రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం
రంగు మారిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తాం
రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ గిరిజా శంకర్
జిల్లాలో కమిషనర్ సుడిగాలి పర్యటన
కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశం
బొండపల్లి, గజపతినగరం (విజయనగరం), జనవరి 04 (ప్రజా అమరావతి) ః
రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ గిరిజా శంకర్ స్పష్టం చేశారు. వర్షాల కారణంగా రంగుమారిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. జిల్లాలో ఆయన మంగళవారం విస్తృతంగా పర్యటించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను తనిఖీ చేశారు. వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయన బొండపల్లి, గజపతినగరం మండలాల్లో మంగళవారం సుడిగాలి పర్యటన జరిపారు.
ఈ పర్యటన సందర్భంగా కమిషనర్ గిరిజా శంకర్ మీడియాతో మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్వహిస్తున్నామని చెప్పారు. నిర్ధేశిత లక్ష్యాలమేరకు ధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో డబ్బు చెల్లిస్తామని తెలిపారు. ఇటీవల వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.4లక్షల ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నదని, 7లక్షల టన్నుల వరకు ధాన్యం రంగుమారిందని చెప్పారు. వర్షాల కారణంగా తడిచి రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. జిల్లా అవసరాలకు తగినంత సార్టెక్స్ బియ్యాన్ని తీసుకుంటామని, మిగిలిన ధాన్యాన్ని తూర్పుగోదావరి జిల్లాకు పంపిస్తామని చెప్పారు. తూకం కంటే అదనంగా ధాన్యాన్ని తీసుకున్నవారిపై కఠిన చర్యలను తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ, రైతులు నేరుగా మిల్లర్లవద్దకు వెళ్లవద్దని సూచించారు. వారు రైతు భరోసా కేంద్రాలకు మాత్రమే వెళ్లాలని స్పష్టం చేశారు. తడిచిన ధాన్యాన్ని విడిగా సేకరించడం జరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోలులో ఎక్కడైనా అక్రమాలు చోటుచేసుకున్నా, మిల్లర్లు అవకతవకలకు పాల్పడినా కాల్ సెంటర్‌కు లేదా తాశీల్దార్లకు, మండల ప్రత్యేకాధికారులకు గానీ ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతీగింజనూ కొనుగోలు చేస్తామని, రైతులు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ధాన్యం మిల్లు తనిఖీ
బొండపల్లి మండలం గొట్లాంలోని శ్రీ మహలక్ష్మి మోడరన్ రైస్‌మిల్లును కమిషనర్ గిరిజా శంకర్ తనిఖీ చేశారు. మిల్లులో ధాన్యం బస్తాలను, రికార్డులను, విద్యుత్ బిల్లులను సైతం పరిశీలించారు. మరపట్టిన ధాన్యాన్ని, బియ్యంలో నూక శాతాన్ని తనిఖీ చేశారు. ధాన్యం ఉత్పత్తి, బియ్యం దిగుబడిపై ఆరా తీశారు. ఎప్పటికప్పుడు ధాన్యాన్నిమరపట్టి, సిఎంఆర్ ఇవ్వాలని మిల్లర్‌ను ఆదేశించారు. బియ్యం శాంపిల్స్ తీయాలని అధికారులకు సూచించారు.
కొనుగోలు ప్రక్రియ పరిశీలన
రైతు భరోసా కేంద్రాల్లో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను కమిషనర్ పరిశీలించారు. బొండపల్లి మండలం బి.రాజేరు, గజపతినగరం మండలం శ్రీరంగరాజపురం రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల పరిదిలోని పంటల వివరాలు, దిగుబడులపై సిబ్బందిని ప్రశ్నించారు. తేమ కొలిచే విధానాన్ని పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. ముందుగా రైతులకు కూపన్లు ఇస్తున్నారా లేదా అన్న విషయాన్ని ఆరా తీశారు. ఇ-క్రాప్ నమోదు, వాటి ప్రకారం ధాన్యం కొనుగోలు జరుగుతున్నదీ లేనిదీ తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టడంపై రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే కొనుగోలు చేసిన తరువాత వీలైనంత త్వరగా డబ్బులు ఇప్పించాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. రైతులకు ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్న భరోసా కల్పించేందుకు, వలంటీర్ల సహకారంతో ఇంటింటికీ వెళ్లి రైతులకు ధాన్యం కొనుగోలు ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. అవసరమైన గోనెసంచులను సరఫరా చేస్తామని, రవాణా ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తుందన్న విషయాలను రైతులకు వివరించాలని సూచించారు.
ఎండియు వాహనం తనిఖీ
బొండపల్లి మండలం దేవుపల్లిలో ఎండియు వాహనాన్ని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరుకుల సరఫరాను పరిశీలించారు. కార్డుదారులు బియ్యం తీసుకున్నవెంటనే, ఆపరేటర్ రసీదును ఇవ్వకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సక్రమంగా సరుకులను పంపిణీ చేస్తున్నదీ, లేనిదీ కార్డుదారులను వాకబు చేశారు. రికార్డుల నిర్వహణను తనిఖీ చేశారు. కార్డుదారులకు ఆపరేటర్ ఇచ్చిన బియ్యాన్ని వేరే దుఖాణంలో తూకం వేయించి సంతృప్తిని వ్యక్తం చేశారు.
కోవిడ్ వేక్సినేషన్ పరిశీలన
బి.రాజేరులో జరుగుతున్న కోవిడ్ వేక్సినేషన్ ప్రక్రియను కమిషనర్ గిరిజా శంకర్, కలెక్టర్ సూర్యకుమారి పరిశీలించారు. అప్పటివరకు ఎంతమందికి వేక్సిన్ వేసిందీ తెలుసుకున్నారు. కేంద్రానికి వచ్చే వరకూ ఎదరుచూడకుండా, ఇంటింటికీ వెళ్లి వేక్సిన్ వేయాలని ఆదేశించారు. తమకు రైతు భరోసా జమ కాలేదని ఇద్దరు గ్రామస్తులు కమిషనర్ దృష్టికి తీసుకురాగా, వలంటీర్‌తో మాట్లాడి వారి సమస్యను తెలుసుకున్నారు. వారికి రైతు భరోసా వచ్చేలా చూడాలని ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్‌ను ఆదేశించారు.
నష్టపోయిన రైతులతో భేటీ
గత నెలలో కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన శ్రీరంగరాజపురం రైతులతో కమిషనర్ భేటీ అయ్యారు. రంగుమారిన ధాన్యాన్ని, బస్తాలను పరిశీలించారు. వర్షాలవల్ల పంట తీవ్రంగా దెబ్బతిన్నదని, పెట్టిన మదుపులు కూడా వచ్చే పరిస్థితి లేదని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 100 ఎకరాల మేర ధాన్యం తడిచిపోయిందని, 52 మంది రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పారు. దీనివల్ల బాగున్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని, పంటల బీమా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ జిసి కిశోర్ కుమార్, ఆర్‌డిఓ బిహెచ్ భవానీ శంకర్, సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ దేవుల్ నాయక్, వ్యవసాయశాఖ జెడి తారకరామారావు, మార్కెఫెడ్ డిఎం యాసిన్, సివిల్ సప్లయిస్ ఏజిఎం మీనాకుమారి, ఏడిఏ మహారాజన్, ఆయా మండలాల వ్యవసాయాధికారులు, తాశీల్దార్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment