విద్యార్థులు అందరికన్నా మిన్నగా ఉండాలి
ఫిబ్రవరిలో గురజాడ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించనున్న సిఎం
రాష్ట్ర పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ
మూడేళ్లలో విద్యకు లక్షకోట్లు ఖర్చు చేశాం
రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్
జెఎన్‌టియులో నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన
విజయనగరం, జనవరి 12 (ప్రజా అమరావతి) ః అందరిలో ఒకరిలా కాకుండా, అందరికన్నా మిన్నగా ఉండేందుకు విద్యార్థులు కృషి చేయాలని, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రతీ విద్యార్థీ ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, దానిని సాధించేందుకు కృషి చేయాలని కోరారు. స్థానిక జెఎన్‌టియు విశ్వవిద్యాలయంలో నిర్మించనున్న నూతన భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం బుధవారం జరిగింది. సుమారు రూ.17.99 కోట్లతో అకడమిక్ బ్లాక్, రూ.3.25 కోట్లతో బాలికల హాస్టల్, రూ.1.25కోట్లతో సివిల్ ఇంజనీరింగ్ ల్యాబ్, రూ.1.25 కోట్లతో మెటలర్జికల్ ఇంజనీరింగ్ ల్యాబ్, రూ.1.20 కోట్లతో వాటర్ ట్యాంకు నిర్మాణ పనులను, మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు.
అనంతరం కళాశాల మైదానంలో జరిగిన జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమంలో, స్వామి వివేకనంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ స్వామీ వివేకానందుడు అందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. విజయనగరం జిల్లాలో జెఎన్‌టియు క్యాంపస్‌ను నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేశారని, ఆయన తనయులు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి, పూర్తిస్థాయి విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి, జెఎన్‌టియు గురజాడ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారని మంత్రి వెళ్లడించారు. ఈ విశ్వవిద్యాలయానికి ప్రస్తుతం ఉన్న 80 ఎకరాలకు అదనంగా, మరో 40 ఎకరాలను కేటాయిస్తామని ప్రకటించారు. కొత్తగా పరిశోధనా శాలలు, ఆడిటోరియం, పరిపాలనా భవనం నిర్మాణానికి నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 26వ జాతీయ రహదారి నుంచి జెఎన్‌టియు వరకు 80 అడుగుల విస్తీర్ణంలో డబుల్ రోడ్డును నిర్మించనున్నట్లు చెప్పారు. విద్యపై ఖర్చు చేసే ప్రతీ పైసా, మానవాభివృద్దికి, సమాజాభివృద్దికి పెట్టుబడిగా తమ ప్రభుత్వం భావిస్తోందని మంత్రి బొత్స అన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసే డబ్బు అంతా ప్రజల డబ్బు అని, దానిని సార్ధకం చేయాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని అన్నారు. కష్టపడి చదవాలని, గొప్ప వ్యక్తులుగా ఎదగాలని కోరారు. ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి ఎదిగితే, ఆ వ్యక్తి కుటుంబానికే కాకుండా, ఆ ఊరికి, ఆ రాష్ట్రానికి కూడా గొప్ప పేరు వస్తుందని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రతీఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని మంత్రి కోరారు.
రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, విద్య, వైద్యం, వ్యవసాయం తమ ప్రభుత్వానికి ప్రాధాన్యతాంశాలని పేర్కొన్నారు. విద్యకు ఎనలేని ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్‌లో దాదాపు 16 శాతాన్ని కేటాయించి, ఈ 31 నెలల్లోనే సుమారు లక్ష కోట్ల రూపాయలను తమ ప్రభుత్వం ఖర్చు చేసిందని వెళ్లడించారు. విద్యలో అందరికీ సమాన అవకాశాలను కల్పించాలన్న లక్ష్యంతో, విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు, ఉత్తమ పద్దతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు. పేదరికం విద్యకు అడ్డుకాకూడదని, ఉన్నత విద్య దూరం కాకూడదన్న గొప్ప సంకల్పంతో, పూర్తి ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ప్రైమరీ, ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఫౌండేషన్ స్కూల్స్, శాటిలైన్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ప్రయివేటు విద్యాసంస్థలకు వందల ఎకరాలను ధారాదత్తం చేసి, ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. డబ్బుంటేనే ఉన్నత విద్య అన్న అభిప్రాయాన్ని, నాటి ప్రభుత్వం కల్గించిందని ఆరోపించారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో కూడా 35 శాతం సీట్లను పేదలకు కేటాయించేలా చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డిదేనని కొనియాడారు. ప్రతీ జిల్లాకు ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న తమ విధానంలో భాగంగా, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు కొత్తగా యూనివర్సిటీలను మంజూరు చేసినట్లు చెప్పారు. అలాగే ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికీ ఒక నైపుణ్యాభివృద్ది సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ, ప్రతీ విద్యార్థికీ ఉన్నత లక్ష్యాలు ఉండాలని సూచించారు. ఎన్నో అంతర్జాతీయ వ్యాపార సంస్థలకు సిఇఓలుగా భారతీయులే ఉన్నారని, సిఇఓలకు మన దేశం పేరుగాంచిందని పేర్కొన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని, ఉన్నత స్థానానికి ఎదిగేందుకు కృషి చేయాలని కోరారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని, మనల్ని మనమే స్పూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలని కలెక్టర్ సూచించారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, గజపతినగరం ఎంఎల్ఏ బొత్స అప్పలనరసయ్య, జెఎన్‌టియు కాకినాడ వైస్ ఛాన్సలర్ జివిఆర్ ప్రసాదరాజు, ఛీఫ్ ఇంజనీర్ వి.శ్రీనివాసరావు, విజయనగరం ప్రిన్సిపాల్ జి.స్వామినాయుడు, ఇసి మెంబర్ డి.భవానీ, రిజిష్ట్రార్ ఎల్.సుమలత, రెక్టార్ కె.రమణ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment