అమరావతి (ప్రజా అమరావతి);
*జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ వెబ్‌సైట్‌ను కంప్యూటర్‌లో బటన్ నొక్కి క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్.*
*మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో నివాస స్ధలాలు(ప్లాట్లు) కేటాయించి వారి సొంతింటికలను సాకారం చేస్తున్న శ్రీ వైయస్.జగన్ ప్రభుత్వం
.*
*కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మధ్య ఆదాయ వర్గాల(ఎంఐజీ)వారికి అనువైన ధరల్లో లిటిగేషన్లకు తావులేని స్ధలాలు కేటాయిస్తున్న ప్రభుత్వం.*
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే...:*
ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రంలో ప్రతి పేదవాడికీ తనకంటూ ఒక సొంత ఇళ్లు ఉండాలి, ఏ పేదవాడికి కూడా సొంతఇళ్లు లేని పరిస్థితి ఉండకూడదు అనే మంచి సంకల్పంతో ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు ఇప్పటికే పంపిణీ చేశాం. అందులో భాగంగా తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. పనులు చక,చకా జరుగుతున్నాయి.
*సరసమైన ధరలకే..*
ఇలాంటి పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబాలకు(మిడిల్ ఇన్‌కం గ్రూపు) కూడా సొంత ఇళ్లు ఉండాలనే కలను సాకారం చేసేందుకు వారిని మార్కెట్‌లో రియల్‌ఎస్టేట్ వాళ్లు మోసాలు చేయకుండా, మంచి టైటిల్స్‌తో స్ధలాలు ఇవ్వడం, లాభాపేక్ష లేకుండా మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే, సరసమైన ధరలకే, లిటిగేషన్స్‌కు ఎలాంటి తావులేకుండా క్లియర్ టైటిల్స్‌తో ఇవ్వాలని నిర్ణయించాం. ప్రభుత్వమే ఇంటి ప్లాట్లు అభివృద్ధి చేసి, లేఅవుట్ చేసి అందుబాటులోకి తీసుకుని వచ్చే ఒక మంచి ప్రయత్నం వల్ల మధ్యతరగతి కుటుంబాలుకు మేలు జరుగుతుందనే సదుద్ధేశ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
*న్యాయపరంగా చిక్కులు లేకుండా*
న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేని, వివాదాలకు తావేలేని క్లియర్ టైటిల్స్‌తో పాటు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాటును అందించే ప్రయత్నమే ఈ జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ పథకం. ఈ రోజు నుంచి సంక్రాంతి పండగ వేళలో దీనికి శ్రీకారం చుడుతున్నాం.
*మూడు కేటగిరీలలో స్ధలాలు*
ఈ పథకంలో మూడు కేటగిరీలలో స్ధలాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎంఐజీ –1 కింద 150 గజాలు, ఎంఐజీ –2 కింద 200 గజాలు, ఎంఐజీ –3 కింద 240 గజాలు ప్రతి లేఅవుట్‌లో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది.
దీనికి సంబంధించి మొదటి దశలో అనంతపురంజిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు, వైయస్సార్ జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోనూ లేఅవుట్‌లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
*నేటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు*
దీనికి సంబంధించి నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తాం. ఈ 6 జిల్లాలే కాకుండా మిగిలిన అన్ని జిల్లాలతో పాటు ప్రతి నియోజవర్గంలో ఈ పథకం రాబోయే రోజుల్లో విస్తరిస్తుంది. కాబట్టి ప్రతినియోజకవర్గం కేంద్రంలో మధ్యతరగతి కుటుంబాలకు మంచి జరిగే పరిస్థితి ఉత్పన్నమవుతుంది.
*ఈ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు*
ఈ టౌన్స్‌లో ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవాళ్లు ఆయా నియోజకవర్గాలలో ఉన్నవాళ్లు, ఆ టౌన్స్‌లో ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించి ప్రత్యేక వెబ్‌సైట్ ప్రకటించాం. అది ఈ రోజు ప్రారంభిస్తున్నాను. https://migapdtcp.ap.gov.in అనే వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. ఇందులో అర్హతలకు సంబంధించి 18 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవాళ్లంతా జగనన్న స్మార్ట్ టౌన్స్‌లో ప్లాట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఉన్న ప్రాంతంలోనే స్మార్ట్ టౌన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్లాట్లకు అయ్యే డబ్బులు కూడా నాలుగు వాయిదాల్లో ఒక సంవత్సర కాలంలో చెల్లించే వెసులుబాటును కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. చెల్లింపు పూర్తయిన వెంటనే అభివృద్ధి చేసిన ప్లాటును లబ్ధిదారుడి చేతికి అందిస్తాం.
ఇలా స్మార్ట్ టౌన్స్‌లో ఇంటి స్ధలం కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆ ప్లాటు నిర్ణీత విలువలో 10 శాతం ముందుగా చెల్లించాలి. అగ్రిమెంటు చేసుకున్న నెలలోపు 30 శాతం, 6 నెలల్లోపు మరో 30 శాతం, 12 నెలలు లేదా రిజిస్ట్రేషన్ తేదీ లేదా రెండింటిలో ఏది ముందు అయితే ఆ తేదీలోపు అప్పటికి ఇంకా మిగిలిపోయిన 30 శాతం అమౌంట్ చెల్లిస్తే... రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి వాళ్లకు ప్లాటు అప్పగిస్తారు. ఇలా వాయిదాల్లో కాకుండా ఒకేసారి మొత్తం అమౌంట్ ఇచ్చే వాళ్లకు 5 శాతం రాయితీ కూడా ఇస్తారు.
*ప్రభుత్వ ఉద్యోగులకూ..*
మొన్న పీఆర్సీ ప్రకటన సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ప్రతి లేఅవుట్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు 10శాతం ప్లాట్లు 20 శాతం రిబేటుతో ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది.
జగనన్న స్మార్ట్ టౌన్స్‌లో పట్టణాభివృద్ధి సంస్ధల ద్వారా పట్టణప్రణాళికా విభాగం నియమ, నిబంధనలకు లోబడి ఏడాదిలో సమగ్ర లే అవుట్లు అభివృద్ధి చేస్తాం. ఇందులో నిబంధనలకు పక్కాగా పాటిస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఇతర రియల్ ఎస్టేట్ వాళ్లకు ఆదర్శప్రాయంగా, మంచి మోడల్ లే అవుట్‌గా నిలుస్తుంది.
*పారదర్శకంగా కేటాయింపులు*
ఇలా దరఖాస్తు చేసుకున్న వారి విషయానికొస్తే... దరఖాస్తు చేసుకున్న వారికి పూర్తి పారదర్శకంగా ప్లాట్లు కేటాయింపు ఉంటుంది. ఎక్కడా కూడా కులం, మతం, ప్రాంతంతో పాటు ఏ రాజకీయ పార్టీ అని కూడా చూడం. ఇవేవీ చూసే అవకాశమే లేని విధంగా చాలా పారదర్శకంగా కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరుగుతుంది. ఎవరి ప్రమేయం ఇందులో ఉండదు.
*లే అవుట్‌ల ప్రత్యేకతలు*
ఈ స్మార్ట్ టౌన్స్‌లో ప్రభుత్వమే లేఅవుట్లు చేస్తుంది కాబట్టి.. కుటుంబాల అవసరాలను బట్టి 150, 200, 240 గజాల స్ధలాలు ఎంచుకునే వెసులుబాటు లబ్ధిదారుడికి ఉంటుంది. పర్యావరణ హితంగాఉండే విధంగా లేఅవుట్ల విస్తీర్ణంలో 50 శాతం స్ధలం ఆ కాలనీల్లో ఉండే వారి ఉమ్మడి అవసరాలైన పార్కులు, ప్లే గ్రౌండ్స్, స్కూళ్లు, బ్యాంకులు, షాపింగ్ రిక్రియేషన్ వంటి సదుపాయాల కోసం స్ధలాలు కేటాయిస్తారు. అంతేకాకుండా విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్ టైల్స్‌తో పుట్‌పాత్‌లు, ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఉంటాయి. ఇవే కాకుండా మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్ధ, వరదనీటి డ్రైనేజీకి ఈ కాలనీల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. వీధి దీపాలతో పాటు నాణ్యమైన సదుపాయాలుంటాయి. ఎక్కడా, ఎవరూ వేలెత్తి చూపించలేని పరిస్థితిలో అభివృద్ధి చేస్తాం.
*కార్పస్ ఫండ్*
ఈ కాలనీల నిర్వహణ కోసం కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇవాళ మనం అభివృద్ది చేస్తున్న కాలనీలు భవిష్యత్తులో పాడుబడిపోకూడదు. వీటి నిర్వహణకోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి, ప్లాట్ల ఓనర్ల అసోసియేషన్‌కు ఆ కార్పస్ ఫండ్ అప్పగిస్తాం. పట్టణాభివృద్ధిసంస్ధలతో కలిసి వాటిని సంయుక్తంగా నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశాం. వీటన్నంటితో మంచి లేఅవుట్ రావాలని, మధ్యతరగతికుటుంబాలకు దీనివల్ల మంచి జరగాలని కోరుకుంటున్నాం. సరసమైన ధరలకు ఇవి అందుబాటులోకి వస్తే .. మార్కెట్‌లో ఇటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా మిగిలిన లేఅవుట్లు వేసేవాళ్లు కూడా ధరలు తగ్గించక తప్పని పరిస్థితి తయారవుతుంది. దీనివల్ల మధ్యతరగతిలో ఉన్న వారికి ధరలు తగ్గుతాయి. నాణ్యతతో కూడిని లేఅవుట్లు తయారవుతాయి. టైటిల్స్‌లో ఎలాంటి మోసాలు చేయలేని విధంగా క్లియర్ టైటిల్స్ అందుబాటులోకి వస్తాయి. ప్రతి నియోజకవర్గంలో మిడిల్ క్లాస్ ఇన్‌కంలో ఉన్నవాళ్లకు మంచి జరిపించాలని.. ఈ మంచి కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. దేవుడి దయ చల్లగా ఉండాలని, ప్రజలందరి ఆశీస్సులు కూడా ఎల్లకాలం లభించాలని కోరుకుంటూ... ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం మగించారు.
అనంతరం సీఎం శ్రీ వైయస్.జగన్ .. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ వెబ్‌సైట్‌ను కంప్యూటర్‌లో బటన్ నొక్కి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి ఎం వీ రామమనోహరరావు, ఎంఐజీ లేఅవుట్ స్పెషల్ ఆఫీసర్ బసంత్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment