమ ఫలాలు గిరిజనులకు అందించడంలో శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లాలో కొన్ని గ్రామాలు చూశానని గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. గిరిజనుల సమస్యలకు రాష్ట్ర కమిషన్ స్పందిస్తుందని సంబందిత అధికారులను సంజాయిషీ కోరడం జరుగుతుందన్నారు. కమిషన్ ఒక గ్రామం సందర్శిస్తుందని 10 రోజులకు ముందే పర్యటన వివరాలు తెలిపినను పర్యటన రోజు ఉ.10.30 గంటలకు గ్రామాల్లో రావలసిన అధికారులు 11.30 గంటల వరకు వచ్చారని, మరికొంత మంది అధికారులు రాలేదని, తాను 2గంటల వరకు ఆ గ్రామంలో ఉన్నను అధికారులు రాకపోవడం కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు జవాబుదారి తనంతో పనిచేయాలని, ఎస్.టి కమిషన్ ఒక మారు మూల ప్రాంతం పర్యటించడం ఆషామాషీ విషయం కాదని స్పష్టం చేశారు. గంగవరం మండలం కుయ్యవంక గ్రామంలో దాదాపు 40 ఎస్.టి కుటుంబాలు ఉన్నాయని వారు నివశిస్తున్న భూములకు పట్టాలు లేవని, 4-5 తరాలుగా వారు ఆ గ్రామంలోనే నివసిస్తున్నారని, పట్టాలు లేనందున, గృహ నిర్మాణాలు కూడా చేపట్టలేదని, ఆ గ్రామాల్లో త్రాగు నీరు, వసతి, రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. భారత దేశంలో మొట్టమొదటి సారిగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో 2006 లో అటవీ హక్కు చట్టాన్ని అమలు చేసి దాదాపు 6 వేల పై చిలుకు భూములను గిరిజనులకు పంపిణీ చేశారని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 4.26 లక్షల ఎకరాల భూములను గిరిజనులకు పంపిణీ చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు అడవులలో సాగు చేసుకుంటున్న గిరిజనుల భూములకు పట్టాలు ఇస్తుంటే అధికారులు అడ్డంకులు ఎందుకు చెబుతున్నారని అడిగారు. కుయ్య వంక గ్రామాలలో గిరిజనులకు చెందిన 216 ఎకరాలలో 74 ఎకరాలకు మాత్రమే పట్టాలిచ్చారని తక్కిన భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వ లేదని కమిషన్ నుండి సంజాయిషి కోరుతామన్నారు. ముఖ్యమంత్రి గిరిజనులు బాగుపడాలని, వారు ఆర్ధికంగా ఆరోగ్య పరంగా అభివృద్ది చెందాలని ఆకాక్షించి ఎస్.టి కమిషన్ ను నియమించిందని, గిరిజనులకు చెందాల్సిన లబ్ది అందచేయుటలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించలేరని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో బాధ్యత గల ప్రజా ప్రతినిధులు పనిచేస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులు కూడా సైనికుల్లా పని చేయాలన్నారు. గిరిజనులకు సంబందించి పోలీసు శాఖకు పిర్యాధు వస్తే స్పందించడం లేదని తనకు అర్జీలు అందాయన్నారు. కమిషన్ దృష్టికి వచ్చిన పిర్యాధులను సంబందిత శాఖలకు పంపి నిర్ణీత గడువు లోపు సమస్యలు పరిష్కారించేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకు అధికారులు సహకరించాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ మాట్లాడుతూ జిల్లాలో 1300 ఎస్.టి హెబిటేషన్లు ఉన్నాయని జనాభాలో దాదాపు 8 నుండి 9 శాతం గిరిజనులు ఉన్నారని తెలిపారు. గిరిజనులలో యానాధి కులానికి చెందిన వారు జిల్లాలో ఎక్కువగా ఉన్నారని, ఎస్.టి.కాలనీలు, ఫెబ్లిటేషన్లు, తాండాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఎస్.టి కమిషన్ ఏర్పాటు అయ్యాక మొట్ట మొదటి సారిగా చిత్తూరు జిల్లాలో కమిషన్ పర్యటిస్తున్నదని అధికారులు కమిషన్ కు సహకరించి వారి ప్రశ్నలకు సమాధానాన్ని జవాబు దారి తనంతో ఇవ్వాలన్నారు. సమాధానం వెంటనే అందుబాటులో లేకుంటే కమిషన్ కు లిఖిత పూర్వకంగా సమాధానం అందించాలని ఆదేశించారు. ఎస్.టి. కమిషన్ పర్యటనకు హాజరు కానీ సంబందిత అధికారులను సంజాయిషీ కోరవలసిందిగా జెసి (సంక్షేమం) రాజశేఖర్ కు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం 2019 నుండి స్పందన కార్యక్రమం నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి వర్యులు స్పందనలో వచ్చిన పిర్యాధుల పై చర్యలు తీసుకొని పరిష్కరించాలని ఆదేశించి ప్రతి వారం సమీక్షిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ పాలసి కావున, ప్రతి శాఖలో వచ్చిన అర్జీలు తప్పని సరిగా పరిష్కరించడం జరుగుతుందన్నారు.
జిల్లా ఎస్.పి సెందిల్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్.సి, ఎస్.టి పైన అట్రా సిటీ కేసు నమోదైన రెండు నెలలోపు పరిష్కరిస్తున్నామని తెలిపారు. రెండు నెలల పైన పెండింగ్ ఉన్న కేసులు ఏమీయులేవని తెలిపారు. పోలీసు స్టేషన్ లలో ఎస్.సి, ఎస్.టి లు పిర్యాధు చేస్తే కేసు ఫైల్ చేస్తున్నామని అడిషనల్ ఎస్.పి అట్రా సిటి కేసులను పరిష్కరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఒక డ్యాష్ బోర్డును ఏర్పాటు చేసి సమీక్షిస్తుందని తెలిపారు.
అనంతరం ఛైర్మన్ విద్యా శాఖ, అటవీ, పోలీసు, ఆర్.టి.సి, మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, వ్యవసాయ, రవాణా, మహిళా శిశు సంక్షేమం, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య శాఖ, తదితర శాఖలలో అమలు చేస్తున్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను వారి రోస్టర్ పాయింట్ ను పరిశీలించారు. గత రెండు రోజులలో ఎస్.టి వర్గాల నుండి అందిన పిర్యాధులను సంబందిత శాఖాదికారులకు తెలియజేస్తూ కమిషన్ నుండి లిఖిత పూర్వకంగా పిర్యాధులు పంపడం జరుగుతుందని, పిర్యాధు అందిన రెండు నెలలలోపు సమస్యలను పరిష్కరించి కమిషన్ కు రిపోర్టు చేయవలసిందిగా తెలిపారు. డి.టి.డబ్ల్యూ.ఓ ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ ఆఫీసర్లు శాఖా పరంగా గిరిజనులకు అందజేస్తున్న సంక్షేమ వివరాలను సమగ్ర రిపోర్టు అందజేయాల్సిందిగా సూచించారు. ఈ సమావేశంలో జె.సి (సంక్షేమం) రాజశేఖర్, డి.ఆర్.ఓ మురళి, వివిధ శాఖాదికారులు హాజరయ్యారు.
addComments
Post a Comment