అమరావతి (ప్రజా అమరావతి)
:
ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన 17మందితోపాటు ఇతర సభ్యులంతా మంగళవారం రాష్ట్రానికి చేరుకున్నారు. వీరందరికీ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఎయిర్ పోర్టులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) జిల్లా అధికారులు స్వాగతం పలికారు.
14మంది సభ్యులతో కూడిన మొదటి బృందం విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. వీరికి నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఆర్డీఏ పరిధి అధికారి ప్రణయ్ ఇతర సిబ్బంది స్వాగతం పలికారు. విజయవాడకు చేరుకున్న 14మందిలో ఐదుగురు నైపుణ్య పోటీల్లో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించిన విజేతలు ఉన్నారు.
మరోవైపు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకున్న 11మంది సభ్యుల బృందానికి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి చాముండేశ్వరరావుతోపాటు సంస్థ సిబ్బంది స్వాగతం పలికారు. ఈ బృందంలో ఐదుగురు విజేతలు ఉన్నారు. తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఒక అభ్యర్థికి చిత్తూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి శ్యామ్ మోహన్, సిబ్బంది స్వాగతం పలికారు. మిగిలిన సభ్యులు సోమవారం రాత్రే రాష్ట్రానికి చేరుకున్నారు.
ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో 17 విభాగాల్లో 30 మంది సభ్యుల బృందం ఢిల్లీలో ఈనెల 6 నుంచి 10వరకు జరిగిన జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో 9 విభాగాల్లో 7 బంగారు పతకాలు, 4 రజత, 2 కాంస్య పతకాలు సాధించారు. ప్రత్యేక ప్రతిభ కనబరిచిన కేటగిరీలో మరో నలుగురికి మెడల్స్ దక్కాయి.
ఈ సందర్భంగా నైపుణ్య పోటీల్లో పాల్గొని విజేతలుగా రాష్ట్రానికి చేరుకునకన అభ్యర్థులు మాట్లాడుతూ.. ఈ ఏడాది అక్టోబర్ లో చైనాలోని షాంఘై నగరంలో జరగబోయే నైపుణ్య పోటీల్లో పాల్గొని దేశానికి, రాష్ట్రానికి పతకం సాధించడమే తమ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీల్లో విజయం సాధించినప్పటి నుంచీ నైపుణ్య పోటీలకు ఎంపికైన తమకు ఆయా రంగాల నిపుణులతో నైపుణ్య శిక్షణ ఇప్పించడంతోపాటు అన్నిరకాల సహాయ సహకారాలు ఎపిఎస్‌ఎస్‌డిసి అధికారులు అందించారన్నారు. వారి సహకారం, పర్యవేక్షణతోనే తాము జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటగలిగామని.. ఈ అవకాశం కల్పించిన ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ) చల్లా మధుసూదన్ రెడ్డితోపాటు ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి ఎన్. బంగారరాజు ఇతర అధికారులకు పోటీల్లో విజేతలుగా నిలిచినవారు కృతజ్ఞతలు తెలిపారు.
addComments
Post a Comment