గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయండి:సిఎస్ డా.సమీర్ శర్మ

 గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయండి:సిఎస్ డా.సమీర్ శర్మ


అమరావతి,12 జనవరి (ప్రజా అమరావతి):ఈనెల 26వతేదీన విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న 73వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘణంగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన పటిష్ట ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.ఈమేరకు గణతంత్ర దినోత్సవ సన్నాహక ఏర్పాట్లపై బుధవారం అమరావతి సచివాలయం నుండి వీడియో సమావేశం ద్వారా వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ డా.సమీర్ శర్మ మాట్లాడుతూ రానున్న 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయ వంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లను పటిష్టవంతంగా చేయాలని ఎక్కడా ఎలాంటి లోపాలకు తావీయవద్దని స్పష్టం చేశారు.ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వీలుగా వివిధ శాఖల శకటాలను(టాబ్లూస్)గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా శకటాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రధాన వేదిక,ప్రాంగణంలో ప్రముఖులు,ఇతరులకు అవసరమైన సీటింగ్ ఏర్పాట్లు వంటివి సక్రమంగా చేపట్టాలని సిఎస్ డా.సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు.

వీడియో లింక్ ద్వారా రాష్ట్ర సమాచారశాఖ కమీషనర్ టి.విజయ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా గత ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మీడియాకు పరిమిత సంఖ్యలో సీటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈసారి కూడా అదీ రితిలో ఏర్పాట్లు చేయనున్నట్టు చెప్పారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలు కార్యక్రమాలపై గవర్నర్ వారి సందేశం సిద్దం చేసేందుకు రాష్ట్ర ప్రణాళికాశాఖ సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని సిఎస్ కు వివరించారు. ఇప్పటి వరకూ ఏడు శకటాలను ఖరారు కాగా మరికొన్ని చేయాల్సి ఉందని చెప్పారు. 

అంతకు ముందు రాష్ట్ర ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి స్వాగతం పలికి వివిధ శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లు,మినిట్ టు మినిట్ కార్యక్రమం వివరాలను వివరించారు. ఈనెల 26న విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉ.8.30గం.ల నుండి కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు.ఉ.8.57గం.లకు రాష్ట్ర ముఖ్యమంత్రి,8.58 గం.లకు రాష్ట్ర గవర్నర్ వేదికవద్దకు చేరుకుని ఉ.9గం.లకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు.తదిపరి గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించారు.అనతంరం పోలీస్,సమాచారశాఖ,టిఆర్అండ్బి,విద్యుత్,మున్సిపల్ పరిపాలన,సాధారణ పరిపాలన శాఖ,ఎపిఎస్ ఆర్టీసీ,వైద్య ఆరోగ్యం,రవాణా,ఉద్యానవన, అగ్నిమాపక సాంఘిక సంక్షేమం,ఎన్సిసి,ఆర్ధిక తదితర శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లను వివరించి ఆయా ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించాలని సూచించారు.

ఈవీడియో సమావేశంలో వివిధ శాఖల అధికారులు వీడియో లింక్ ద్వారా పాల్గొని వారి శాఖల పరంగా చేయనున్న ఏర్పాట్లను సిఎస్ డా.సమీర్ శర్మకు వివరించారు.