శాంతికి నిలయం గుడివాడ నియోజకవర్గం

 - *- మంత్రి కొడాలి నాని ప్రతిష్ఠను దిగజార్చేందుకే టీడీపీ దుష్ట పన్నాగాలు* 

 *- శాంతికి నిలయం గుడివాడ నియోజకవర్గం


 *- అలజడులను సృష్టించేందుకు ప్రయత్నించొద్దు* 

 *- దమ్మున్న నాయకుడు మంత్రి కొడాలి నాని* 

 *- రాజకీయాలు చేయడానికే పరిమితం కావాలి* 

 *- బెదిరింపులకు భయపడే పరిస్థితి ఉండదు* 

 *- మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి* 




 గుడివాడ, జనవరి 20 (ప్రజా అమరావతి): రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ప్రతిష్టను దిగజార్చేందుకు టీడీపీ దుష్ట పన్నాగాలు పన్నుతోందని మున్సిపల్ మాజీ వైస్చర్మన్ అడపా బాబ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుడివాడ నియోజకవర్గం శాంతికి నిలయమని చెప్పారు. వరుసగా నాలుగుసార్లు మంత్రి కొడాలి నానికి నియోజకవర్గ ప్రజలు పట్టం కడుతూ వస్తున్నారని తెలిపారు. గుడివాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొడాలి నాని ఉంటే ప్రజలకు శాంతి చేకూరుతుందని భారీ మెజార్టీని కట్టబెడుతున్నారన్నారు. దీన్ని చూసి ఓర్వలేని దుష్ట శక్తులు గుడివాడ నియోజకవర్గంలో అలజడులను సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని మంత్రి కొడాలి నానికి చెందిన కే. కన్వెన్షన్లో గత ఐదేళ్ళుగా సంక్రాంతి పండుగ సమయంలో జాతీయస్థాయిలో ఒంగోలు జాతి ఎడ్లబండ లాగుడు ప్రదర్శన పోటీలను నిర్వహిస్తూ పశు పోషకులను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు. ఎంతో పండుగ వాతావరణంలో ఈ పోటీలు జరుగుతుంటాయని, రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాది మంది పశు పోషకులు, రైతులు, ప్రజలు విచ్చేస్తుంటారని తెలిపారు. అయితే కే. కన్వెన్షన్ ఆవరణలో ఈసారి క్యాసినో వంటి అసాంఘిక కార్యక్రమాలను నిర్వహించారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి కార్యక్రమాలకు, మంత్రి కొడాలి నానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. కే. కన్వెన్షన్ ఒక కళ్యాణ మండప భవనమని, పరిసరాల్లో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన స్థలాలు ఉన్నాయని, అక్కడ ఏదైనా జరిగి ఉంటే తమకు సంబంధం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని దమ్మున్న నాయకుడని, ఆయనతో రాజకీయాలు చేయాలని, ఎన్నికలప్పుడు ఆయనపై గెలవడానికి ప్రయత్నించవచ్చని సూచించారు. అలా కాకుండా మంత్రి కొడాలి నానిపై దుష్ట పన్నాగాలు పన్నితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. టీడీపీ నేతలు నిజ నిర్ధారణ కమిటీ పేరుతో వచ్చి ఏం పీకుతారని ప్రశ్నించారు. ఇప్పటికే టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా ఎస్పీ స్పందించి విచారణ జరుపుతున్నారని, నూజివీడు డీఎస్పీని విచారణ అధికారిగా నియమించడం జరిగిందన్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఎంతో ప్రశాంతంగా ఉన్నారని, కొన్ని పార్టీలు పనిగట్టుకుని ప్రశాంతతను చెడగొట్టే పనిలో ఉన్నాయన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని, లేకుంటే భవిష్యత్తులో ఉనికిని కూడా కోల్పోతారని హెచ్చరించారు. సీఎం జగన్మోహనరెడ్డికి అండగా ఉండడం వల్లే మంత్రి కొడాలి నానిపై దుష్ట పన్నాగాలు పన్నుతున్నారని అన్నారు. ఇటువంటి బెదిరింపులకు మంత్రి కొడాలి నాని భయపడే పరిస్థితి లేదని అడపా బాబ్జి  హెచ్చరించారు. వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను మాట్లాడుతూ మంత్రి కొడాలి నానిపై లేనిపోని ఆరోపణలు