ప్రతి ఎకరాకు సాగునీరు
ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలి
ఈ నెల 29 నుంచి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన
జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష
విజయనగరం, జనవరి 22 (ప్రజా అమరావతి) ః
జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై ఇంజనీరింగ్ అధికారులతో తన ఛాంబర్‌లో శనివారం ఛైర్మన్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎంఎల్ఏలతో కలిసి తోటపల్లి, తారకరామతీర్ధసాగర్, జంఘావతి తదితర ప్రాజెక్టుల వారీగా సమీక్షిస్తూ, పనులు నిర్వహించడానికి ఇది ఎంతో అనుకూల సమయమని, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే ఖరీఫ్ నాటికి నీరందించే విధంగా పనులు పూర్తికావాలని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా భూసేకరణ పనులను పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను కోరారు. ప్రజలనుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకొని, ఆయా ప్రజాప్రతినిధుల సూచనల మేరకు సమగ్ర ప్రణాళికను రూపొందించి, పనులను పూర్తి చేయాలని సూచించారు. జంఝావతి ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. పార్వతీపురం పట్టణానికి వరహాలగెడ్డ నుంచి ముంపు సమస్య ఉందని, దీని పరిష్కారానికి అదనపు నీటిని జంఝావతి కాలువలోకి మళ్లించాలని పార్వతీపురం ఎంఎల్ఏ అలజంగి జోగారావు కోరారు. శివారు భూములకు కూడా సాగునీరు అందేలా కాలువల నిర్మాణం జరగాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, జిల్లాపై మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డికి ప్రత్యేక అభిమానం ఉందని, ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులను మంజూరు చేశారని చెప్పారు. తోటపల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేయడానికి, మంత్రి బొత్స సత్యనారాయణ కృషితో రూ.120 కోట్లు మంజూరయ్యిందని, ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి వెంటనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా ప్యాకేజ్-1 పనులను ఈ నెల 29న పిరిడి వద్ద, ప్యాకేజ్-2 పనులను ఫిబ్రవరి 5న పూసపాటిరేగ మండలం కందివలస వద్ద ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే జిల్లాలోని చిన్న, మద్యతరహా ప్రాజెక్టుల ఆధునీకరణకు రూ.181.77 కోట్లు జైకా నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వీటితో పెద్దగెడ్డ, వెంగళరాయసాగర్, ఒట్టిగెడ్డ తదితర ప్రాజెక్టులను ఆధునీకరించనున్నట్లు వెళ్లడించారు. పెద్దగెడ్డ ఆధునీకరణ పనులను ఈ నెల 30న పాంచాలి వద్ద, పెదంకలాం పనులను ఫిబ్రవరి 2న బలిజిపేటవద్ద, వెంగళరాయసాగర్ పనులను ఫిబ్రవరి 9న మక్కువ వద్దా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఆండ్ర ప్రాజెక్టు ఆధునీకరణ పనులు ఇప్పటికే 66శాతం పూర్తయ్యాయన్నారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయితే, జిల్లా అంతా సస్యశ్యామలం అవుతుందని ఛైర్మన్ అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని సుమారు 4.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. దీనికోసం ఇప్పటికే సర్వే కూడా పూర్తి అయ్యిందన్నారు. 2022 సంవత్సరమంతా పూర్తిగా సాగునీటి రంగంపైనే దృష్టి పెడతామన్నారు. అడారుగెడ్డ, కంచరగెడ్డ, వరహాల గెడ్డ ప్రాజెక్టులకోసం, మంత్రి బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ద్వారా ప్రభుత్వం నుంచి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు. నిర్ణీత కాలవ్యవధిని పెట్టుకొని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అన్నివిధాలుగా రైతాంగాన్ని ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించే తోటపల్లి ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహనరెడ్డి హయాంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికానుందంటూ ఛైర్మన్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో బొబ్బిలి ఎంఎల్ఏ శంబంగి వెంకట చినప్పలనాయుడు, సాలూరు ఎంఎల్ఏ పీడిక రాజన్నదొర, పార్వతీపురం ఎంఎల్ఏ అలజంగి జోగారావు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్, ఎస్‌డిసి ఎస్.వెంకటేశ్వర్లు, ఛీఫ్ ఇంజనీర్ ఎస్.సుగుణాకరరావు, బొబ్బిలి ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఇ ఎన్.రాంబాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఆర్.రామచంద్రరావు, ఆర్.అప్పలనాయుడు, పివి తిరుపతిరావు, డిఇలు, ఇతర అధికారులు పాల్గొన్నారు
addComments
Post a Comment