ఉమ్మడి కార్యచరణ ప్రణాళికతో 'మానవ అక్రమ రవాణా నిరోధం'


ఉమ్మడి కార్యచరణ ప్రణాళికతో 'మానవ అక్రమ రవాణా నిరోధం' - రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడి

- టాస్క్ ఫోర్స్ టీమ్ ల ఏర్పాటు

- కళాశాలల్లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ క్లబ్‌ల ఏర్పాటు

- సరిహద్దు ప్రాంతాల్లో విద్యావనరుల పెంపుపై దృష్టి

- బాల్యవివాహ శిక్షలపై అబ్బాయిలకూ కౌన్సిలింగ్: ముఖ్య కార్యదర్శి అనూరాధ

- మానవ అక్రమరవాణాపై అర్ధవంతంగా సమన్వయ సమావేశం


అమరావతి (ప్రజా అమరావతి):

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన "దిశ" చట్టమనేది ఒక బిల్లుగా మాత్రమే చూడరాదని.. మహిళలు, బాలికల సంరక్షణకు ఒక సమగ్రమైన ప్రణాళికగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. మంగళవారం స్థానిక మంగళగిరిలోని మహిళా కమిషన్ కార్యాలయంలో ' మానవ అక్రమ రవాణా నిరోధం, బాలల, మహిళల లైంగిక దోపిడీ'పై  సమన్వయ సమావేశం నిర్వహించారు. కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సమావేశానికి నేతృత్వం వహించగా, మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అనూరాధ, సీఐడీ అడిషనల్ ఎస్పీ కెజి సరితతో పాటు కమిషన్ సభ్యులు కె.జయశ్రీ, గజ్జల లక్ష్మీ, కమిషన్ కార్యదర్శి శైలజ, డెరెక్ట్ ఆర్.సూయజ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పలు ఎన్జోవోసంస్థల ప్రతినిధులు చర్చించారు. 

ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖలతో సమ్రమైన ప్రణాళికతో మానవ అక్రమ రవాణాను నిరోధించాలన్నారు. ఈ మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులిచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ పోలీస్‌స్టేషన్‌ల తరహాలోనే యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ (ఏహెచ్‌టీయూ)లకు పోలీస్‌స్టేషన్‌ హోదా కల్పించే అవకాశం ఉందన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏహెచ్‌టీయూల ఏర్పాటు జరుగుతుందని.. ఆ మేరకు ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్తున్నామని వివరించారు.  బాధితులను రక్షించేందుకు, అక్రమ రవాణాకు పాల్పడే ముఠాల ఆట కట్టించేందుకు హద్దులు, అడ్డంకులు లేకుండా ఎక్కడికైనా వెళ్లేలా ఏహెచ్‌టీయూ బృందాలకు అధికారం కల్పించాలని వాసిరెడ్డి పద్మ ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. మహిళా శిశుసంక్షేమ శాఖ సిబ్బందితో పాటు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్ లు ఏర్పాటు చేసి మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ టీమ్‌లు స్థానిక దిశ పోలీస్‌స్టేషన్, సివిల్‌ పోలీసులను సమన్వయం చేసుకుని మానవ అక్రమ రవాణా నిరోధానికి చర్యలు తీసుకుంటాయని చెప్పారు. బాధితులకు పునరావాసం, సహాయం తదితర చర్యలు చేపట్టేందుకు మిగిలిన శాఖలను కూడా సమన్వయం చేసుకునేలా ప్రణాళికను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.


అబ్బాయికి కౌన్సిలింగ్ అవసరం:

మారుమూల ప్రాంతాల్లో బాల్యవివాహాల ద్వారా మానవ అక్రమ రవాణా జరుగుతుందనే ఫిర్యాదులపై మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనూరాధ స్పందించారు. ప్రభుత్వ సిబ్బంది, ఎన్జీవోలు బాల్యవివాహాల కేసులలో అమ్మాయిల కంటే ముందుగా అబ్బాయి, అతని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం మంచిదన్నారు. పోక్సోచట్టం శిక్షల ఖరారును తెలియపరిచి అవగాహన చేయాలని పిలుపునిచ్చారు. మానవ అక్రమ రవాణా పై ప్రభుత్వం ఇప్పటికే పటిష్ట చర్యలు తీసుకుంటుందని... వివిధ ప్రభుత్వ శాఖల ఉమ్మడి కార్యచరణ అవసరమన్నారు. 


బాధితులకు తక్షణ న్యాయం: అడిషనల్ ఎస్పీ సరిత


త్వరలోనే అన్ని జిల్లాల్లో ఏహెచ్‌టీయూ(యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్)లు ఏర్పాటవుతాయని

సీఐడీ అడిషనల్ ఎస్పీ కెజి సరిత అన్నారు. వీటికి పోలీస్‌స్టేషన్‌ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల కేసుల నమోదు, దర్యాప్తు వేగంగా జరిగి దోషులకు శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. బాధితులకు తక్షణ న్యాయం, వారికి పునరావాసం, పరిహారం అందుతుందని చెప్పారు. సమావేశంలో కడప నుంచి భారతరత్న మహిళా మండలి, భూమిక ఫౌండేషన్, వాసవ్య, విముక్తి సంస్థ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, మేరీస్ స్టెల్లా కళాశాల, అనంతపురం ఉజ్వలహోమ్స్, రెడ్ రోప్, సీఈఆర్ఏ, ఎస్ఎల్ఈడీసీ తదితర సంస్థల ప్రతినిధులు, దిశ పోలీసు అధికారులు పాల్గొన్నారు. 


'అల్లూరి' క్యాలెండర్‌ ఆవిష్కరణ:


మాదేటి రాజాజి ఆర్ట్ అకాడమీ రూపొందించి ఢిల్లీ స్థాయిలో అవార్డులు పొందిన విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు చిత్రాలతో ఉన్న క్యాలెండర్ ను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, మహిళా శిశుసంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనూరాధ చేతులమీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆర్ట్ అకాడమీ ఫౌండర్ కార్యదర్శి మాదేటి రవిప్రకాష్, ఉపాధ్యక్షుడు రవికాంత్ క్యాలెండర్ ఆవిష్కరణ అతిధులకు జ్ఞాపికలు అందజేశారు.


Comments