అంగ‌న్‌వాడీల ప‌నితీరుపై ప‌రిశీల‌న‌నీతిఆయోగ్ అధికారి బాలాజీ జిల్లాలో ప‌ర్య‌ట‌న‌

స్వ‌యంశ‌క్తి సంఘాల నిర్వ‌హ‌ణ‌పై ఆరా

అంగ‌న్‌వాడీల ప‌నితీరుపై ప‌రిశీల‌న‌


ప్ర‌సూతి వైద్య సేవ‌ల గురించి తెలుసుకున్న ప్ర‌భ‌రీ ఆఫీస‌ర్‌


విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 06 (ప్రజా అమరావతి):

జిల్లాలోని స్వ‌యంశ‌క్తి మ‌హిళ‌లు ఆర్దికంగా వృద్ధి సాధించ‌డంలో ఇత‌ర జిల్లాల‌తో పోటీ ప‌డాల‌ని నీతిఆయోగ్ సెంట్ర‌ల్ ప్ర‌భ‌రీ అధికారి బాలాజీ సూచించారు. జిల్లాలోని మ‌హిళా సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాల‌ను, ప్ర‌భుత్వం నుంచి అందుతున్న ఆర్ధిక స‌హాయాన్ని స‌క్ర‌మంగా వినియోగించ‌డంప‌ట్ల సంతృప్తి వ్య‌క్తంచేశారు. అదేవిధంగా ఈ జిల్లాలోని మ‌హిళా సంఘాలు బ్యాంకుల నుంచి  పొందిన రుణాలు తిరిగి చెల్లించ‌డంలో మంచి రికార్డు క‌లిగి వున్నాయ‌ని పేర్కొన్నారు. నీతిఆయోగ్ అధికారి బాలాజీ గురువారం జిల్లాలో ప‌ర్య‌టించారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఎల్‌.కోట మండ‌లం మ‌ల్లివీడులో మ‌హిళా స్వ‌యంశ‌క్తి సంఘాల‌తో స‌మావేశ‌మై వాటి ప‌నితీరును తెలుసుకున్నారు.


అనంత‌రం ఎస్‌.కోట మండ‌లం కొత్తూరులో అంగ‌న్‌వాడీ కేంద్రాన్ని సంద‌ర్శించారు. కేంద్రంలోని పిల్ల‌ల త‌ల్లిదండ్ర‌ల‌తో మాట్లాడారు. పిల్ల‌ల‌కు ఇస్తున్న ఆహారం, ప్ర‌సూతి మ‌హిళ‌లు, బాలింత‌లకు ఎంత ప‌రిమాణంలో పౌష్టికాహారం అందిస్తున్నార‌నే వివ‌రాలు తెలుసుకున్నారు. ర‌క్త‌హీన‌త నివార‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించి ఆరా తీశారు. అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లు, ఆయాలతో మాట్లాడి పిల్ల‌ల సంర‌క్ష‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించ ఆరా తీశారు. పిల్ల‌ల బ‌రువును ఏవిధంగా కొలుస్తున్నార‌నే అంశంపై ప‌రిశీల‌న చేశారు.


గంట్యాడ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని ప‌రిశీలించి కోవిడ్ వ్యాక్సినేష‌న్ గురించి తెలుసుకున్నారు. గ‌ర్భిణీలు ప్ర‌స‌వం కోసం ఆసుప‌త్రికి వ‌స్తున్నారా లేదా ఇళ్ల‌లో ఏమైనా ప్ర‌స‌వాలు జ‌రుగుతున్నాయా అనే అంశాన్ని తెలుస‌కున్నారు. ప్ర‌సూతి మ‌హిళ‌లు ప్రస‌వం కోసం ఆసుప‌త్రికి ఎలా చేరుకుంటున్నారు, మాతృ, శిశు మ‌ర‌ణాల‌పై ఆరా తీశారు.


ఈ ప‌ర్య‌ట‌న‌లో జాయింట్ క‌లెక్ట‌ర్‌(అభివృద్ధి) డా.ఆర్‌.మ‌హేష్ కుమార్‌, ముఖ్య ప్ర‌ణాళికాధికారి విజ‌య‌ల‌క్ష్మి, మ‌హిళాశిశు సంక్షేమ శాఖ పి.డి. రాజేశ్వ‌రి, వైద్య ఆరోగ్య‌శాఖ అధికారిణి డా.రామేశ్వ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.