ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో 'స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ - ఇంప్లిమెంటేషన్ మెకానిజమ్ వర్క్ షాప్'



                       


• ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో 'స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ - ఇంప్లిమెంటేషన్ మెకానిజమ్ వర్క్ షాప్'

• అన్ని జిల్లాల నుంచి హాజరైన ప్రభుత్వ ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాల్స్ 

• విద్యార్థులకు చదువుతోపాటు ఎలాంటి కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలన్న అంశాలపై చర్చ

• టెక్నికల్ ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్, ఎపిఎస్‌ఎస్‌డిసి సమన్వయంతో పనిచేయడంపైనా చర్చ

 

అమరావతి (ప్రజా అమరావతి):


విజయవాడలో 'స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ - ఇంప్లిమెంటేషన్ మెకానిజమ్' పేరుతో పాలిటెక్నిక్, ఐటిఐ, డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాల్స్ తో టెక్నికల్ ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, కాలేజియేట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ లావ్యణ్యవేణి, ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి ఎన్. బంగార రాజుతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఎంపిక చేసిన కాలేజీల ప్రిన్సిపాల్స్ హాజరయ్యారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీల్లో అమలు చేస్తున్న శిక్షణా కార్యక్రమాలను సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.వి. రామకోటి రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 


ఈ సందర్భంగా ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి మాట్లాడుతూ..  విద్యార్థులు చదువుకుంటున్న సమయంలోనే అదనపు నైపుణ్యాలు కల్పించడం కోసం అవసరమైన శిక్షణా కార్యక్రమాలు అమలు చేయడంపై దృష్టి సారిస్తున్నామన్నారు. నియోజకవర్గానికి ఒక ఫినిషింగ్ స్కూల్స్ కాన్సెప్ట్ ను తీసుకురావాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన అన్నారు. అందుకు అనుగుణంగానే అందులో భాగంగానే ఇప్పుడు అమలు చేస్తున్న నైపుణ్య శిక్షణా కార్యక్రమాలతోపాటు ఐటిఐ, పాలిటెక్నికల్, డిగ్రీ కాలేజీల్లో ఎలాంటి కోర్సులు ప్రవేశపెడితే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నది ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్ ద్వారా తెలుసుకోవడానికి ఈ వర్క్ షాపు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 


అనంతరం కాలేజియేట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీల్లో ఎలాంటి కోర్సులను విద్యార్థులకు అందిస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నది తెలుసుకోవడం కోసమే ఈ వర్క్ షాప్ ఏర్పాటు చేశామన్నారు. వీటితోపాటు టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్, ఎపిఎస్‌ఎస్‌డిసి కలిసి ఎలా పనిచేయాలన్న దానిపైనా ప్రధానంగా దృష్టిసారించామన్నారు. ప్రిన్సిపాల్స్ నుంచి తీసుకున్న సలహాలు సూచనలను క్రోడీకరించి భవిష్యత్ లో శిక్షణా కార్యక్రమాల అమలుతోపాటు ఈ మూడు విభాగాలు ఎలా పనిచేయాలన్నది నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. అనంతరం ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ లావణ్య వేణి మాట్లాడుతూ.. టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్, ఎపిఎస్‌ఎస్‌డిసి సమాంతరంగా పని చేస్తున్నాయని.. అలా కాకుండా అన్ని విభాగాలు కలిసి సంయుక్తంగా శిక్షణా కార్యక్రమాలు అమలు చేయడంపై దృష్టిసారిస్తున్నామన్నారు. పరిశ్రమల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం కోసం అవసరమైన మౌళికసదుపాయాలను సమకూర్చుకోవడం లేదంటే ఆయా పరిశ్రమలతో భాగస్వామ్యమై శిక్షణ ఇప్పించడపై దృష్టిసారిస్తున్నామని.. ఇవన్నీ జరగాలంటే అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని.. అందుకోసమే ఈ వర్క్ షాప్ ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు.


ఈ సందర్భంగా ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి ఎన్. బంగారరాజు మాట్లాడుతూ.. ఐటి, సర్వీసెస్, అగ్రికల్చర్, హెల్త్ కేర్, నిర్మాణ రంగాల్లోని పరిశ్రమల యొక్క అవసరాలు తెలుసుకునేందుకు ఆయా సంస్థల ప్రతినిధులతో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో వర్క్ షాపులు నిర్వహించామన్నారు. అక్కడ వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా తమ శిక్షణా కార్యక్రమాలను అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. యువతకు పరిశ్రమల సహకారంతోనే పరిశ్రమల ఆధారిత నైపుణ్య శిక్షణ ఇచ్చి అక్కడే ఉద్యోగాలు పొందేలా చేస్తున్నామన్నారు. డిగ్రీ, ఐటిఐ, పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ పైన నాంది, వాద్వానీ, డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ లాంటి వారి సహకారంతో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని బంగారరాజు తెలిపారు.

Comments