చేయడం సాధారణంగా మారిపోయిందన్నారు. ప్రతి ఏటా రైతులను ప్రోత్సహించేందుకు జాతీయస్థాయిలో ఒంగోలు జాతి ఎడ్లబండ లాగుడు పోటీలను మంత్రి కొడాలి నాని నిర్వహిస్తున్నారని చెప్పారు. మంత్రి కొడాలి నానిని మానసికంగా కుంగదీయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయన్నారు. సంక్రాంతి సంబరాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరిగాయంటూ రాద్దాంతం చేస్తున్నారని, ఒక వేళ జరిగి ఉంటే అప్పుడెందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని ఎలాంటి వారో నియోజకవర్గ ప్రజలకు తెలుసని అన్నారు. గుడివాడలో అసాంఘిక కార్యక్రమాలు జరిగాయని ఎవరు ఫిర్యాదు చేశారో చెప్పాలన్నారు. నిజ నిర్ధారణ కమిటీ పేరుతో గుడివాడలో శాంతి భద్రతలకు భంగం కల్గిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్లో మంత్రి కొడాలి నానిపై అనవసర రాద్దాంతం కొనసాగిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు మాట్లాడుతూ ఏది జరిగినా రాజకీయంగా వాడుకోవడం తెలుగుదేశం పార్టీకి మొదటి నుండి అలవాటుగా మారిందన్నారు. హత్యలు చేసిన వారు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారు సభ్యులుగా ఉన్న టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడలో హడావుడి చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలో ఒకలా వ్యవహరిస్తారని విమర్శించారు. ఐదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఒక్కసారైనా గుడివాడ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదన్నారు. ఇప్పుడు కమిటీ పేరుతో గుడివాడలో ఏదో సృష్టించడానికి చూస్తున్నాడన్నారు. ఇక్కడ ఏదైనా జరిగితే చంద్రబాబు, లోకేష్ లు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని గుర్తుచేశారు. ఇంకా ఏం జరిగిందని టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ వేసిందో అర్ధం కావడం లేదన్నారు. ఇప్పటికే వైసీపీ శ్రేణులు సంయమనం పాటిస్తున్నాయని, కే. కన్వెన్షన్ సమీప ప్రాంతానికి వచ్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కిరాయి రౌడీ మూకలతో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మండలి అన్నారు. గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉండదని మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవం మంత్రి కొడాలి నాని అని అన్నారు. దమ్ముంటే ఆయనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. రైతుల కోసం ఎడ్ల పందాలు నిర్వహిస్తే గోవా, క్యాసినో అంటూ ఇష్టానుసారంగా విమర్శలు చేసి నిజ నిర్ధారణ కమిటీ పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో పుష్కరాల్లో భక్తులు చనిపోతే ఎందుకు కమిటీ వేయలేదని ప్రశ్నించారు. వైసీపీ శ్రేణుల ఓర్పును పరీక్షించవద్దని సూచించారు. ఇప్పటికే టీడీపీ నాయకులు గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి విరోధకులుగా మారారని విమర్శించారు. గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసే ప్రక్రియను అడ్డుకున్నారని దుయ్యబట్టారు. మంత్రి కొడాలి నానిని వేలెత్తి చూపే అవకాశం టీడీపీ నేతలకు ఇవ్వకపోవడం వల్లే అర్ధం లేని విమర్శలు చేస్తున్నారన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే అందుకు టీడీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని నారాయణరెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో వైసీపీ నేత కొంకితల ఆంజనేయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Comments