ఇళ్ల నిర్మాణ పనులను ముమ్మరంగా చేపట్టేందుకు అధికారులు సమాయత్తం కావాలి


నెల్లూరు, జనవరి 7 (ప్రజా అమరావతి) : జిల్లాలోని జగనన్న కాలనీల్లో  గతంలో మొదలు కాని సుమారు పదకొండు వేల ఇళ్ల నిర్మాణ పనులు ఈ వారం చేపట్టిన ప్రత్యేక మేళాలో మొదలయ్యాయని, ఇదే ఉత్సాహంతో మరింత వేగంగా ఇళ్ల నిర్మాణాలలో పురోగతి సాధించేందుకు ప్రత్యేక అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు.


 శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో  జగనన్న ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 29 వేల ఇళ్ళు గతంలో మొదలు పెట్టకపోవడంతో ఈ వారం ప్రత్యేక మేళా నిర్వహించి లబ్ధిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో  సుమారు 11000 ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఇకనుంచి ఇదే స్ఫూర్తితో ఇళ్ల నిర్మాణ పనులను ముమ్మరంగా చేపట్టేందుకు అధికారులు సమాయత్తం కావాలన్నారు. పనులు పూర్తయిన వెంటనే దశలవారీ బిల్లులను ప్రభుత్వం ప్రతి సోమవారం లబ్ధిదారులు, కాంట్రాక్టర్ల ఖాతాలలో జమ చేస్తుందన్నారు. లబ్ధిదారులు, కాంట్రాక్టర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, లేఅవుట్లలో  పెండింగ్లో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని  ఆదేశించారు. లే అవుట్లలోనే ఇటుకల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పూర్తయిన గృహాలకు త్వరగా విద్యుత్ సరఫరా ఇవ్వాలన్నారు. డిఆర్డిఎ, మెప్మా ఆధ్వర్యంలో రుణాలు పొందిన పొదుపు మహిళలు ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన మొదలు పెట్టాలని సూచించారు. అలాగే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద నగదు చెల్లించిన లబ్ధిదారులకు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. ఇంకా మిగిలి ఉన్న లబ్ధిదారులతో మాట్లాడి ప్రయోజనాలను వివరించి వారు నగదు చెల్లించేలా ప్రోత్సహించాలన్నారు. రానున్న మూడు వారాలపాటు జగనన్న ఇళ్ల నిర్మాణాలు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పురోగతి సాధించిన వారికి ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రివార్డులు అందజేస్తామన్నారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు శ్రీ హరేంధిర ప్రసాద్,శ్రీ గణేష్ కుమార్, శ్రీ విదేహ్ ఖరె,  శ్రీమతి రోజ్ మాండ్, మున్సిపల్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్, హౌసింగ్, డిఆర్డిఎ పీడీలు శ్రీ వేణుగోపాల్, శ్రీ సాంబశివా రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి ధనలక్ష్మి, తెలుగుగంగ ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ శ్రీ నాగేశ్వర రావు, విద్యుత్ శాఖ, పబ్లిక్ హెల్త్ ఎస్ఈలు శ్రీ విజయ్ కుమార్ రెడ్డి, శ్రీ జానీ, జడ్పీ సీఈవో శ్రీ ఎం శ్రీనివాసరావు, నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు, కావలి ఆర్టీవోలు శ్రీ హుస్సేన్ సాహెబ్, శ్రీ మురళీకృష్ణ, చైత్ర వర్షిని, శ్రీ శీనా నాయక్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.